పవన్ విషయంలో పోసాని హద్దులు దాటారా?

ఓ సినిమా ఫంక్షన్ లో వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. ఏకంగా ఓ మంత్రిని సన్నాసి అన్నారు. దానిపై వైసీపీ కూడా ఘాటుగా స్పందిస్తోంది. 2 రోజులుగా వైసీపీ నేతలు పవన్…

ఓ సినిమా ఫంక్షన్ లో వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. ఏకంగా ఓ మంత్రిని సన్నాసి అన్నారు. దానిపై వైసీపీ కూడా ఘాటుగా స్పందిస్తోంది. 2 రోజులుగా వైసీపీ నేతలు పవన్ పై విరుచుకుపడుతున్నారు. పవన్ ను వెధవన్నర వెధర అంటూ తిట్టారు. తాజాగా వైసీపీ వీర విధేయుడు పోసాని కూడా పవన్ ను తిట్టడం కోసం ప్రెస్ మీట్ పెట్టారు. అనుకున్న కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేశారు. అయితే ఈ క్రమంలో పోసాని హద్దులు దాటినట్టు కనిపించింది.

ఇంతకీ ఆ పంజాబీ అమ్మాయి ఎవరు..?

ఇన్నాళ్లూ పవన్ పై వచ్చిన విమర్శలు ఒకెత్తు అయితే.. తాజాగా పోసాని ఎత్తుకున్న అంశం, చేసిన విమర్శలు మరో ఎత్తు. ఈ మొత్తం వివాదంలోకి ఓ పంజాబీ హీరోయిన్ ను లాక్కొచ్చారు పోసాని. ఓ ''పవర్'' ఫుల్ వ్యక్తి, సినిమా అవకాశాలు ఇప్పిస్తానని సదరు పంజాబీ అమ్మాయిని లొంగదీసుకున్నాడని, గర్భవతిని చేశాడని పోసాని ఆరోపించారు. సదరు హీరోయిన్ తల్లిదండ్రులకు 5 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ల నోరు మూయించాడని, ఆ హీరోయిన్ కు అబార్షన్ చేసి, ఆమెను మానసిక రోగిగా మార్చేశాడని పోసాని ఆరోపించారు.

అమ్మాయిలంటే అమితమైన గౌరవం ఉన్న పవన్ కల్యాణ్, ఈ ఇష్యూను తలకెత్తుకోవాలని.. ఆ అమ్మాయికి న్యాయం చేయాలని పోసాని డిమాండ్ చేశారు. పవన్ చెవిలో ఆ అమ్మాయి పేరు చెబుతానన్నారు. అవసరమైతే ఆ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించి, హీరోయిన్ కు న్యాయం చేస్తే, తన వంతుగా పవన్ కు గుడి కట్టి పూజిస్తానని అన్నారు పోసాని.

''పవర్'' ఫుల్ హీరోకు ఆ అమ్మాయితో సంబంధం..?

నిజానికి పోసాని అన్నది ఎవరినో అందరికీ తెలుసు. ఎవ్వర్ని టార్గెట్ చేస్తూ, తెరమరుగైపోయిన ఆ వివాదాన్ని పోసాని మరోసారి రాజేశారో అందరికీ తెలుసు. అన్యోపదేశంగా పోసాని ఏం చెప్పాలనుకుంటున్నారో అందరికీ అర్థమైంది. గతంలో సోషల్ మీడియాలో ఈ వివాదంపై చాలా రచ్చ నడిచింది. వీడియో టేపులు కూడా ఉన్నాయనే ప్రచారం సాగింది. మరోవైపు సదరు హీరోయిన్ కూడా పరోక్షంగా ఆ బడా హీరోపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన వైనం కూడా చాలామందికి గుర్తుండే ఉంటుంది.

కాస్టింగ్ కౌచ్ రచ్చ అన్ని పరిశ్రమల్ని ఓ ఊపు ఊపేస్తున్న టైమ్ లో, ''పవర్'' ఫుల్ హీరోపై సదరు హీరోయిన్ కూడా పరోక్షంగా చాలా కామెంట్స్ చేసింది. భగవంతుడు ఎప్పటికైనా వాళ్లను శిక్షిస్తాడు అనే రీతిలో పోస్టులు పెట్టింది. తను పడిన మానసిక వేదన, అనుభవించిన మానసిక ఒత్తిడిని వాళ్లు కూడా అనుభవిస్తారంటూ శాపనార్థాలు పెట్టింది. ఆ టోటల్ ఎపిసోడ్ లో ఓ స్టార్ డైరక్టర్ పేరు కూడా గతంలో ప్రముఖంగా వినిపించింది. ఆయనే దగ్గరుండి వ్యవహారాన్ని పైకి రాకుండా, గుట్టుచప్పుడు కాకుండా సెటిల్ మెంట్ చేశారని కూడా అంటారు.

