బండి పాద‌యాత్ర‌పై ఉత్కంఠ‌కు తెర‌

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర‌పై నెల‌కున్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. బండి పాద‌యాత్ర‌కు ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తి హైకోర్టు నుంచి ల‌భించింది. నిర్మ‌ల్ జిల్లా బైంసాలో ఐదో విడ‌త ప్ర‌జా సంగ్రామ పాద‌యాత్ర…

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర‌పై నెల‌కున్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. బండి పాద‌యాత్ర‌కు ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తి హైకోర్టు నుంచి ల‌భించింది. నిర్మ‌ల్ జిల్లా బైంసాలో ఐదో విడ‌త ప్ర‌జా సంగ్రామ పాద‌యాత్ర చేప‌ట్టాల‌ని బండి సంజ‌య్ నిర్ణ‌యించుకున్నారు. అయితే పాద‌యాత్ర‌కు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌లేదు.

మ‌రోవైపు పాద‌యాత్ర మొద‌లు పెట్ట‌డానికి బండి సంజ‌య్ క‌రీంన‌గ‌ర్ నుంచి నిర్మ‌ల్‌కు బ‌య‌ల్దేరారు. పోలీసులు అత‌న్ని మార్గ‌మ‌ధ్యంలో అడ్డుకున్నారు. దీంతో ఆయ‌న క‌రీంన‌గ‌ర్‌కు తిరుగుముఖం ప‌ట్టారు. అనంత‌రం పాద‌యాత్ర అనుమ‌తి కోసం హైకోర్టును ఆశ్ర‌యించారు. విచార‌ణ‌లో భాగంగా హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. పాద‌యాత్ర‌లు, ర్యాలీలు రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కుగా పేర్కొంది. పాద‌యాత్ర‌కు అనుమ‌తి నిరాక‌రించ‌డం స‌రైంద‌ని కాద‌ని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ష‌రతుల‌తో కూడిన అనుమ‌తి ఇచ్చింది. బైంసా వెలుప‌ల మాత్ర‌మే బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాల‌ని పేర్కొంది. బైంసాకు మూడు కిలోమీట‌ర్ల దూరంలో స‌భ పెట్టుకోవాల‌ని సూచించింది. అలాగే బైంసా ప‌ట్ట‌ణం మీదుగా పాద‌యాత్ర వెళ్ల‌కూడ‌ద‌ని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో పోలీసులు అప్ర‌మ‌త్తంగా వుండాల‌ని న్యాయ‌స్థానం సూచించింది.

గ‌తంలో బైంసాలో మ‌త‌ప‌ర‌మైన గొడ‌వ‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. బండి సంజ‌య్ పాద‌యాత్ర సంద‌ర్భంగా విద్వేష‌పూరిత ప్ర‌సంగాలు చేస్తే, మ‌రోసారి అలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం అయ్యే ప్ర‌మాదం వుంద‌ని పోలీసులు అనుమ‌తి నిరాక‌రించిన‌ట్టు టీఆర్ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. హైకోర్టు తాజా తీర్పు నేప‌థ్యంలో బండి సంజ‌య్ పాద‌యాత్ర‌కు అడ్డంకులు తొల‌గాయి.