‘దివ్యాంగులు’ పదం అవమానకరమా?

సమాజంలో అనేక వివాదాలు చెలరేగుతుంటాయి. ఒకవిధంగా చెప్పాలంటే విదాదం కానిదంటూ ఏమీలేదు. ఏదోవిధంగా వివాదాలు పుట్టిస్తుంటారు కూడా. భాషకు (ప్రతి భాషలోనూ) సంబంధించిన వివాదాలు చాలావున్నాయి. అవే కాదు, భాషలోని పదాలకు సంబంధించి కూడా…

సమాజంలో అనేక వివాదాలు చెలరేగుతుంటాయి. ఒకవిధంగా చెప్పాలంటే విదాదం కానిదంటూ ఏమీలేదు. ఏదోవిధంగా వివాదాలు పుట్టిస్తుంటారు కూడా. భాషకు (ప్రతి భాషలోనూ) సంబంధించిన వివాదాలు చాలావున్నాయి. అవే కాదు, భాషలోని పదాలకు సంబంధించి కూడా అనేక వివాదాలున్నాయి. ఒకప్పుడు సమాజంలో వాడుకలో ఉన్న పదాలు ఇప్పుడు లేవు. అనేక సాంకేతిక, సామాజిక కారణాలతో కొన్ని పదాలు కనుమరుగైపోగా, కొన్నింటిని ప్రభుత్వాలు నిషేధించాయి. ముఖ్యంగా కులానికి సంబంధించిన కొన్ని పదాలు అవమానకరంగా ఉన్నాయనే ఉద్దేశంతో వాటిని నిషేధించారు.

పూర్వకాలంలో కులాల ప్రభావం చాలా ఉండేది. కులం పేరుతో దూషించేవారు. కులం పేరుతో సామెతలు పుట్టాయి. జనం మామూలుగా మాట్లాడుకునేటప్పుడు కూడా కుల ప్రస్తావన ఉండేది. 'మీదే కులం' అని అడగడం పాత రోజుల్లో సాధారణం. కులం కారణంగా అనేక అనర్థాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో కుల ప్రస్తావన తీసుకురాకూడదనే అభిప్రాయం బలపడింది. 'మీదే కులం' అని అడిగేవారు దాదాపు ఇప్పుడు ఎవ్వరూ లేరు. కులం పేరుతో, వృత్తుల పేరుతో మనుషులను అవమానించేవారు. అలాగే శారీరక, మానసిక లోపాల వల్ల పుట్టినవారిని లేదా ఏవో కారణాల వల్ల ఆ లోపాలతో ఉన్నవారిని అవమానకరంగా మాట్లాడేవారు.

కాలక్రమంలో అనేక అభ్యంతరకర పదాలను సమాజం నిరసించింది. అలాంటి పదాలను పలకడం, రాయడం నిషేధించారు. అభ్యంతరకరంగా ఉన్నాయని భావించిన అనేక పదాలకు ప్రత్యామ్నాయ పదాలను సృష్టించారు. ఇది ఏ ఒక్క భాషకో పరిమితం కాలేదు. ఆంగ్లంలో మార్చిన పదాలను తెలుగులోకి అనువాదం చేసుకొని వాడుతున్నాం. కొంతకాలం కిందట అలా సృష్టించిన పదం 'దివ్యాంగులు'. ఇది వికలాంగులు అనే పదానికి ప్రత్యామ్నాయంగా వాడుకలోకి తెచ్చుకున్న పదం. వికలాంగుల్లో మానసిక, శారీరక వికలాంగులు ఉన్నారు. ఒకప్పుడు వీరిని 'ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్‌', మెంటల్లీ హ్యాండీక్యాప్డ్‌' అని అనేవారు.

