దీపిక పడుకొనె.. ఈ పేరు తెలుగు సినిమాల కోసం చిరకాలంగా వినిపిస్తూనే వుంది. కానీ ఇప్పటికి సాకారమైంది. డార్లింగ్ ప్రభాస్ సరసన దీపిక పడుకునే అనే సౌండ్ నే సినిమాకు భయంకరమైన క్రేజ్ తెచ్చిపెట్టేలా వుంది. మహానటితో తనేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ తో డార్లింగ్ ప్రభాస్ చేయబోయే సినిమా కు ఇప్పటికే పూర్తిగా పాన్ ఇండియా లుక్ వచ్చేసింది.
ఇప్పుడు దీపిక పేరు ప్రకటించడంతోనే ఇక రాధేశ్వామ్ సినిమా అన్నది చిన్నగీతగా మారిపోయింది. ఇప్పటి వరకు రాధేశ్వామ్ కు సంగీత దర్శకుడు ఎవరు అన్నది కూడా ఫిక్స్ కాలేదు. నాగ్ అశ్విన్ సినిమాకు కీరవాణి పేరు వినిపిస్తోంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ ను తీసుకువచ్చే ఆలోచనలు కూడా వినిపిస్తున్నాయి. అవి కూడా ఒక్కొక్కటిగా వెల్లడయిపోతే,. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వేయి కళ్లతో వేచి చూడడం ప్రారంభమైపోతుంది.
నిజానికి బాహుబలి తరువాత ఇలాంటి సినిమా పడాల్సింది. కానీ యువి నిర్వాహకులు మరీ ఓవర్ కాన్పిడెన్స్ తో సుజిత్ లాంటి చిన్న డైరక్టర్ చేతిలో సాహో సినిమా పెట్టి, ఏదేదో చేసారు. ఇప్పుడు మళ్లీ మరోసినిమాను రాధాకృష్ణ లాంటి ఫ్లాపు ఇచ్చిన డైరక్టర్ చేతిలో పెట్టారు. అది కూడా నత్త నడక నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో నాగ్ అశ్విన్ సినిమాలో దీపిక పేరు ప్రకటించడం అంటే, ఇలాంటి అలాంటి ఊపు కాదు ఫ్యాన్స్ కు.
పైగా బాలవుడ్ టాప్ హీరోయిన్ లను తెలుగులో మహేష్ చెంతకు తీసుకురావాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆలియా భట్ కాస్తా రామ్ చరణ్ చెంతకు, దీపిక వచ్చేసారు. చిత్రంగా ఈ రెండూ పాన్ ఇండియా సినిమాలే. అలాంటి సినిమా చేస్తే తప్ప మహేష్ చెంతకు కూడా సరైన టాప్ బాలీవుడ్ హీరోయిన్ ఎంటర్ కాదేమో?