జనసేనాని పవన్‌కల్యాణ్ సెల్ఫ్‌గోల్ వేసుకున్నారు. సినిమా ఫంక్షన్‌లో అసందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు మంత్రులపై అవాకులు చెవాకులు పేలి అభాసుపాలయ్యారు. అధికార పార్టీ వైసీపీ నుంచి బాణాల్లా దూసుకొస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేని దుస్థితి. తాను సినీ రంగ ఉద్ధారకుడిగా సభా వేదికపై గళమెత్తిన పవన్‌కి, ఆ రంగం నుంచే మద్దతు కొరవడడం గమనార్హం.
చివరికి తనపై నలువైపులా నుంచి దాడి జరుగుతుంటే, ప్రతిఘటించే పరిస్థితి లేకుండా పోయింది. పవన్ ఎంతటి దయనీయ స్థితిలోకి వెళ్లారంటే… తనకు తానుగా మద్దతు ప్రకటించే వరకూ దిగజారారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరీ ముఖ్యంగా పవన్ వివాదాస్పద వ్యాఖ్యలపై సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆదివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేర్ని నాని విమర్శలు పవన్‌కు బాగా డ్యామేజీ కలిగించాయనే చర్చ జరుగుతుండగానే, నిన్న ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి చెలరేగిపోయారు. పంజాబ్ అమ్మాయి తెరపైకి తెచ్చి వీర కుమ్ముడు కుమ్మారని చెప్పొచ్చు.
పంజాబ్‌కు చెందిన ఓ యువతి తెలుగు సినిమాలో అవకాశాల కోసం హైదరాబాద్ వస్తే సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి అవకాశాలు ఇస్తానని చెప్పి మోసం చేశారని పోసాని కృష్ణమురళి చెప్పారు. ఆ ప్రముఖ వ్యక్తి ఆమెకు అబార్షన్ చేయించి, ఎవరికి చెప్పవద్దని బెదిరించి రూ.5 కోట్లు ఇచ్చారట.. అని తెలిపారు.
ఆ ప్రముఖ వ్యక్తి చేతిలో మోసపోయిన పంజాబ్ అమ్మాయి పేరు పవన్‌కల్యాణ్ చెవిలో చెబుతానని, ఆ వ్యక్తిపై పోరాటం చేసి ఆమెకు న్యాయం చేస్తే ఆయనకు గుడి కడతానని పోసాని చెప్పడం సంచలనం రేకెత్తించింది. ఆ ప్రముఖ వ్యక్తి ఎవరో తెలుగు సమాజానికి బాగా తెలుసుననే కామెంట్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
‘రెండుచోట్ల ఎమ్మెల్యేగా నిలుచుని, ఒక్కచోట కూడా గెలవని సన్నాసిన్నర సన్నాసి అతనే. ఈ వెధవన్నర వెధవకు తిక్క కాదు.. ఒళ్లంతా ఉన్నది లెక్క పిచ్చే. దోపిడీదారులకు ఈ ప్రభుత్వం సింహ స్వప్నం. నువ్వు దోపిడీ చేస్తున్నావు కాబట్టే నీకు ఈ ప్రభుత్వం సింహస్వప్నంగా కనిపిస్తోంది’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు. పేర్ని నాని, పోసాని కృష్ణమురళి సంధించిన ప్రశ్నలకు పవన్‌కల్యాణ్ , ఆయన మద్దతుదారుల నుంచి సమాధానాలు కొరవడ్డాయి. ఎందుకంటే వాళ్ల దగ్గర సమాధానాలు లేవు కాబట్టి.
ఈ నేపథ్యంలో పరువు దక్కించుకోవడానికి అన్నట్టు పవన్ ఓ ట్వీట్ చేశారు.
‘తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైసీపీ గ్రామసింహాల గోంకారాలు.. ఇవన్నీ సహజమే’ అని ట్వీట్ చేశారు. అనంతరం మరో ట్వీట్‌లో …‘హూ లెట్ ద డాగ్స్ ఔట్’ (కుక్కలను బయటకు వదిలింది ఎవరు?) అనే పాట వీడియో క్లిప్‌ను పోస్ట్ చేస్తూ.. నా కిష్టమైన పాటల్లో ఇదీ ఒకటి అని ట్వీట్ చేశారు.
పవన్ ట్వీట్‌లో ఝుంకారాలు, క్రేంకారాలు, ఘీంకారాలు, గోంకారాలు అంటూ రైమింగ్ కుదిరిందే తప్ప, వివరణ కొరవడింది. ఈ విషయంలో పవన్ ఒంటరయ్యారనే టాక్ టాలీవుడ్‌లో నడుస్తోంది.