ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు మహారచయిత, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు పురస్కారం ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాగంటికి గురజాడ పురస్కారం ప్రకటించడాన్ని నిరసిస్తూ విజయనగరంలో ఇవాళ ఉత్తరాంధ్ర కవులు, కళాకారులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేయడం గమనార్హం. భావజాలం పరంగా గురజాడ, చాగంటి రెండు భిన్న ధృవాలు.
హిందూమతం, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల ప్రచారానికి చాగంటి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. అయితే మతం కంటే మమతే గొప్పదని గురజాడ అప్పారావు చాలా ఏళ్ల క్రితమే ప్రబోధించారు. మనిషి, మమత, స్వేచ్ఛ, మతానికి వ్యతిరేకంగా గొప్ప రచనలు చేశారు. అందుకే ఆయన్ని ఇప్పటికీ ఆధునిక మహా రచయిచగా పౌర సమాజం గౌరవిస్తోంది.
గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రతి ఏడాది సంగీతం, గానం, సాహిత్యం, ఆధ్యాత్మిక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు గురజాడ విశిష్ట పురస్కారాన్ని అందజేస్తోంది. 2000వ సంవత్సరం నుంచి గురజాడ పేరుతో పురస్కారాలు అందజేస్తూ ఆ మహనీయుడి సేవల్ని స్మరించుకుంటున్నారు.
గురజాడ విశిష్ట పురస్కారం అందుకున్న వారిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె.విశ్వనాథ్, డాక్టర్ సి.నారాయణరెడ్డి, గొల్లపూడి మారుతీరావు, జేవీ సోమయాజులు, గుమ్మడి వెంకటేశ్వరావు, మల్లెమాల, అంజిలీదేవి, రావి కొండలరావు, దర్శకుడు వంశీ, తనికెళ్ల భరణి, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గరికపాటి నరసింహారావు, మొదలి నాగభూషణశర్మ, సుద్దాల అశోక్‌తేజ, దర్శకుడు క్రిష్ ఉన్నారు.
2022వ సంవత్సరానికి గాను ఈ నెల 30న చాగంటికి కోటేశ్వరరావుకు పురస్కారం అందజేయాలని నిర్ణయించడం తీవ్ర వివాదమైంది. సమాజాన్ని మూఢత్వంలోకి తీసుకెళ్లేలా ప్రవచనాలు చెప్పే చాగంటికి వాటికి వ్యతిరేకంగా జీవితాంతం రచనల ద్వారా పోరాడిన గురజాడ పురస్కారం ఇవ్వాలనుకోవడం అన్యాయమని సాహితీవేత్తలు, కళాకారులు నిరసన ర్యాలీ నిర్వహించారు. చాగంటికి పురస్కారం అందజేయడం అంటే.. గురజాడను అవమానించడమే అని సాహితీవేత్తలు నినదించారు. చాగంటి తనకు తానుగా పురస్కారాన్ని నిరాకరించాలని వారు డిమాండ్ చేయడం విశేషం.