పార్టీలో రివ్యూలు, సర్వేలు ఎన్ని పెట్టినా చివరకు తాను అనుకున్నదే చేస్తుంటారు పవన్ కల్యాణ్. జనసేనలో పవన్ మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరూ చేయరు, పోనీ ఎవరైనా సలహా ఇవ్వాలని ప్రయత్నిస్తే వారి పొజిషన్ మరుసటి రోజుకే తేడా కొడుతుంది. అందుకే ప్రస్తుతం పవన్ కల్యాణ్ చుట్టూ ఆయనకి భజన చేసే కోటరీ మాత్రమే మిగిలింది. ఆయన నిర్ణయాలకు ఆహా ఓహో అనే మనుషులే చుట్టూ ఉన్నారు.
అయితే గ్రామ సచివాలయ పరీక్షల వ్యవహారంలో పవన్ పచ్చ ఉచ్చులో పడుతున్నారని కొంతమంది వారించారట. కేవలం ఓ పత్రిక రాసిన కథనాలను బేస్ చేసుకుని, మరికొంత మంది పార్టీ అనుబంధ విద్యార్థి నేతల ఆందోళనలను పరిగణలోకి తీసుకుని పరీక్ష పేపర్ లీకైందంటూ మాట్లాడటం సరికాదని పవన్ కి చెప్పారట ఇద్దరు ముఖ్యనేతలు.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే లక్షా 18వేల ఉద్యోగాల భర్తీ అంటే సాధారణ విషయం కాదని, అలాంటి సాహసం చేసిన జగన్ ని కేవలం ఊహాజనిత ఆరోపణలతో విమర్శించడం సరికాదని అన్నారట. అదే సమయంలో 18లక్షల మంది నిరుద్యోగుల్లో భయాందోళనలు నింపడం కూడా మంచి పద్ధతి కాదని చెప్పారట.
అయితే పవన్ కి ఈ మాటలు రుచించలేదు. తనదైన శైలిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. పేపర్ లీకైందని, అధికారపక్షం వారికే ఉద్యోగాలు కట్టబెట్టారని పచ్చ బ్యాచ్ తో కలిసి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఆధారాలున్నాయా లేదా అని ఆలోచించకుండానే పవన్ కల్యాణ్ ఇలా వితండవాదం చేస్తున్నారు. దీంతో ఇటు ప్రజల్లో కూడా పవన్ పలుచబడుతున్నారు. ఈ విషయంపై సొంత పార్టీ నేతలు చెప్పే హితవు పవన్ చెవికెక్కించుకోవడం లేదు.
పచ్చ ట్రాప్ లో పూర్తిగా పడిపోయి పరీక్షలపై విమర్శలు చేస్తున్నారు జనసేనాని. జగన్ ని టార్గెట్ చేసుకుని మాట్లాడటమే రాజకీయం అనుకుంటున్నారు. అందుకే జగన్ 100రోజుల పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించిన పవన్.. ఇప్పుడు గ్రామ సచివాలయం పరీక్షలపై కూడా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారు.