టికెట్ రేట్ల వ్యవహారం రాను రాను కీలకంగా మారుతోంది. ప్రభుత్వం రేట్లు తగ్గించింది. మళ్లీ కాస్త పెంచే అవకాశం వుంది. ఆ సవరణ జీవో ఎప్పుడు వస్తుందన్నది ఇంకా తెలియదు. కానీ థియేటర్లు చాలా ధైర్యంగా చాలా చోట్ల పాత రేట్లే అమ్మేస్తున్నాయి. దానికి రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నాయి. అవలంబిస్తున్నాయి.
కానీ ఇవన్నీ 4 తరువాత సీరియస్ టర్న్ తీసుకునే అవకాశం వుంది. ఆ రోజు కోర్టు కేసు హియరింగ్ వుందని తెలుస్తోంది. నిర్మాత నట్టి కుమార్ సినిమా టికెట్ ల కొత్త జీవో అమలు కావడం లేదంటూ కోర్టులో కేసువేసారు. దాని వాయిదా 4న వుంది. అమలు చేస్తున్నదీ లేనిదీ ఆ రోజు చెప్పాల్సి వుంటుంది.
అమలు చేస్తున్నాము అని చెబితే, లేదూ అంటూ నట్టి కుమార్ ప్రూవ్ చేయాల్సి వుంటుంది. ఆయన దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం ఎక్కడ పాత రేట్లే అమ్ముతున్నారో సాక్ష్యాలు సేకరించి పెట్టుకునే పనిలో వున్నారు. ఆ సంగతి అలా వున్నా, ఆ రోజు నుంచి అయినా ప్రభుత్వం కచ్చితంగా రేట్లు అమలు చేయాల్సి వుంటుంది. అమలు చేస్తున్నాం అని చెప్పాల్సి వుంటుంది.
లేదా అమెండ్ మెంట్ జీవో ఆ లోగా ఇవ్వాల్సి వుంటుంది. ఇస్తారో లేదా పవన్ కళ్యాణ్ స్పీచ్ కు భయపడి ఇచ్చారు అనే ఆలోచనతో కాస్త ఆగుతారో తెలియదు. అలా ఆగి, సవరణ జీవో ఇవ్వకపోతే మాత్రం, కొత్త జీవో అమలు మీద కాస్త దృష్టి పెట్టాల్సి వుంటుంది. అలా జరిగితే థియేటర్లకు కష్టం అవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.