ఉరుములేని పిడుగలా వచ్చింది రామ్ చరణ్-శంకర్ సినిమాకు బ్రేక్ పడిందనే వార్త. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ డైరక్షన్ లో రామ్ చరణ్ సినిమా అనగానే ఫ్యాన్స్ సందడి ఇంతా అంతా కాదు.
థమన్ లాంటి టెక్నీషియన్లను ఫిక్స్ చేసి, చకచకా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారనే వార్తలు కూడా వినవచ్చాయి. ఇలాంటి టైమ్ లో ఇండియన్ 2 నిర్మాతలు అయిన లైకా ప్రొడక్షన్స్ కోర్టులో కేసు వేసిందన్న వార్తలు వచ్చేసాయి.
తాను ఇండియన్ 2 ప్రాజెక్టు మీద 180 కోట్ల వరకు ఖర్చు చేసామని, శంకర్ రెమ్యూనిరేషన్ అయిన 40 కోట్లలో సగానికి పైగా చెల్లించామని, అందువల్ల తమ సినిమా అయ్యే వరకు మరో సినిమా చేయకుండా శంకర్ ను నిరోధించాలని లైకా సంస్థ కోర్టును కోరింది.
అయితే ఈ విధమైన స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. శంకర్ వాదన కూడా విన్న తరువాత నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. అందువల్ల ఇప్పటికప్పుడు శంకర్-రామ్ చరణ్ సినిమాకు వచ్చిన ముప్పు లేదు. కానీ శంకర్ వాదనలో పసలేకపోయినా, లైకా వాదన గట్టిగా వున్నా కోర్టు తీర్పు ఎలా వుంటుందన్నది చూడాలి. పైగా ఇది ఇక్కడితో ఆగదు.
ఏదో దశలో అడ్డం పడుతూనే వుంటుంది. ఎందుకంటే వందల కోట్లు పెట్టేసిన లైకా ఊరికినే వుండదు. ఆఖరికి రామ్ చరణ్ ప్రాజెక్టులోకి ఏదో విధంగా ఎంటర్ అయినా ఆశ్చర్యపోనక్కరలేదు.
శంకర్ తో ఇండియన్ 2 చేయాలనుకున్నారు దిల్ రాజు. కానీ బ్రేక్ పడిపోయింది. పక్కకు తప్పుకున్నారు. ఆ అడ్వాన్స్, అగ్రిమెంట్ నే రామ్ చరణ్ సినిమా దిశగా మళ్లించారు. ఇప్పుడేమవుతుందో చూడాలి.