గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరు? అంటూ.. ప్రశ్నిస్తే, సగటు రాజకీయ పరిజ్ఞానం కలిగిన వారు టక్కున ఆన్సర్ చెప్పలేరు! గుజరాత్ అంటే మోడీ, మోడీ అంటే గుజరాత్ అనే అభిప్రాయమే సర్వత్రా ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రి పీఠాన్ని వదిలి నరేంద్రమోడీ ప్రధాని పీఠాన్ని చేపట్టాకా.. ఆ రాష్ట్రానికి ఒకరి తర్వాత మరొకరు ముగ్గురు సీఎంలయ్యారు! ఆ పేర్లతో పని లేకుండా గుజరాత్ రాజకీయం పూర్తిగా నరేంద్రమోడీ, అమిత్ షా ల నీడనే ఉంది.
ఇలాంటి పరంపరలో మరో సారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ సారి కూడా బీజేపీ తరఫు నుంచి మరో మాట లేదు. మోడీ.. మోడీ.. అనే నినాదం తప్ప! గుజరాత్ సీఎం అభ్యర్థిని తనే అయినట్టుగా మోడీ అక్కడ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. పార్టీ గెలుపుకోసం శ్రమిస్తున్నారు. అమిత్ షా కూడా గుజరాత్ ఎన్నికల ప్రచార పర్వంలో మాటల తూటాలు పేల్చుతున్నారు. 2002లో తాము చేపట్టిన చర్యలతో గుజరాత్ లో మళ్లీ హింస ప్రజ్వరిల్లలేదన్నట్టుగా అమిత్ షా వ్యాఖ్యానించారు. మరి అప్పుడు తాము ఏం చేసిందీ డైరెక్టుగా చెప్పకుండా, ఇన్ డైరెక్టుగా మోడీ రాజకీయ వేడిని పెంచారు!
ఈ విషయంపై కాంగ్రెస్ భగ్గుమంది. గోద్రా అల్లర్లను సమర్థించుకుంటున్నారా? అంటూ ప్రశ్నించింది! కాంగ్రెస్ ది అమాయకత్వమో అర్థం కాదు, దిక్కుమాలిన తనమో అర్థం కాదు. తను చేయాలనుకుంటున్న రాజకీయాన్ని బీజేపీ సూటిగా చేసేస్తోంది. ఇందులో మొహమాటం ఏమీ లేదు. అయితే బీజేపీ చర్యలను ఎండగట్టలేని కాంగ్రెస్ పార్టీ తన మాటలతో తనే ఇరకాటంలో పడుతుంది ప్రతి సారీ! బీజేపీ దుందుడుకు రాజకీయం ముందు కాంగ్రెస్ ఫెయిల్యూర్ ఇలా కొనసాగుతూనే ఉంది!
దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మోడీనే అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి అనేంత స్థాయిలో బీజేపీ ప్రచారం సాగుతూ ఉంటుంది. దీనికి గుజరాత్ ఏ మాత్రం మినహాయింపు కాదు. మిగతా రాష్ట్రాల కన్నా ఇంకా ఎక్కువ స్థాయిలో మోడీ పేరుతో బీజేపీ వెళుతోందిక్కడ. డబుల్ ఇంజన్ , డబుల్ డక్కర్.. లాంటి నినాదాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. మోడీ గుజరాత్ కు 12 యేళ్ల పాటు సీఎంగా వ్యవహరించారు. ఎనిమిదేళ్ల కిందట ప్రధాని పీఠం చేపట్టి గుజరాత్ వదిలిపోయారు. మరి గుజరాత్ లో 20 యేళ్ల తర్వాత కూడా మోడీ పేరుకు ఉన్న పదునేమిటో త్వరలో తేలిపోనింది.