ఎట్టకేలకు యోగా గురు బాబా రాందేవ్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పారు. ఇటీవల రాందేవ్ బాబా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మహిళలు ఏం ధరించకపోయినా అందంగా వుంటారని ఆయన అన్నారు. ఈ కామెంట్స్‌పై ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. రాందేవ్ బాబా వెంటనే తన వ్యాఖ్యల్ని ఉపసంహరించాలని, అలాగే క్షమాపణ చెప్పాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి.
రెండు రోజుల్లో క్షమాపణ చెప్పాలంటూ మహారాష్ట్ర మహిళా కమిషన్ రాందేవ్ బాబాకు నోటీసు ఇచ్చింది. ఈ మేరకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇందులో మహిళలకు క్షమాపణ చెప్పడం గమనార్హం. ఆ నోటీసులో ఏముందంటే…
“మహిళలు గౌరవంగా జీవించాలని, అలాగే వారి సాధికారత కోసం నేను కృషి చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమాన్ని నేను ప్రోత్సహిస్తున్నా. మహిళలను కించపరచాలనే ఉద్దేశం నాకు లేదు. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పూర్తి వాస్తవాన్ని ప్రతిబింబించడం లేదు. అయినా…ఎవరైనా బాధపడి వుంటే చింతిస్తున్నా. నా మాటల వల్ల బాధపడిన వారికి బేషరతుగా క్షమాపణ కోరుతున్నా” అని మహిళా కమిషన్ నోటీసుకు బాబా సమాధానం ఇచ్చారు.
దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో రాందేవ్ బాబా మెత్తబడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలను అవమానించేలా మాట్లాడ్డం, వ్యతిరేకత వస్తే క్షమాపణతో సరిపెట్టడం ప్యాషనైందని నెటిజన్లు మండిపడుతున్నారు. యోగా సెలబ్రిటీ అయిన రాందేవ్ బాబా మహిళలను కించపరిచేలా మాట్లాడ్డం ఆయన నైజాన్ని తెలియజేస్తోందనే వాళ్ల సంఖ్య ఎక్కువగా వుంది.