అంతరిక్షం నుంచి పడిన కోడి గుడ్డు పగల్లేదు!

గుడ్డు ఇలా చేజారిందంటే అలా పగిలిపోతుంది. ఇది అందరికీ అనుభవమే. మరి అలాంటి గుడ్డు అంతరిక్షం నుంచి కిందకు పడితే? కచ్చితంగా పగిలిపోతుంది. కానీ అలా పగలకుండా చేయాలనుకున్నాడు నాసా మాజీ సైంటిస్ట్, ప్రస్తుత…

గుడ్డు ఇలా చేజారిందంటే అలా పగిలిపోతుంది. ఇది అందరికీ అనుభవమే. మరి అలాంటి గుడ్డు అంతరిక్షం నుంచి కిందకు పడితే? కచ్చితంగా పగిలిపోతుంది. కానీ అలా పగలకుండా చేయాలనుకున్నాడు నాసా మాజీ సైంటిస్ట్, ప్రస్తుత యూట్యూబర్ మార్క్ రాబర్. చాలా కష్టపడి, ఎంతో ఖర్చుపెట్టి, అంతరిక్షం నుంచి నేల మీద పడినప్పటికీ గుడ్డును పగలకుండా ల్యాండ్ చేయగలిగాడు.

ఈ ప్రయోగం చేయాలంటే గుడ్డును రాకెట్ లో పెట్టడానికి అనువైన స్థలాన్ని తయారుచేయాలి. ఆకాశం నుంచి పడినప్పుడు నేరుగా నేలను తాకకుండా ఉండాలి. దీనికి సంబంధించి ప్రత్యేక అమరిక ఏర్పాటుచేసింది మార్క్ బృందం.

నిజానికి ప్రపంచలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా నుంచి గుడ్డను క్షేమంగా కిందకు ల్యాండ్ చేయాలనేది ఈ బృందం టార్గెట్. కానీ ప్రయోగాలు చేసేకొద్దీ, లక్ష్యం మారింది. బుర్జ్ ఖలీఫా టవర్ ఎత్తును దాటి ఏకంగా అంతరిక్షానికి గుడ్డును తీసుకెళ్లింది ఈ టీమ్.

అనుకున్నదే తడవుగా ప్రత్యేకమైన బెలూన్లు తయారుచేశారు. ఎత్తుకు వెళ్లేకొద్దీ వాతావరణ పరిస్థితుల్లో మార్పు వల్ల గుడ్డు పగిలిపోతుంది కాబట్టి, దానిని ముందుగానే ఇన్సులేట్ చేశారు.

అలా హీలియం బెలూన్ సహాయంతో, గుడ్డుని లక్ష అడుగుల ఎత్తుకు చేర్చారు. అక్కడ్నుంచి దాన్ని జారవిడిచారు. అలా భూమిపైకి 150 మైళ్ల వేగంతో దూసుకొచ్చిన గుడ్డు, సురక్షితంగా నేలను తాకింది. ఎలాంటి పగుళ్లు ఏర్పడలేదు.

అంతరిక్ష ప్రయోగాల్లో అనుకోని ప్రమాదాలు ఎదురైతే, సురక్షితంగా నేలను చేరడం ఎలా అనే లక్ష్యంతో ఈ గుడ్డు ప్రయోగం చేసినట్టు తెలిపాడు మార్క్. ఈ ప్రయోగం కోసం మొదటి రోజు నుంచి అతడి బృందం చేసిన పనుల్ని వీడియోగా తీశారు. అలా వీళ్ల కృషి మొత్తాన్ని26 నిమిషాల వీడియోగా యూట్యూబ్ లో పెట్టారు. 2 రోజుల్లోనే ఈ వీడియోకు 14 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్స్ లో కొనసాగుతోంది ఈ వీడియో.