నో డౌట్ పోసాని హద్దు దాటారు..!

పవన్ పై ఎవరైనా వ్యక్తిగత విమర్శలు చేయాలంటే అలాంటి వాళ్లంతా ఇన్నాళ్లూ చేసింది కేవలం పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల ఇష్యూను పైకి తీసుకురావడమే. పవన్ కల్యాణ్ చేసుకున్న 3 పెళ్లిళ్ల వ్యవహారాన్ని ఒక దశలో జగన్ కూడా లేవనెత్తారు. వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేయాలనుకున్నప్పుడు పవన్ కు సంబంధించి ఇంతకుమించిన హాట్ టాపిక్ లేదు. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. అందులో దాచాల్సింది కూడా ఏమీ లేదు. ఒక దశలో పవన్ కల్యాణ్ కూడా తన పెళ్లిళ్లపై పరోక్షంగా స్పందించారు. అలా జరిగిపోయింది, తన పెళ్లిళ్లకు రాజకీయాలకు ఏంటి సంబంధం అని కూడా ఆయన వివరణ ఇచ్చుకున్నారు. 

కానీ ఇప్పుడు విషయం వేరు. పంజాబీ హీరోయిన్ ను గర్భవతిని చేశారనే అంశాన్ని పవన్ తాజా కామెంట్స్ కు ముడిపెడుతూ తెరపైకి తెచ్చారు పోసాని. ఆ సమస్యను పవన్ మాత్రమే పరిష్కరించాలని పోసాని డిమాండ్ చేయడంతోనే అసలు చిక్కొచ్చి పడింది. 

ఇప్పటివరకు వైసీపీ నేతలంతా పవన్ పై చేసిన విమర్శలన్నీ ఒక దశ వరకు ఓకే. కానీ పోసాని ఎత్తిన ఈ అంశం మాత్రం ఆయన హద్దులు దాటారనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ఎలాంటి సాక్ష్యాలు లేని, కేవలం సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కు మాత్రమే పరిమితమైన ఓ విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి పోసాని లేవనెత్తడం అభ్యంతరకరం.

సమస్యను పక్కదోవ పట్టించడం కాక ఇంకేంటి?

నిజానికి ఈ ఇష్యూ గురించి వైసీపీ నేతల్లో చాలామందికి తెలుసు. ఈ ఇష్యూ వెనక ఉన్న హీరోయిన్ ఎవరు, ఆ బడా స్టార్ ఎవరనే విషయం కూడా తెలుసు. కానీ వాళ్లెవరూ ఇప్పటివరకు ఈ వివాదాన్ని ఎత్తలేదు. కేవలం పవన్ కల్యాణ్ 3 పెళ్లిళ్ల వరకే వ్యక్తిగత విమర్శల్ని పరిమితం చేశారు. “పంజాబీ హీరోయిన్ ను ఎవరో గర్భవతి”ని చేశారనే విమర్శలతో పోసాని హద్దులు దాటారు.

పోనీ వైసీపీ నేతలు అన్నట్టే.. కోడి కత్తి కేసు, వైఎస్ వివేకా హత్యకేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనుకుంటే.. ఇప్పుడు పంజాబీ హీరోయిన్ ను ఓ పెద్ద హీరో గర్భవతిని చేశాడనే వ్యవహారంలో కూడా చట్టమే ముందుకు రావాలి కదా. అలా ఆమెకు న్యాయం చేయాలంటే పోసాని ఆమె తరపున వకాల్తా పుచ్చుకుని ముందు ఫిర్యాదు చేయాలి కదా. ఈ అంశంపై సీబీఐ విచారణ జరిపించడానికి, అసలు పవన్ కల్యాణ్ కీ ఏంటి సంబంధం..? పోనీ పవర్ ఫుల్ హీరో అన్యాయం చేశాడు సరే.. ఆ పుణ్యం ఏదో పోసాని కట్టుకోవచ్చు కదా. అలా చేస్తే పోసానికే ఆ హీరోయిన్ గుడికట్టి పూజిస్తుందేమో కదా..?

సినిమా ఫంక్షన్ వేదికపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శలన్నీ పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినవే, జగన్ పై తనకున్న అక్కసుతో చేసినవే. వాటికి అదే రీతిలో జవాబు చెబితేనే వైరిపక్షం వైపు పాయింట్ ఉంటుంది. ఇలా పంజాబీ హీరోయిన్ల పేరు తెరపైకి తెస్తే.. పవన్ ని నేరుగా ఎదుర్కొనే దమ్ములేక సమస్యను పక్కదారి పట్టించారనే అపవాదు మిగులుతుంది.