తెలుగులో శారీరక వికలాంగులు అని, మానసిక వికలాంగులని అనేవారు. కొంతకాలం తరువాత ఆంగ్లంలో ఫిజికల్లీ ఛాలెంజ్‌డ్‌, మెంటల్లీ ఛాలెంజ్‌డ్‌ అనే పదాలను ఖరారు చేశారు. సమాజంలో ఒకప్పుడు వికలాంగులంటే ఎందుకూ పనికిరానివారని ఈసడించుకునేవారు. కాని వారు కూడా శక్తిమంతులేనని, పట్టుదలతో విజయాలు సాధించగలరనే అభిప్రాయం బలపడిన తరువాత వారిని గౌరవిస్తున్నారు. తెలుగులో దివ్యాంగులు (దివ్యమైనవారు) అని వ్యవహరిస్తున్నారు. ఇది గౌరవనీయంగానే ఉంది. కాని ఈ పదం అవమానకరంగా, వివాదాస్పదంగా ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన వికలాంగ హక్కుల కమిటీ (సిఆర్‌పిడి) గుర్తించింది. ఈ అభిప్రాయాన్ని జెనీవాలో జరుగుతున్న కమిటీ 22వ సెషన్‌లో తెలియచేసింది. దివ్యాంగులు అనే పదం 'మతిస్థిమితం లేనివారు' అనే పదంతో సమానమట..!

ఫిజికల్లీ ఛాలెంజ్‌డ్‌, మెంటల్లీ ఛాలెంజ్డ్‌ పదాలు ఏ విధంగా అవమానకరమో అర్థంకావడంలేదు. మరి వీటికి ప్రత్యామ్నాయ పదాలు సిఆర్‌పిడి తెలియచేసినట్లు సమాచారం లేదు. ఇదిలా పక్కనుంచితే ఒకప్పుడు కుల ప్రస్తావనను నిరసించిన జనం ఇప్పుడు కులాల గురించి యధేచ్ఛగా మాట్లాడుతున్నారు. ఇది రాజకీయ నాయకుల చలవే. 'కుల అస్తిత్వం' అనే భావన పాపులరైంది. కుల సంఘాలు రాజ్యమేలుతున్నాయి. ఒకప్పుడు కులం పేరుతో మాట్లాడటం మంచిది కాదనుకున్న సమాజంలో ఇప్పుడు కులాల గురించి సదరు కుల సంఘాల నాయకులే బహిరంగంగా మాట్లాడుతున్నారు. వారి పేర్ల వెనక కులం తోక తగిలించుకుంటున్నారు.

సమాజంలో మొదటినుంచి బ్రాహ్మల పేర్లకు వెనక శర్మ, శాస్త్రి పదాలున్నాయి. అలాగే రెడ్డి, రాజు సదరు కులాలవారు తగిలించుకున్నారు. అంటే అగ్రవర్ణాలవారు కులాన్ని సూచించే పదాలు చేర్చుకునేవారు. వీరిలోనూ కులాలను నిరసించేవారు తోకలను తీసేసుకున్నారు. ఉదాహరణకు… పుచ్చలపల్లి సుందరయ్య 'రెడ్డి' పదాన్ని వదిలేశారు. గోపరాజు రామచంద్రరావు గో.రా. అని మార్చుకున్నారు. అయితే కాలక్రమంలో అట్టడుగువర్గాలవారు తమ రాజకీయ, సామాజిక అస్తిత్వ పోరాటంలో భాగంగా తమ పేర్ల వెనుక కులం తోకలు పెట్టుకుంటున్నారు. ఇది తప్పు కాకుండాపోయింది. ఉదాహరణకు…మంద కృష్ణ మాదిగ. అలాగే మాల, కుర్మ, రజక… ఇలా అనేక కులాలవారు పేర్ల వెనక తోకలు పెట్టుకుంటున్నారు.

ఒకప్పుడు తప్పయినదే ఇప్పుడు ఒప్పు కావడమే విచిత్రం. సినిమా టైటిల్స్‌లో కొన్ని కులం పేరుతో ఉన్నాయి. ఉదాహరణకు…అర్జున్‌ రెడ్డి. ఇది వివాదం కాలేదు. కాని ఈమధ్య 'వాల్మీకి' అనే టైటిల్‌ వివాదమైంది. వాల్మీకులు అంటే బోయ సామాజికవర్గం. వీరి అభ్యంతరం కారణంగా సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు 'గద్దలకొండ గణేష్‌' అని మార్చారు. పదాల వివాదమూ పెద్ద చరిత్రేనండోయ్‌..!

సైరా… ఒక మాంఛి కమర్షియల్ విందు