ఎక్క‌డేం జ‌రిగినా జ‌గ‌న్‌కు ముడిపెట్ట‌డ‌మేనా?

ఎక్క‌డేం జ‌రిగినా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు ముడిపెట్ట‌డం టీడీపీ నేత‌ల‌కు బ‌ల‌హీన‌త‌గా మారింది. క‌నీసం నిజానిజాలు తెలుసుకోకుండా సీఎంపై నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ్డం వారికే చెల్లింది. నెల్లూరులో టీడీపీ నేత కోటంరెడ్డిపై ఆయ‌న కుమారుడు స్నేహితుడే…

ఎక్క‌డేం జ‌రిగినా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు ముడిపెట్ట‌డం టీడీపీ నేత‌ల‌కు బ‌ల‌హీన‌త‌గా మారింది. క‌నీసం నిజానిజాలు తెలుసుకోకుండా సీఎంపై నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ్డం వారికే చెల్లింది. నెల్లూరులో టీడీపీ నేత కోటంరెడ్డిపై ఆయ‌న కుమారుడు స్నేహితుడే దాడికి పాల్ప‌డ్డాడు. ఇదే విష‌యాన్ని టీడీపీ అనుకూల మీడియా కూడా రాసింది.

అయితే వాస్త‌వాల‌తో త‌మ‌కేం సంబంధం లేద‌న్న‌ట్టు… కోటంరెడ్డిపై దాడిని జ‌గ‌న్‌కు ముడిపెట్టి నారా లోకేశ్‌, అచ్చెన్నాయుడు త‌దిత‌రులు విమ‌ర్శ‌లు చేయ‌డం దిగ‌జారుడుత‌నానికి నిద‌ర్శ‌న‌మ‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. 

టీడీపీ నెల్లూరు నగర ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని శనివారం రాత్రి ఆయ‌న కుమారుడి స్నేహితుడే కారుతో ఢీ కొట్టాడు. కోటంరెడ్డి కాలు నుజ్జు అయ్యింది. కోటంరెడ్డి కుమారుడు ప్రజయ్‌ సేనారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి ఇద్దరూ స్నేహితులు. వారి మధ్య కొన్ని వివాదాలు ఉన్నాయ‌ని నెల్లూరు న‌గ‌ర టీడీపీ నేత‌లు చెబుతున్నారు. కోటంరెడ్డి కుమారుడి బెడ్ రూమ్ వ‌ర‌కూ వెళ్లేంత సాన్నిహ‌త్యం రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ఉందంటే… ఎంత ద‌గ్గ‌రి వాడో అర్థం చేసుకోవ‌చ్చు. స్నేహితుల మ‌ధ్య గొడ‌వ‌… చివ‌రికి కోటంరెడ్డిపై కారు దూసుకెళ్లే వ‌ర‌కూ దారి తీసింది. 

ఇది పూర్తిగా వ్య‌క్తిగ‌త గొడ‌వ అనేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే దాడి ఎందుకు జ‌రిగిందో వాస్త‌వాలు తెలియ‌కుండానే చంద్ర‌బాబు రాజ‌కీయానికి తెర‌లేపారు. వైసీపీ నేతల హ‌స్తం వుందంటూ చంద్ర‌బాబు విమ‌ర్శ‌ల‌కు దిగారు.  

ఆవు చేలో మేస్తే దూడ గ‌ట్టున మేస్తుందా?…. చంద్ర‌బాబే దుష్ట రాజ‌కీయానికి పాల్ప‌డితే, ఇక లోకేశ్‌, అచ్చెన్నాయుడు ఊరుకుంటారా? జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డంపై స‌ర్వ‌త్రా వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది.

‘జగన్ రెడ్డి గారి మూడు రాజధానులకు తోడు క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా నెల్లూరుని ప్రకటించినట్టు ఉంది దుస్థితి. పెద్ద సైకో పాలనలో ఊరికో సైకో స్వైరవిహారం చేస్తున్నాడు. నెల్లూరు సిటీ టీడీపీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిని కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేయడం దారుణం. దాడికి పాల్పడిన వైసీపీ సానుభూతిపరుడు సైకో రాజశేఖరరెడ్డిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి’ అని లోకేశ్ అవాకులు చెవాకులు పేలారు. ఇదే రీతిలో అచ్చెన్నాయుడు కూడా మాట్లాడారు. పూర్తిగా వాస్త‌వాలు వెలుగులోకి వ‌స్తే టీడీపీ నేత‌లు త‌మ మొహాలు ఎక్క‌డ పెట్టుకుంటారో చూడాలి.