వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఘాటు విమర్శలు నిప్పురాజేశాయి. వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిలకు టీఆర్ఎస్ కార్యకర్తలు షాక్ ఇచ్చారు. తమ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలకు నిరసనగా …ఆమె కేరవాన్‌కు నిప్పు పెట్టారు. ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది.
షర్మిల ప్రజాప్రస్ధానం పాదయాత్ర వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో 3500 కిలోమీటర్లకు చేరింది. ఈ సందర్భంగా ఆదివారం ఆమె మాట్లాడుతూ చేతకాని ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్లోనే వున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేరులోనే పెద్ది..ఆయనది చిన్న బుద్ధి అని విమర్శించారు.
ఈ నియోజకవర్గంలో రాళ్ల వాన పడి 20 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఆదుకోలేదని తప్పు పట్టారు. 15 రోజుల్లో పరిహారం ఇస్తానని చెప్పి సుదర్శన్‌రెడ్డి మోసగించారని మండిపడ్డారు. ప్రజలు గెలిపించారన్న సోయి, కృతజ్ఞత కూడా ఎమ్మెల్యేకు లేదన్నారు.
ఈ నేపథ్యంలో ఇవాళ చెన్నారావుపేటలో టీఆర్ఎస్ కార్యకర్తలు షర్మిల పాదయాత్రపై చెలరేగిపోయారు. షర్మిల కేరవాన్‌కు నిప్పు అంటించారు. కొన్ని వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. షర్మిల స్పందిస్తూ… పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి కుట్రపూరింతంగా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
పాద యాత్రను అడ్డుకుని …తనను అరెస్ట్ చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు. శాంతి భద్రతల సమస్యను సృష్టించి యాత్రను అడ్డుకునేందుకే బస్సును తగలబెట్టారని మండిపడ్డారు. పోలీసులు దగ్గరుండి దాడి చేయించారని షర్మిల ఆరోపించారు.