తాజాగా అశోక్ గెహ్లాట్ వెళ్లి గవర్నర్ ను కలిసి తనను సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యేల జాబితాను సమర్పించినట్టుగా సమాచారం. అశోక్ బలనిరూపణ చేసుకోవాలని ఢిల్లీలోని కొంతమంది బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆయన తనకు ఉన్న ఎమ్మెల్యే బలాన్ని పేపర్ మీద రాసిచ్చారట. కాంగ్రెస్ పార్టీ ఇదే ఊపులో విశ్వాస పరీక్షను ఎదుర్కొనబోతోందని సమాచారం. వీలైనంత త్వరగా అసెంబ్లీని సమావేశ పరిచి విశ్వాస పరీక్షను ఎదుర్కొనబోతున్నాడట గెహ్లాట్. ఇప్పటికిప్పుడు ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆ రాష్ట్రంలో బీజేపీకి బాస్ లాంటి నేత వసుంధర రాజే అంత ఉత్సాహంగా లేనట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.
బలాబలాల విషయానికి వస్తే కాంగ్రెస్ కు అధికారికంగా 107 మంది ఎమ్మెల్యేలున్నట్టే. అయితే వారిలో 18 మంది పైలట్ క్యాంప్ లో ఉన్నారట. కాస్త ఇటూ చేసుకుంటే కాంగ్రెస్ ప్రస్తుత బలం 87 మంది ఎమ్మెల్యేలు అని తెలుస్తోంది. ప్రభుత్వం నిలబడాలంటే ప్రస్తుత సంఖ్యల ప్రకారం కనీసం 101 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. సభలో 13 మంది ఇండిపెండెంట్లు ఉన్నారట. వారిలో 10 మంది ఎమ్మెల్యేలు గెహ్లాట్ కు అనుకూలంగా ఉన్నారని సమాచారం.
సీపీఎం ఎమ్మెల్యేలు ఇద్దరు, ట్రైబల్ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారట. వారు గనుక మద్దతు ఇస్తే.. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గే అవకాశాలున్నాయి. అంతేగాక సచిన్ క్యాంపులోని ఇద్దరు ఎమ్మెల్యేలు తమ వైపు మద్దతుగా నిలుస్తున్నారని గెహ్లాట్ క్యాంపు భావిస్తోందట. ఈ విశ్వాసంతోనే విశ్వాస పరీక్షను ఎదుర్కొనడానికి ఆయన రెడీగా ఉన్నారని సమాచారం. విశ్వాస పరీక్షలో నెగ్గితే.. కనీసం ఆరు నెలలు అశోక్ ప్రభుత్వ మనుగడకు ఇబ్బంది ఉండకపోవచ్చు. అదే అదునుగా పైలట్ క్యాంపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే అవకాశాలూ లేకపోలేదు.