రెడ్లు…అందరివారు..పవన్ కొందరివాడు

టాలీవుడ్ లో ఇంతో అంతో పేరున్న నిర్మాత చాలా మంది టాప్ హీరోలతో సినిమాలు చేసారు. ఆయన ఓ గమ్మత్తయిన విషయం చెప్పారు ఓసారి పర్సనల్ చిట్ చాట్ లో. మెగాస్టార్ చిరంజీవి ఓ…

టాలీవుడ్ లో ఇంతో అంతో పేరున్న నిర్మాత చాలా మంది టాప్ హీరోలతో సినిమాలు చేసారు. ఆయన ఓ గమ్మత్తయిన విషయం చెప్పారు ఓసారి పర్సనల్ చిట్ చాట్ లో. మెగాస్టార్ చిరంజీవి ఓ సారి మాటల్లో మాటగా, అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాను. 

ఏదైనా మంచి సంబందం వుంటే చెప్పండి. రెడ్లు అయినా ఫరవాలేదు…అన్నారన్నది ఆ ముచ్చట. గమ్మత్తేమిటంటే ఆ తరువాత ఆయన రెడ్డి ఇంటి నుంచే కోడలిని తెచ్చుకున్నారు. ఆ కోడలు ఆయన పరువు ప్రతిష్టలను మరింత ఇనుమడింపచేసిందే తప్ప, దిగజార్చలేదు.

అల్లు అర్జున్ ఏరి కోరి ప్రేమించి మరీ రెడ్ల ఇంటి అమ్మాయిని చేసుకున్నారు. అన్యోన్యంగా జీవిస్తున్నారు.

మంచు విష్ణు కూడా రెడ్ల అమ్మాయిని ప్రేమించారు. పెళ్లాడారు. ఫుల్ హ్యాపీ. బహ్మానందం కోడలు కూడా రెడ్ల అమ్మాయే.  ఇండస్ట్రీలో ఇలా లెక్కలు తీస్తే ఇలా చాలా వున్నాయి. 

టాలీవుడ్ లో కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అంటారు. కమ్మవారు చాలా కట్టుగా, తమ  వారంటే ప్రాణం పెట్టేసేలా వుంటారంటారు. కాపుల సంగతి చెప్పనక్కరే లేదు. తమలో తాము సఖ్యతగా వుంటూ, సాయం చేసుకుంటూ ముందుకు సాగాలనుకుంటారు. ఇలాంటి రెండు సామాజిక వర్గాల కుటుంబాల్లో స్మూత్ గా ఇమిడిపోయి, గౌరవం పెంచేలా ప్రవర్తిస్తూ మన్ననలు పొందతున్నారు రెడ్ల ఇంటి అమ్మాయిలు.

అసలు కమ్మవారికి, కాపులకు కులం కట్టుబాట్లు, పట్టింపులు ఏ మేరకు వుంటాయో తెలియంది కాదు. మరి అంత కట్టుబాట్లు, పట్టింపులు కాదని ఎందుకు రెడ్ల సంబంధాలు వెదక్కుంటూ వెళ్తున్నారు. 

సరే ఈ కోడళ్ల విషయం అలా వుంచుదాం. టాలీవుడ్ లో 

నాగిరెడ్డి..చక్రపాణి..కులాల సంబంధాలు లేకుండా ఎంత కలిసి వున్నారు. ఎలాంటి సినిమాలు అందించారు. ప్రభాకరరెడ్డి …చిత్రపరిశ్రమలోని చిన్న కళాకారులు, వర్కర్లు అందరికీ ఇళ్లు ఇప్పించడానికి ఎంత తపన పడ్డారు. అక్కినేని-టీఎస్సార్, ఎన్టీఆర్-సినారె ల బంధం జగద్విదితం. 

రెడ్డి అని చివర్న పెట్టుకున్న నిర్మాత, దర్శకుడు ఎవరైనా కావచ్చు. అందరితో కలిసే వున్నారు. అందరితో సినిమాలు చేసారు. శభాష్ అనిపించుకున్నారు. ఆటిట్యూడ్ అని ఏనాడూ అనిపించుకోలేదు. 

చిరుతో కోదండరామిరెడ్డి అయినా, కృష్ణతో చంద్రశేఖర రెడ్డి అయినా, నాగార్జునతో శివప్రసాదరెడ్డి అయినా, బాలయ్యతో గోపాల్ రెడ్డి అయినా, మహేష్ బాబుతో దిల్ రాజు రెడ్డి (అలా అని పవన్ కళ్యాణ్ అన్నారు) అయినా, ఇలా ఎవరు అయినా రెడ్లు అందరి మన్ననలు అందుకున్నారు తప్ప, యారోగెంట్ అనో, కులపిచ్చ అనో, ఇంకోటి అనో అనిపించుకోలేదు. పైగా ఆడు చౌదరి..ఈడు నాయుడు అని ఏ సినిమా రెడ్డీ పాయింట్ చేయలేదు.

ఇన్నాళ్లుగా దిల్ రాజుగా వున్నారు. శిరీష్ అనే ప్రకటించుకున్నారు. కానీ ఈ రోజు పవన్ వచ్చి 'మీరూ రెడ్డేగా' 'మీరు మీరు రెడ్లేగా' అని చెప్పడం అంటే ఏమనుకోవాలి? రాజకీయ నాయకులు కులాల గురించి మాట్లాడ వచ్చు. కానీ రాజకీయ పార్టీల అధినేతలు కాదు. చంద్రబాబు నాయుడు పార్టీ మనుషులు కులాల గురించి మాట్లాడి వుండొచ్చు. ఆయన కాదు. జనసేన నాయకులు కులాల గురించి మాట్లాడితే తప్పు కాదు. కానీ పార్టీ అధినేతగా పవన్ మాట్లాడకూడదు. అది కూడా సినిమా ఫంక్షన్ లో అస్సలు మాట్లాడకూడదు.

ఈ విధంగా మాట్లాడడం ద్వారా పవన్ మరింత పలుచన అయ్యారు. అది మాత్రం వాస్తవం.