హుజూర్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ పార్టీ ఇజ్జత్ కా సవాల్ గా మారింది. ఇప్పటికే సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైన టీఆర్ఎస్, తన బలగాన్నంతా అక్కడే మోహరించింది. కేటీఆర్ అక్కడే తిష్టవేసి అంతా తానై చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న రాజకీయ ఎత్తుగడకు తెరతీశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇటీవల ఏపీ సీఎం జగన్ తో జరిగిన భేటీలో హుజూర్ నగర్ ఉపఎన్నిక ప్రస్తావన కూడా వచ్చినట్టు సమాచారం.
2018లో వైసీపీ పూర్తిగా తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉంది. 2014 ఎన్నికల్లో మాత్రం తెలంగాణ వ్యాప్తంగా వైసీపీకి గణనీయమైన ఓటింగ్ శాతం నమోదైంది. హుజూర్ నగర్లో తీసుకుంటే వైసీపీ మూడో స్థానంలో నిలిచింది. 2014లో కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి గెలుపొందగా రెండోస్థానంలో టీఆర్ఎస్ నిలిచింది. మూడో స్థానంలో ఉన్న వైసీపీ అభ్యర్థి గట్టు శ్రీకాంత్ రెడ్డి 16.55శాతం ఓట్లు సాధించారు.
ఇప్పటికీ అక్కడ వైఎస్సార్ కి డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. మరి వీరి పరిస్థితి ఏంటి? జగన్ గత ఎన్నికల్లో ఎటూ మొగ్గు చూపలేదు కాబట్టి వీరంతా తమకు నచ్చిన పార్టీకే ఓటు వేశారు. అంటే పాత మూలాలనే గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ కే మద్దతు తెలిపారు. అయితే నియోజకవర్గంలో కీలక నేతలు ఇప్పటికీ సీఎం జగన్ తో టచ్ లో ఉన్నట్టు సమాచారం. ఈ సమాచారం కేసీఆర్ కి అందడం వల్లే జగన్ తో జరిగిన భేటీలో హుజూర్ నగర్ ఎన్నిక గురించి ప్రస్తావించారట. వైసీపీ ఓటు బ్యాంక్ ని టీఆర్ఎస్ కి మళ్లించాలని అభ్యర్థించారట.
అయితే జగన్ మాత్రం ఎలాంటి హామీ ఇవ్వకుండా నవ్వి ఊరుకున్నారట. తెలంగాణలో మేం పోటీ చేయలేదు కదా, ఇంకా మాకు ఓటు బ్యాంక్ ఉందంటారా అని మాత్రమే వ్యాఖ్యానించారట. కేసీఆర్ ఈ వ్యాఖ్యలతో సంతృప్తి చెందకపోయినా, ఈ భేటీని అడ్డు పెట్టుకుని, జగన్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని వాడుకుంటూ హుజూర్ నగర్లో వైసీపీ పాతకాపులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారట.
వైసీపీ నేతలు తనకే సపోర్ట్ చేయాలని, జగన్ ఈమేరకు తనకు హామీ ఇచ్చారని కూడా ఈ మీటింగ్ లో చెప్పబోతున్నారట. మొత్తమ్మీద జగన్ భేటీని ఇలా కూడా వాడుకోబోతున్నారు గులాబీ బాస్. తెలంగాణ ఎన్నిక ముఖచిత్రంపైకి అలా వైఎస్ జగన్ వచ్చిచేరారన్నమాట.