కరోనా – కోవిడ్ -19 వైరస్ ప్రభావం అంతుబట్టని రీతిలో సాగుతూ ఉంది. భారత దేశంలో ఆ వైరస్ వ్యాప్తి తీవ్రంగానే ఉంది, అదే సమయంలో రికవరీ రేటు కూడా రోజు రోజుకూ మెరుగవుతూ ఉండటం గమనార్హం. జూలై 19 నాడు విడుల అయిన రిపోర్టును పరిశీలిస్తే.. దేశంలో గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కొత్తగా కోవిడ్- 19 బారిన వారి సంఖ్య దాదాపు 38,902గా ఉంది. ఇదే వ్యవధిలో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 23,672 కావడం గమనార్హం. దేశంలో గత ఇరవై నాలుగు గంటల్లో 543 మంది కోవిడ్-19 ప్రభావంతో మరణించినట్టుగా కేంద్రం విడుదల చేసిన ప్రకటనతో తెలుస్తోంది.
కరోనా పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది, జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. మరోవైపు చాలా చోట్ల లాక్ డౌన్ మళ్లీ అమలు చేస్తూ ఉన్నారు. అయితే కొత్త కేసుల సంఖ్య మాత్రం ఏ రోజుకారోజు పెరుగుతూనే ఉంది. వారం- పది రోజుల నుంచి చాలా చోట్ల లాక్ డౌన్ పెట్టారు. అయితే దేశం మొత్తం నమోదవుతున్న కేసుల సంఖ్యలో మాత్రం క్షీణత లేదు. ఇదే సమయంలో కొత్త కేసుల సంఖ్య పెరుగుల స్థాయికి తగ్గట్టుగా రికవరీ రేటు కూడా బాగా పెరుగుతూ ఉండటం ఊరటను ఇస్తున్న అంశం.
రికవరీ రేటు 23 వేల స్థాయిని మించడంతో కోవిడ్-19 ని చాలా మంది సులభంగా జయించగలుగుతున్నారని అనుకోవాల్సి వస్తోంది. అయితే ఏదైనా వేరే వ్యాధితో ఇబ్బంది పడుతున్న వాళ్లను మాత్రం కోవిడ్-19 చాలా ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది. దీంతోనే రోజువారీ కోవిడ్-19 మరణాల సంఖ్య ఐదు వందల స్థాయిని మించినట్టుగా ఉంది. ఇప్పటి వరకూ దేశంలో కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 26,816గా నమోదైందని సమాచారం.