మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల్లో ఒకరైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య పులివెందుల కోర్టులో ఎప్పుడో దాఖలు చేసిన పిటిషన్ ఎట్టకేలకూ విచారణకు రావడం, అందులో భాగంగా ఆమె వాంగ్మూలాన్ని న్యాయస్థానం రికార్డు చేయడం ఆసక్తిదాయకమైన పరిణామంగా మారింది.
ఈ కేసులో సీబీఐ విచారణ తీరుపై తులసమ్మ కోర్టును ఆశ్రయించారు. అది కూడా తొమ్మిది నెలల కిందటే! ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే ఆమె పులివెందుల కోర్టులో పిటిషన్ వేశారు. అయితే అది ఎంతకూ విచారణకు రానట్టుగా ఉంది. చివరకు తాజాగా ఈ విషయంలో ఆమె వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది.
తులసమ్మ ఫిర్యాదు ప్రకారం… అప్రూవర్ పేరుతో ఈ కేసు విచారణను తప్పుదోవ పట్టించారనేది ప్రధానమైన అంశం. తన భర్తను ఈ కేసులో నిందితుడిగా చేర్చడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు అనేక కారణాలు ఉండవచ్చని.. అందులో ఆస్తి, వివాహేతర బంధం, కుటుంబ వ్యవహరాలు వివేక హత్యకు కారణాలని తులసమ్మ తన పిటిషన్లో ఆరోపించింది. అయితే ఈ కోణాల్లో సీబీఐ విచారణ జరగడం లేదని ఆమె ప్రధాన అభియోగం.
అంతకు మించిన విషయం… ఈ కేసులో వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయన బావమరిది శివప్రకాష్ రెడ్డిల ప్రమేయంపై తులసమ్మ కోర్టు దృష్టికి తీసుకెళ్లడం. ఈ కేసులో వారితో పాటు టీడీపీ నేత బీటెక్ రవి, కొమ్మా పరమేశ్వరరెడ్డిలను కూడా నిందితులుగా నమోదు చేసి విచారణ చేపట్టాలని తులసమ్మ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసింది న్యాయస్థానం. ఇందుకు అనుగుణంగా తులసమ్మ ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించిందని ఆమె తరఫు న్యాయవాది ప్రకటించారు!
మొత్తానికి ఇప్పటికే అనేక మలుపులతో సాగుతున్న వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తులసమ్మ ఫిర్యాదుతో మరో మలుపు తిరుగుతుందా? అనేది ఆసక్తిదాయకమైన అంశం. వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడు, ఆయన బావమరిదిని నిందితులుగా పేర్కొంటూ.. వివాహేతర బంధం వ్యవహారం గురించి తులసమ్మ తన వాంగూల్మంలో పేర్కొన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.