జనసేనాని పవన్‌కల్యాణ్ తాను అసమర్థుడని మరోసారి నిరూపించుకున్నారు. కార్యసాధకులు రంకెలు వేయరని పెద్దలు చెప్పారు. అదేంటో గానీ, వీకెండ్స్ మీటింగ్‌ల్లో పాల్గొనే పవన్‌కల్యాణ్….వైసీపీపై గట్టిగట్టిగా అరుస్తూ వుంటారు. ఆ తర్వాత పత్తా వుండరు. వైసీపీని అది చేస్తా, ఇది చేస్తానని ఆయన హెచ్చరించడమే తప్ప, ఇంత వరకూ ఫలానా పని పవన్ చేశారని చెప్పుకునేందుకు ఏమీ లేదు.
తాజాగా మరోసారి పవన్‌కల్యాణ్ శపథం చేశారు. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో వైసీపీ ప్రభుత్వం గడపలు కూల్చిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ గడపలు కూల్చేంత వరకూ తాను విశ్రమించనంటూ కొత్తగా ప్రతినబూనారు. 2024లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తానని ఆయన హెచ్చరించడం గమనార్హం.
మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఇప్పటం ఇళ్ల కూల్చివేత బాధితులకు రూ.,లక్ష చొప్పున పరిహారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎప్పట్లాగే వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. వైసీపీ రాజకీయ పార్టీనా? ఉగ్రవాద సంస్థా? అని ఆయన ప్రశ్నించారు. రాజకీయం మీరే చేయాలా? మేం చేయలేమా? చేసి చూపిస్తాం అని అన్నారు.
జనసేనను రౌడీసేనగా జగన్ విమర్శించడంపై ఆయన కౌంటర్ ఇచ్చారు. తమది రౌడీ సేన కాదని… విప్లవ సేన అని పవన్ అన్యారు. ఇంతగా అభిమాన బలం ఉన్న తననే ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటంలో గ్రామస్తుల గడపలు కూల్చడాన్ని తాను మర్చిపోనన్నారు. అక్కడ కూల్చిన ప్రతిదీ తన గుండెపై కొట్టినట్లే అనిపించిందని ఆవేదనతో చెప్పారు వైసీపీ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడనని ఆయన అన్నారు.
ఇటీవల విశాఖలో ప్రధాని మోదీతో తానేం మాట్లాడానో చెప్పాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అడుగుతున్నారన్నారు. తన దగ్గరికి వస్తే చెవిలో చెప్తానని వెటకరించారు. వైసీపీ నేతల్లా తాను ఢిల్లీ వెళ్లి చాడీలు చెప్పనన్నారు. వైసీపీని దెబ్బకొట్టాలంటే ప్రధానికి చెప్పి చేయనన్నారు. తానే చేస్తానన్నారు. “ఈ నేలలోనే పుట్టినోడిని.. ఆంధ్రుడిని.. ఆంధ్రలోనే తేల్చుకుంటా. నా యుద్ధం నేనే చేస్తా. అధికారం లేనోడిని.. నామీద పడి ఏడుస్తారేంటి? 2024 కీలకమైన ఎన్నికలు. 175 స్థానాల్లో గెలుస్తామని వైసీసీ విర్రవీగుతోంది. ఛాలెంజ్ ఈసారి మీరు ఎలా గెలుస్తారో మేమ చూస్తాం” అని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పవన్ అసమర్థత ఏంటో ఆయన మాటల్లోనే చూడొచ్చు. 175కు 175 స్థానాల్లో గెలవాలనే లక్ష్యంతో వైసీపీ కార్యాచరణ రూపొందించుకుంది. ఈ మేరకు ముందుకెళుతోంది. గతంలో అధికారంలో లేకుండానే 151 స్థానాల్లో వైసీపీ గెలుపొందింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తోంది. ఇదే తమకు శ్రీరామ రక్షగా జగన్ ప్రభుత్వం భావిస్తోంది.
విధానాల పరంగా పవన్ మాట్లాడకుండా, ఆవేశానికి లోనవుతూ. కక్షపూరితంగా వైసీపీని టార్గెట్ చేయడం పవన్‌కే చెల్లింది. ఎంత సేపూ మళ్లీ వైసీపీ అధికారంలోకి ఎలా వస్తుందనే ప్రశ్న తప్ప, తాను వస్తానని చెప్పే ధైర్యం పవన్‌లో కొరవడింది. రాజకీయ పార్టీ అధినేతగా పవన్ వ్యవహరించడం లేదు. 2019లో కూడా జగన్‌ను సీఎం కానివ్వనని ప్రతినబూనారు. అది ఏమైందో అందరికీ తెలుసు. చివరికి తాను నిలిచిన రెండు చోట్ల కూడా గెలవలేక చతికిలపడ్డారు. దాని నుంచి గుణపాఠం నేర్వకుండా, మళ్లీ జగన్‌ను సీఎం కానివ్వనంటూ శపథాలు చేయడం మొదలు పెట్టారు.
అధికారంలోకి వచ్చేందకు ఏం చేయాలో ఆలోచించడం మానేసి, రెచ్చగొట్టే చర్యలకు మాత్రమే పవన్ పరిమితమయ్యారు. ఇంత వరకూ తన గెలుపునకు భరోసా ఇచ్చే ఒక బలమైన, నమ్మకమైన నియోజకవర్గం లేకపోవడం కూడా పవన్ అసహనానికి కారణమయ్యాయి. ఒంటరిగా పోటీ చేస్తే తనను మళ్లీ జగన్ ఓడిస్తారనే ఆందోళన ఆయన్యను వెంటాడుతోంది. జగన్ ఎప్పుడూ పవన్ మాటే పలకరు. దత్త పుత్రుడంటూ దెప్పి పొడుస్తుంటారు. తక్కువ మాట్లాడుతూ, చేతలకు ఎక్కవ ప్రాధాన్యం ఇవ్వడం జగన్ నైజం. పాపం పవన్‌కు మాత్రం ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. అరుపులతో నీరసించి పోతున్నారు. చివరికి జగన్‌ను ఓడించడానికి శక్తి లోపిస్తోంది.
తనను తాను గెలిపించుకోలేని పవన్‌కల్యాణ్… ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్‌కు రానున్న రోజుల్లో అధికారం దక్కనివ్వననే హెచ్చరికలతో స్వయంతృప్తి పొందుతున్నారు. ఇదే సందర్భంలో తన నిస్సహాయతను ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే జగన్‌ను ఓడించాలంటే మాటల్లో కాదు… చేతలకు పని చెప్పాలి. అది ఇంత వరకూ పవన్ చేస్తున్న పాపాన పోలేదు. మరి ఆయన శపథం నెరవేరే దారేది?