పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా మూడు టోకెన్లు ఇచ్చేసారు. ఏ టోకెన్ వంతు ఎప్పుడు వస్తుందో. ఎవరి సినిమా ఎప్పుడు చేస్తారో అన్నది మాత్రం జవాబు తెలియని ప్రశ్న. సుజిత్-దానయ్య, సముద్రఖని-విశ్వప్రసాద్, హరీష్ శంకర్-మైత్రీమూవీస్ ఇలా ఈ మూడు సినిమాలకు టోకెన్లు ఇచ్చేసారు.
ప్రస్తుతం చేస్తున్న హరిహర వీరమల్లు తరువాత ఈ మూడు సినిమాలు వుంటాయి..వుండాలి. కానీ ఏది ఎప్పుడు అన్నదే తెలియాల్సి వుంది. ప్రస్తుతానికి పవన్ ఇటు రాజకీయాలు అటు సినిమాలు అనే జోడు గుర్రాల స్వారీ చేస్తున్నారు. అయిదు రోజులు మాత్రమే షూటింగ్ లు.. వీకెండ్ రెండు రోజులు వుండవు.
రాను రాను ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ కార్యకలాపాలు పెరుగుతూనే వుంటాయి. ఏ క్షణం షూటింగ్ లో వుంటారో? ఏ క్షణం మంగళగిరిలో వాలాల్సి వస్తోందో తెలియదు. పోనీ ఆయన ఒక్కడితో షూట్ అంటే వేరు. ఎప్పుడు వస్తే అప్పుడు చేసుకోవచ్చు. కానీ కాంబినేషన్ ఆర్టిస్ట్ లు, ఇతరత్రా వ్యవహారాలు ఇలా ఓ తలకాయనొప్పి వుండదు. సెట్ కు వచ్చిన తరువాత కూడా ఏదో ఒక రీజన్ తో క్యాన్సిల్ కొట్ట కూడదని లేదు.
మరి సమాంతరంగా మూడు సినిమాలు చేస్తారా? ఒక దాని తరువాత మరొకటి చేస్తారా? అన్నది క్లారిటీ లేదు. కానీ ఓ విషయం క్లారిటీగా వినిపిస్తోంది. ఎప్పటి నుంచో లైన్లో ముందుగా వున్న సముద్రఖని డైరక్షన్ లో సినిమాను మూడో ప్లేస్ లోకి తోసారని. సుజిత్-హరీష్ ల సినిమాలు రెండూ ముందుకు వచ్చాయని. ప్రస్తుతానికైతే ఇదీ ఆర్డర్. తరువాత ఏదీ అడ్డం పడకుండా వుంటే.