ఎల్లో బ్యాచ్‌కు దిమ్మ తిరిగేలా సర్వోన్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వ మూడు రాజధానుల బిల్లులకు వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీకి రాజధాని ఎంపిక హక్కే లేదని తేల్చి చెప్పడం సంచలనం రేకెత్తించింది. హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందంటూ అసెంబ్లీలో చర్చ కూడా చేపట్టారు.
ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఎలా వుంటుందో అనే ఆసక్తి ఏర్పడింది. రాజధానిపై దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేయడం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడం గమనార్హం. ఆరు నెలల్లోపు అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడాన్ని తప్పు పట్టింది. దీనిపై స్టే విధించింది.
ఇదే సందర్భంలో హైకోర్టే ప్రభుత్వంలా వ్యవహరిస్తుందా? అని నిలదీసింది. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరిస్తే ఎలా? హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా? ఆరు నెలల్లో నిర్మాణం చేయాలంటారా?. మీరే ప్రభుత్వమైతే అక్కడ కేబినెట్ ఎందుకు? అని నిలదీయడం ఏపీ ప్రభుత్వానికి ఊరట కలిగించే అంశం. అలాగే అమరావతిలోనే అభివృద్ధి చేయాలని వాదించే వారికి షాక్ అని చెప్పక తప్పదు.
అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం చూసుకోవాల్సిన అంశమని ధర్మాసనం అభిప్రాయపడింది. అభివృద్ధి ఎలా చేయాలో రాష్ట్ర ప్రభుత్వానికి గడువు విధించడం అంటే హైకోర్టు తన పరిధి దాటడమే అని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్య చేసింది. దేశ వ్యాప్తంగా రాజధాని ఒకచోట, హైకోర్టు మరోచోట ఉన్న రాష్ట్రాల గురించి సుప్రీంకోర్టు ధర్మాసనం వివరించడం విశేషం.
అలాగే ఫలానా చోట రాజధాని ఉండాలని, పెట్టాలని ఒక రాష్ట్రాన్ని ఆదేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం కోరుకున్నట్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. సమగ్ర విచారణ తర్వాతే రాజధానిపై పూర్తిస్థాయిలో తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది. జనవరి 31వ తేదీకి కేసును వాయిదా వేసింది.