ఇప్పటి వరకూ గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ కార్డుల పంచాయితీ తెగలేదు. దాదాపు పదేళ్ల కిందటి నుంచినే ఆధార్ కార్డుల జారీ మొదలైంది. పదేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆధార్ విషయంలో తర్జనభర్జనలే. కోర్టులే ఈ విషయంలో రకరకాలుగా స్పందించాయి. ఆధార్ తప్పనిసరి ఒకసారి, ఆధార్ అవసరం లేదని మరి కొన్నిసార్లు.. రకరకాల తీర్పులు వచ్చాయి. అయితే సంక్షేమ పథకాల అమలు దగ్గర నుంచి, వివిధ వ్యవహారాల్లో ఆధార్ ను తప్పనిసరిగా అమలు చేస్తూ ఉన్నారు.
ఆధార్ తో వాహనాలు, కొత్తగా కొనుగోలు చేసే ఆస్తులను అనుసంధానం చేస్తూ ఉన్నారు. ఇలా సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడా ఒకరకంగా వడపోత సాగుతూ ఉంది. ఇలా ఇప్పటికి ఆధార్ చట్టం అమలు అవుతోందని అనుకుంటే.. ఇంతలోనే అమిత్ షా మరో బాంబు పేల్చారు.
ఆధార్ కు ప్రత్యామ్నాయంగా మరో కార్డు తెస్తారట. అది కేవలం ఆధార్ కు మాత్రమే కాదట.. అన్నింటికీ ఉపయోగించుకోవచ్చట. డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, ఆధార్, పాన్.. అన్నీ అదేనట! అలాంటి కార్డును తీసుకురాబోతున్నట్టుగా కేంద్ర హోంశాఖ మంత్రి ప్రకటించారు. వేటికది ప్రత్యేకం కాకుండా.. అన్నింటికీ ఒకటే కార్డు అంటున్నారు అమిత్ షా.
మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ అమలు చేయడం అంత తేలికకాదు.ఈ విషయంలో కోర్టుల తీర్పులు, ప్రభుత్వ నిర్ణయాలు బోలెడన్ని ఉంటాయి. ఆధార్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది అనుకోవడానికే పదేళ్లకు పైగా పట్టింది. ఇక ఈ కొత్త కార్డుల పంచాయితీ ఏమిటో. గ్రామీణ స్థాయిల్లో ఇప్పటికీ ఆధార్ విషయంలో ప్రజలకు బోలెడన్ని సందేహాలు. అవి తీరికనే ఇప్పుడు మరో పంచాయితీ మొదలుపెడుతున్నట్టున్నారు!