తాము గెలవబోతున్నట్టుగా సర్వేలు చెబుతున్నాయని అంటున్నారు కేటీఆర్. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో విజయం తమదే అని ఒక సర్వే కూడా చెప్పిందన్నారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ చేయించుకున్న సర్వేలో అదే పార్టీ నెగ్గుతుందని తేలుతుంటుంది. అదే విధంగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నెగ్గుతుందని టీఆర్ఎస్ సర్వేలో తేలి ఉండవచ్చు.
అయితే ఇప్పుడు ఆ సర్వేకు సంబంధించి పర్సెంటేజీలు చెప్పి మరీ విజయం మీద విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యనేతలు. ఈ విషయంలో కేటీఆర్ డైరెక్టుగా మీడియా ముందు సర్వే ఫలితాలను చెప్పారు. పదిహేడు వందల మంది అభిప్రాయాలను తీసుకుని చేయించిన సర్వేలో ఎవరికి ఎన్నిశాతం ఓట్లు వస్తాయో కూడా కేటీఆర్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సమితికి 54.64 శాతం ఓట్లు దక్కుతాయని, రెండోశాతం కాంగ్రెస్ కు దక్కుతుందని, ఆ పార్టీకి నలభై రెండుశాతం ఓట్లు వస్తాయని, బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంటుందని కేవలం రెండుశాతం ఓట్లు మాత్రమే హుజూర్ నగర్ లో ఆ పార్టీకి దక్కే అవకాశం ఉందని కేటీఆర్ తేల్చారు.
తమకు ప్రధాన ప్రత్యర్థి, హుజూర్ నగర్లో రెండోస్థానంలో నిలిచే పార్టీ కాంగ్రెస్ అని కేటీఆర్ వ్యాఖ్యానించడం గమనార్హం. బీజేపీ ఊసులో కూడా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉత్తమ్ ను గెలిపించుకుంటే ఆయన సీఎం అవుతారనో, డిప్యూటీ సీఎం అవుతారనో జనాలు ఓటేశారని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కేటీఆర్ అంటున్నారు.