చిరంజీవి సినిమాలో 'మొక్కే కదా అని పీకేస్తే పీక తెగుద్ది'.. అనే డైలాగ్ చాలా పాపులర్. ఇది పర్యావరణ రక్షణకు సంబంధించిన ఓ సందేశం, హెచ్చరిక. దీన్నే తెలంగాణలోని ప్రస్తుత రాజకీయాలకు అన్వయించుకుంటే 'ఉపఎన్నికే కదా అని తేలిగ్గా తీసుకుంటే పరువు పోతుంది' అని చెప్పుకోవచ్చు. రాజకీయ పార్టీలకు, నాయకులకు చాలా సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిల్లో సార్వత్రిక ఎన్నికలేకాదు, ఉప ఎన్నికలూ పెద్ద సవాలే. అధికార పార్టీకి చట్టసభలో ఫుల్ మెజారిటీ ఉన్నా కూడా ఏదైనా ఉప ఎన్నికలో ఓడిపోతే దాని ప్రభావం చాలా ఉంటుంది. ప్రతిపక్షం ఉప ఎన్నికలో గెలిస్తే దానికి పొటిటికల్ మైలేజీ వస్తుంది. గ్రాఫ్ పెరుగుతుంది.
తెలంగాణ రాజకీయాలు హుజూర్ నగర్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. ఇది అధికార పార్టీ టీఆర్ఎస్తోపాటు కాంగ్రెసుకు, బీజేపీకి 'ఇజ్జత్ కా సవాల్' (పరువు సమస్య) గా మారినప్పటికీ మిగతా రెండు పార్టీల కంటే కాంగ్రెసుకే హుజూర్ నగర్ పెద్ద సమస్యగా, తలనొప్పిగా మారిందని చెప్పుకోచ్చు. ఎందుకంటే ఇది ఆ పార్టీ నియోజకవర్గం కాబట్టి. పార్టీ కోణంలోనే కాదు, పిసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోణంలో చూసినా అక్కడ కాంగ్రెసు గెలిచి తీరాల్సిందే. అది ఆయన గెలిచిన నియోజకవర్గం. ఆయన పార్లమెంటుకు ఎన్నికయ్యాడు కాబట్టి ఉపఎన్నిక అనివార్యమైంది. అందులోనూ తన భార్య, మాజీ ఎమ్మెల్యే పద్మావతినే అక్కడ నిలబెడుతున్నాడు (ఆమె దాదాపు ఖరారైనట్లే అంటున్నారు. అధిష్టానం ఆమోదముద్ర వేయాల్సివుంది) కాబట్టి ఈ ఉప ఎన్నిక వ్యక్తిగతంగా ఆయనకు పెద్ద సవాల్.
పద్మావతి అభ్యర్థిత్వం పైనే కదా రేవంత్ రెడ్డి గొడవ చేసింది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిగా మిగిలివున్న కాంగ్రెసు పార్టీని పూర్తిగా బొంద పెట్టాలని పట్టుదలగా ఉన్నారు కాబట్టి ఉప ఎన్నికను తేలిగ్గా తీసుకోలేదు. ఉప ఎన్నికల పట్ల ఆయన మొదటినుంచీ సీరియస్సే. ఆయన మొక్కే కదా అన్నట్లుగా నిర్లక్ష్యంగా చూడరు. ఉప ఎన్నికలోనూ యుద్దానికి సైన్యాన్ని మోహరించినట్లు నాయకులను మోహరిస్తారు. వ్యూహాలు రచిస్తారు. నల్లగొండ ప్రాంతంలో కాంగ్రెసు ఉనికి ఇంకా మిగిలి ఉండటాన్ని అస్సలు సహించలేకపోతున్నాడు.
హుజూర్ నగర్లో గులాబీ పార్టీ గెలవకపోయినా ప్రభుత్వానికి, పార్టీకి వచ్చే నష్టం ఏమీలేదు. కాని కేసీఆర్ ప్రభ తగ్గిపోతోందనే ప్రచారం జోరందుకుంటుంది. లోకసభ ఎన్నికల్లో తాను ఆశించినట్లు 16కు 16సీట్లు రాకపోవడంతో ఆయన చాలా నిరాశపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ను కాంగ్రెసు, బీజేపీ దెబ్బ కొట్టడంతో కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు. సారు…కారు…పదహారుకు కాంగ్రెసు, బీజేపీ కళ్లెం వేసిన తరువాత ఆ రెండు పార్టీలు టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని ప్రచారం చేసుకుంటున్నాయి.
కాంగ్రెసు కంటే బీజేపీ దూకుడు ఎక్కువగా ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అంటోంది. సాధారణంగా ఎన్నికల విషయంలో కేసీఆర్ ప్రతిపక్షాల కంటే చాలా స్పీడుగా ఉంటారు. హుజూర్ నగర్ విషయంలోనూ ఆయన అదే వేగాన్ని ప్రదర్శించారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డిని ఎంపిక చేయడమే కాకుండా బీఫామ్ కూడా ఇచ్చేశారు. ఉత్తమ్ కుమార్ భార్య అభ్యర్థిత్వం విషయంలో రాష్ట్ర కాంగ్రెసు అధిష్టానం ఆమోదం కోసం ఎదురుచూస్తుండగా, బీజేపీ ఎవరిని నిలబెట్టాలో అర్థంకాక మల్లగుల్లాలు పడుతోంది. రఘునందన్‌రావు పేరు తెరమీదికి వచ్చింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిపోయి పోటీ చేయాలనుకుంటోంది. మరి ఆ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
టీడీపీ కూడా పోటీ చేయాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ ఎలాగూ గెలవదని నేతలకు తెలుసు. కాని గమ్మున ఉండటం కంటే పోటీలో ఉండటమే మంచిదని కొంతమంది నాయకత్వానికి సలహా ఇస్తున్నారు. దీనిపై అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకోవల్సివుంది. ఏది ఏమైనా హుజూర్నగర్ టీఆర్ఎస్-కాంగ్రెసు పార్టీ మధ్య పోరాట వేదికగా ఉంది. కాంగ్రుసులో విభేదాలు రచ్చకెక్కాయి కాబట్టి ప్రచార తీరుతెన్నులు ఎలా ఉంటాయనేది ఆసక్తికరం.
టీఆర్ఎస్లో మంత్రి కమ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యూహాలు రూపొందిస్తున్నారు. గెలుపుపై ఆ పార్టీ ధీమాగా ఉంది. టీఆర్ఎస్, కాంగ్రెసు రెండూ 30 వేల మెజారిటీ అంటూ చెప్పుకుంటున్నాయి. చూద్దాం… ఎవరి ఇజ్జత్ నిలబడుతుందో..!