ఈ శీర్షిక చూడగానే కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుందా అనే సందేహం కలుగుతోంది కదా. మోడీ ప్రభుత్వం కొత్తగా ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెడుతోందా అనే డౌట్ వస్తోంది కదా. అల్లాంటిదేమీ లేదండి. ఇదంతా తెలంగాణా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కంటున్న బంగారు కలలు. ఆయన నిర్మించుకుంటున్న ఊహా సౌధాలు. ఈ మధ్య మూడు రోజులపాటు ఆయన ఇంట్లో, కొడుకు ఇంట్లో, బంధువుల ఇళ్లలో, అపారంగా ఉన్న ఆయన విద్యా సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు జరపడం, భారీగా నగదును, కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడం, ఈ ఎపిసోడ్ లో మల్లా రెడ్డి తీవ్రంగా ఆగ్రహించడం, అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ….ఇదంతా తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఆయన కేసీఆర్ ఉండగా తనను ఎవరూ ఏమీ చేయలేరని, తాను ఎవరికీ భయపడనని చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంలోనే కేంద్రంలో కేసీఆర్ ప్రభుత్వం (బీ ఆర్ ఎస్ ) వస్తుందని కలలు కంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం వస్తే ఐటీ, ఈడీ దాడులు ఉండవట. ఎవరు ఎట్లైనా సంపాదించుకోవచ్చట (అంటే ఎంత అవినీతి చేసినా ఏం కాదనే భావం కావొచ్చు), ఆదాయపు పన్ను కట్టడం నిర్బంధం కాదట, ఇష్టమైతే కట్టొచ్చట, లేకపోతే మానుకోవచ్చట, స్వచ్ఛదంగా కడితే కట్టొచ్చట …. ఇదీ మల్లా రెడ్డి ప్రవచనం. కేసీఆర్ అండ ఉంటే ఎంత అవినీతి అయినా చేస్తామని చెబుతున్నట్లుగా ఉంది ఆయన ధోరణి. రాష్ట్రాన్ని సొంత జాగీరులా అనుకుంటున్నారు కేసీఆర్. దేశాన్ని కూడా అలాగే అనుకుంటారని చెప్పడం మల్లారెడ్డి ఉద్దేశమా?
తనపైన ఐటీ దాడులు జరిగినందుకు ఆయన తట్టుకోలేక పోతున్నాడు. ఆయనే గోటితో పోయేదాన్ని గొడ్డలి పోటు దాకా తెచ్చుకున్నాడు. “బర్లు కొన్న. పాలమ్మిన. పూలు అమ్మిన. బోర్లు వేసిన. చిట్ ఫండ్ లు నడిపిన” మీకు ఇన్ని ఆస్తులు ఎలా సమకూరాయి అని విలేకరులు అడిగితే మంత్రి మల్లారెడ్డి చెప్పిన సమాధానం అదీ. అన్నట్టుగానే మంత్రి మల్లారెడ్డికి భారీగా ఆస్తులు ఉన్నాయి. మేడ్చల్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఆయనకు భారీగా భూములు ఉన్నాయి. దీనికి తోడు లెక్కకు మిక్కిలి కాలేజీలు ఉన్నాయి. వీటి విలువ వందల కోట్లు ఉంటుందని సమాచారం. ఐటి దాడుల నేపథ్యంలో మల్లారెడ్డి సిబ్బందికి కోట్ల జీతాలు ఇస్తున్నట్టు ఒప్పుకున్నారు. తాను కష్టపడి పైకి వచ్చానని, హై థింకింగ్, లో ప్రొఫైల్ లో జీవిస్తానని మల్లారెడ్డి వెల్లడించారు.
అయితే మల్లారెడ్డి సంస్థలపై భారీగా దాడులు జరిగినా రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఖండించకపోవడం గమనార్హం. సొంత పార్టీలో కొంతమంది నేతలే మల్లారెడ్డి కి తగిన శాస్తి జరిగిందని అంతర్గతంగా చర్చించుకున్నారని సమాచారం. షాపూర్ నగర్ లో సీఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరిట ఒక అంతర్జాతీయ పాఠశాల నిర్వహిస్తున్నారు. సూరారం ప్రాంతంలో ఎంబీ గ్రామర్ స్కూల్ పేరిట పదో తరగతి వరకు పాఠశాల నిర్వహిస్తున్నారు. దూలపల్లి లో మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పేరిట ఒక కళాశాల నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పేరిట మైసమ్మగూడ, దూలపల్లి ప్రాంతాల్లో అటానమస్ కళాశాల నిర్వహిస్తున్నారు. ఇదే మైసమ్మగూడలో మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ విమెన్ పేరిట ఒక కళాశాల ఉంది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మేనేజ్మెంట్ సైన్స్ పేరిట మేడ్చల్ జిల్లా కిష్టాపూర్ లో ఒక కాలేజీ ఉంది.
మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పేరిట మైసమ్మగూడలో, దూలపల్లి లో కళాశాలలు నిర్వహిస్తున్నారు. కేవలం ఇంజనీరింగ్, పాఠశాల విద్య కాకుండా బీఈడీ కళాశాలలు కూడా నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ పేరిట మైసమ్మగూడ, దూలపల్లి ప్రాంతాల్లో ఫార్మా కాలేజీ నిర్వహిస్తున్నారు.. ఇక మైసమ్మగూడ, దూలపల్లి ప్రాంతాల్లో మల్లారెడ్డి ఫార్మసీ కాలేజీ, మల్లారెడ్డి మెడికల్ కాలేజీ ఫర్ విమెన్, మల్లారెడ్డి డెంటల్ కాలేజీ ఫర్ విమెన్, మల్లారెడ్డి మెడికల్ కాలేజీ కో ఎడ్యుకేషన్, మల్లారెడ్డి డెంటల్ కాలేజీ ఎడ్యుకేషన్, మల్లారెడ్డి బీఈడీ కాలేజీ పేరిట కొంపల్లి ప్రాంతాల్లో కళాశాలలు ఉన్నాయి. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ పేరిట దుండిగల్ లో ఒక కాలేజి నిర్వహిస్తున్నారు.
మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ పేరిట గండి మైసమ్మ, దుండిగల్ ప్రాంతాల్లో కళాశాలలు ఉన్నాయి. ఎమ్ఎల్ ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పేరిట కుత్బుల్లాపూర్ లో ఒక కాలేజీ ఉంది. వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పేరిట కాచారం ప్రాంతంలో ఒక కళాశాల ఉంది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పేరిట గండి మైసమ్మ ప్రాంతంలో ఒక కళాశాల ఉంది. దుండిగల్ ప్రాంతంలో అరుంధతి పేరిట ఒక వైద్య కళాశాల ఉంది.. మల్లారెడ్డి పేరు మీదే కాకుండా ఆయన తమ్ముడి పేరు మీద కూడా కళాశాలలు ఉన్నాయి. బోయిన్ పల్లి లో సీఎంఆర్ మోడల్ స్కూల్ ఉంది. ఇదే బోయిన్ పల్లిలో సీఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. గాజులరామారంలో సీఎంఆర్ హైస్కూల్ ఉంది. కండ్ల కోయలో సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పేరిట కళాశాల ఉంది. కండ్లకోయలో సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది.
ఇదే కండ్లకోయలో సీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పేరిట ఒక కాలేజ్ ఉంది. సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ పేరిట కండ్లకు మరో కాలేజీ ఉంది. బాలనగర్ లో సెయింట్ మార్టిన్ పేరిట ఒక స్కూల్ ఉంది. మల్కాజిగిరిలో సెయింట్ మార్టిన్ పేరిట మరో స్కూల్ ఉంది. నాచారంలో సెయింట్ మార్టిన్ పేరిట ఇంకొక స్కూల్ నడుస్తోంది. చింతల్ ప్రాంతంలో సెయింట్ మార్టిన్ స్కూల్ మరో శాఖ ప్రారంభించారు. మల్లారెడ్డి చెబుతున్నట్టు ఆయన స్థాపించిన విద్యాలయాల విలువ బహిరంగ మార్కెట్లో వందల కోట్ల దాకా ఉంటాయి. పైగా మల్లారెడ్డి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసేవారు కావడంతో అప్పట్లో తక్కువ ధరకు స్థలాలు కొన్నారు. రియంబర్స్మెంట్ పథకాన్ని వినియోగించుకొని కళాశాలలు ఏర్పాటు చేశారు. రాష్ట్రం మొత్తం కళాశాల మూతపడుతుంటే ఒక మల్లారెడ్డి మాత్రం కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు.. పెద్ద పెద్ద వారికి కూడా మల్లా రెడ్డి విజయ రహస్యం అంతుపట్టడం లేదు. ఈ విజయం వెనుక అవినీతి, అక్రమాలు లేకుండా ఉంటాయా?