వెండితెరపై దేవకన్యల్లా మెరిసిపోతారు. తమ చలాకీతనంతో కట్టిపడేస్తారు. కేవలం మేకప్ తోనే ఇది సాధ్యం కాదు. నిజజీవితంలో ఎంతో క్రమశిక్షణ, నిబద్ధత అవసరం. మరి అలా మెరుపుతీగల్లా కనిపించడం కోసం మన హీరోయిన్లు ఏమేం చేస్తారో తెలుసా?
యోగా నుంచి జిమ్ వరకు సమంత అన్నీ చేస్తుంది. గాల్లో వేలాడుతూ చేసే యోగాసనాల నుంచి జిమ్ లో వంద కిలోల బరువు ఎత్తడం వరకు అన్నీ ఈమెకు సాధ్యమే. దీంతోపాటు ఇంట్లో సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయల్ని మాత్రమే ఈమె తింటుంది. ఇదే ఆమె ఫిట్ నెట్ అండ్ గ్లామర్ సీక్రెట్. ఇంత స్ట్రాంగ్ గా ఉంది కాబట్టే, తాజాగా ఓ ఆరోగ్య సమస్య నుంచి కూడా ఆమె త్వరగా బయటపడింది.
ఇన్నేళ్లయినా నయనతారలో అందం చెదరకపోవడానికి కూడా యోగానే కారణం. ఆమె వ్యాయామాలు తక్కువగా చేస్తుంది, యోగా ఎక్కువగా చేస్తుంది. దీనికితోడు బ్రేక్ ఫాస్ట్ లో కొబ్బరితో చేసిన ఆహార పదార్థాలు తినడం ఆమె ఆరోగ్య రహస్యం. తమన్న కూడా రెగ్యులర్ గా వ్యాయామం చేయడమే తన ఆరోగ్య రహస్యమని ప్రకటించింది.
మరి 2 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న త్రిష, తన అందాన్ని ఎలా కాపాడుకుంటోంది? రెగ్యులర్ గా జిమ్ చేయడంతో పాటు, విటమిన్-సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్ని త్రిష తీసుకుంటుంది. అదే ఆమె గ్లామర్ సీక్రెట్.
ఇక కీర్తిసురేష్, సాయిపల్లవి అయితే రెగ్యులర్ గా చేసే వ్యాయామాల కంటే డాన్స్ చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. నచ్చిన మ్యూజిక్ పెట్టుకొని, డాన్స్ చేయడం వీళ్ల హెల్త్ సీక్రెట్. దీంతో పాటు ఈ ఇద్దరు హీరోయిన్లు బయట ఫుడ్ కంటే, ఇంట్లో వండిన భోజనాన్నే ఎక్కువగా తింటారు.
ఈమధ్య శృతిహాసన్ కూడా ఇదే పని చేస్తోంది. ప్రతి రోజూ వ్యాయామం చేయడంతో పాటు.. తనే స్వయంగా వండుకొని తింటోంది. అప్పుడప్పుడు తన ఇంటి నుంచి షూటింగ్ స్పాట్ కు క్యారేజీ కూడా తీసుకెళ్తోంది.