టీడీపీ పాలనలో అవినీతి, అక్రమాలు, దోపిడీలతో ఆంధ్రప్రదేశ్ సమాజం రోగగ్రస్తమైందని, తాము అధికారంలోకి వస్తే వైద్యం చేస్తామని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే చెప్పేవారు. ఆయన మాటలను జనం విశ్వసించారు. అందుకే అఖండ మెజార్టీతో అధికారాన్ని ఆయనకు కట్టబెట్టారు.
175 అసెంబ్లీ సీట్లలో 151, 25 పార్లమెంట్ సీట్లలో 22 దక్కించుకుని టీడీపీని కేవలం 23 సీట్లకు కట్టడి చేశారు. పవన్ నేతృ త్వంలో జనసేనకు కేవలం ఒక్కటంటే ఒక్క సీటుతో జనం సరిపెట్టారు. 2019లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం తన పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన మొట్టమొదటి సమావేశంలో జగన్ మాట్లాడుతూ పాలనలో భారీ సంస్కరణలు, మార్పులు తీసుకొస్తానని, తనకు అండగా నిలబడాలని కోరారు.
ఆయన చెప్పినట్టు కొన్ని అంశాల్లో అనూహ్యమైన మార్పులొచ్చాయి, వస్తున్నాయి. సంక్షేమ పథకాల అమల్లో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ తనదంటూ సొంత ముద్ర వేసుకున్నారు. అయితే ఇవన్నీ కూడా జగన్ వ్యక్తిగత శ్రద్ధాసక్తులకు సంబంధించినంత వరకే పరిమితమయ్యాయి. జగన్ పాలనలో ఈ మార్పులు, సంస్కరణలు ఒక వ్యవస్థగా జరగడం లేదనే విమర్శలున్నాయి.
ఇందుకు ఓ చిన్న సంఘటన గురించి ఉదహరిస్తూ పలువురు తెరపైకి తెస్తున్నారు. టీడీపీ పాలనలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బీజేపీ నేత కామినేని శ్రీనివాసరావు బాధ్యతలు నిర్వర్తించారు. 2017, జూన్‌లో ఆయన హయాంలో జీవో నంబర్ 97 జారీ అయింది. ఈ జీవో ఆయుష్ వైద్యుల పదవీ విరమణకు సంబంధించినది. ఆయుష్‌లో ఆయుర్వేద, యునాని, యోగ, సిద్ధ, హోమియో వైద్యులు వస్తారు. ఈ జీవో ప్రకారం ఆయుష్ వైద్యుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 63కి పెంచాలి. కానీ ఈ జీవో నాడు బాబు కేబినెట్ ఆమోదం పొందలేదు. అలాగే ఆర్థికశాఖ అనుమతి కూడా పొందలేదు.
ఈ నేపథ్యంలో 2019లో ఏపీలో అధికార మార్పిడి జరిగింది. ఆర్థిక అనుమతి లేకుండానే లక్షలాది రూపాయలను వేతనాలుగా పొందుతున్న విషయాన్ని ట్రెజర్ విభాగం కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో పది నెలల క్రితం 60 ఏళ్లు పైబడిన ఆయుష్ ఉద్యోగుల జీతాలను ప్రభుత్వం నిలిపివేసింది. మరోవైపు ఆ వైద్యులు కీలక హోదాల్లో…అంటే డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లగా కొనసాగుతూ పరిపాలనా పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటి నిర్ణయాలపై కొన్ని చోట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆయుష్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుకు సంబంధించి స్పష్టత కోరుతూ వైద్యారోగ్యశాఖ జగన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖపై ప్రభుత్వ పెద్దలు ఆరా తీస్తే దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. టీడీపీ హయాంలో మంత్రి కామినేని తనకు కావాల్సిన వాళ్ల ప్రయోజనాల కోసం మాత్రమే కేబినెట్ ఆమోదం లేకుండా జీవో జారీ చేశారని గుర్తించారు. అంతేకాకుండా ఆర్థికశాఖ ఆమోదం లేకుండా భారీ మొత్తాల్లో వేతనాలు ఇవ్వడాన్ని కూడా తీవ్రంగా పరిగణించారు.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 19న ఆయుష్ వైద్యుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకే కుదిస్తూ జగన్ సర్కార్ వైద్యా రోగ్యశాఖకు స్పష్టత ఇచ్చింది. ఈ ఫైల్ ఏప్రిల్ 28న వైద్యారోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్‌రెడ్డికి చేరింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో దానికి సంబంధించి పర్యవేక్షణ, నియంత్రణ బాధ్యతలను నిర్వర్తించడంలో జవహర్‌రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్న విషయంలో తెలిసిందే.
ఇదే సమయంలో ఓ కీలక ఫైల్ గురించి కూడా ఆయన నిర్ణయం తీసుకోవాల్సిన విషయాన్ని మరిచి పోయినట్టున్నారు. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడంలో జవహర్‌రెడ్డికి ఊగిసలాట ఎందుకనే ప్రశ్నలు, అనుమానాలు.
ఈ ఫైల్‌పై జవహర్‌రెడ్డి సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఒక ఇల్లీగల్ జీవోకు చెక్ పెట్టినట్టవుతుంది. అలాగే పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా జగన్ ఆయుష్ ఉద్యోగులకు ఇచ్చిన హామీ విషయమై దృష్టి పెట్టేందుకు మార్గం సుగమం చేసినట్టవుతుంది. ఆయుష్ వైద్యుల పదవీ విరమణ వయస్సును 60కి తగ్గిస్తామని, అలాగే సంబంధిత శాఖ ఉద్యోగులకు ప్రమోషన్స్ కల్పిస్తామని, కొత్త రిక్రూట్‌మెంట్ చేపట్టి ఆయుష్ నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు. ఈ విషయంలో జగన్ తన హామీలను అమలు చేస్తే ఆయుష్ వైద్యంలో కొత్త రక్తాన్ని నింపినట్టవుతుంది. అలాగే ప్రజలకు కూడా మెరుగైన సేవలు అందించే అవకాశం దక్కుతుంది.
తన హామీలను నెరవేర్చాలంటే జగన్ సర్కార్ లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నతాధికారులు పనిచేసినప్పుడే జగన్ సర్కార్ ప్రజల మెప్పు పొందుతుంది. ఇప్పటికైనా ఆయుష్‌ను పట్టి పీడిస్తున్న రోగగ్రస్త నిర్ణయాలకు వైద్యం చేయాల్సిన సమయం ఆసన్నమైంది.