టీడీపీ అధికారానికి దూరం కావడం వల్ల ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఎంత బాధ కలిగిందో అంతకంటే రెట్టింపు బాధ రామోజీ గ్రూప్ కి కలిగింది. అయితే ఈనాడు కానీ, ఈటీవీ కానీ వెంటనే ఆ బాధను బైటపెట్టలేదు. ఆంధ్రజ్యోతిలా మరీ వన్ సైడ్ వార్తలు రాయడం, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఈనాడుకి అలవాటు లేదు. ఓ పొరని కప్పేసుకుని ఇప్పటివరకూ వార్తలు రాస్తూ వచ్చింది ఈనాడు. కానీ ఇప్పుడా పొర మెల్లమెల్లగా తొలగించుకుంటోంది.
ఇటీవల కాలంలో ఈనాడులో వస్తున్న ప్రత్యేక కథనాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పోలవరం రివర్స్ టెండర్ల దగ్గర నుంచి, సచివాలయ ఉద్యోగాలపై చేస్తున్న రాద్ధాంతం వరకు ఇలాగే జరిగింది. తాజాగా పీపీఏల రద్దుపై కోర్టు ఇచ్చిన తీర్పుని టీడీపీకి అనుకూలంగా, అధికార పక్షానికి వ్యతిరేకంగా వండి వార్చిన విధానం కూడా ఇందులో భాగమే.
అసలు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై టీడీపీ అంతలా విషం చిమ్ముతుందని ఎవరూ ఊహించలేదు. బీజేపీతో జగన్ కి వైరం తెచ్చిపెట్టేలా కథనం వండివార్చింది. చివరకు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఆ వార్తల్ని ఖండించాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. ఇలా ఈనాడు కూడా ఇప్పుడు టీడీపీ కోసం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. జగన్ ను బద్నామ్ చేసేందుకు ఆంధ్రజ్యోతి మార్గాన్ని ఎన్నుకున్నట్టు స్పష్టం అవుతోంది.
టీడీపీకి అనుకూలంగా ఉంటున్నా.. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎవరి స్టయిల్ లో వారు వార్తలు రాస్తూ వచ్చేవారు. కానీ రీసెంట్ గా ఈ రెండు పత్రికల్లో వస్తున్న వార్తల సరళి చూస్తుంటే.. రెండూ ఒకే తాటిపైకి వచ్చినట్టు కనిపిస్తోంది. “జ్యోతి” బాటలో ఈమధ్య ఈనాడు కూడా శృతి మించుతోంది. నిరాధార వార్తలతో పేజీలు నింపుతోంది. కమ్మరాజ్యంలో కడపరెడ్లు ఎఫెక్ట్ అంటే ఇదేనేమో..?