రాజకీయంగా అధికార పార్టీతో పోరు సాగిస్తున్న జనసేనాని పవన్‌కల్యాణ్ కు తోటి మిత్రపక్షం బీజేపీ అండగా నిలబడకపోవడంపై చర్చ సాగుతోంది. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్లో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం తనను అడ్డు పెట్టుకుని చిత్ర పరిశ్రమను వేధిస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు.
సినిమా టికెట్లను ప్రభుత్వం అమ్మడం ఏంటంటూ ఆయన ఊగిపోయారు. అలాగే జగన్‌ను రెడ్ల పక్షపాతిగా నెగెటివ్ చేసేందుకు ఆయన ప్రయత్నించారు.
ఆ తర్వాత వైసీపీ నుంచి తీవ్రస్థాయిలో రియాక్షన్ ఎదురైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అవాకులు చెవాకులు పేలితే తాట తీస్తామని మంత్రులు హెచ్చరించారు. ఇదేం సినిమా కాదని, రియల్ లైఫ్‌లో ఎవరో రాయించిన డైలాగ్‌లను ఇష్టానుసారం చదివితే ఊరుకోం అని హెచ్చరించారు.
పవన్‌కల్యాణ్, వైసీపీ నేతల మధ్య సాగుతున్న డైలాగ్ వార్‌ను టీడీపీ, బీజేపీ నేతలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా జనసేనానికి మిత్రపక్షమైన బీజేపీ కూడా తనకేమీ సంబంధం లేనట్టు మౌనాన్ని ఆశ్రయించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తనతో అంటీముట్టనట్టుగా ఉండడం వల్లే జనసేనను బీజేపీ పట్టించుకోవడం లేదనే చర్చకు దారి తీసింది.
జనసేన, బీజేపీ మధ్య సంబంధాలు అంతంత మాత్రమే అనేందుకు తాజా ఎపిసోడ్లో జాతీయ పార్టీ ప్రేక్షకపాత్ర పోషించడాన్ని ఉదహరిస్తున్నారు. అయితే ఇది సినీ వ్యవహారంగా చూడడం వల్లే బీజేపీ జోక్యం చేసుకోలేదనే వాళ్లు కూడా లేకపోలేదు. మొత్తానికి ఈ ఎపిసోడ్‌తో ఎవరెవరి మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో వెల్లడవుతున్నాయని చెప్పొచ్చు.