మనుషుల బలహీనతలతో ఆడుకోవడంలో పండిపోయాడు రామ్ గోపాల్ వర్మ. కాంట్రవర్సీ కథలు తీసుకోవడం, ఓ సినిమా చుట్టేయడం, దాన్ని “ఆర్జీవీ వరల్డ్ థియేటర్”లో అమ్ముకోవడం ఈమధ్య బాగా నేర్చాడు ఈ దర్శకుడు. ఇప్పుడు వర్మ క్రియేటివిటీ పీక్స్ కు చేరింది. డబ్బులు వస్తున్నాయి కదా అని ట్రయిలర్ కు కూడా రేట్ ఫిక్స్ చేశాడు.
అవును.. తను తీస్తున్న “పవర్ స్టార్” అనే సినిమా ట్రయిలర్ చూడాలంటే తన థియేటర్ లోకి వచ్చి 25 రూపాయలు కట్టి చూడాల్సిందే అంటున్నాడు వర్మ. ఇక్కడ కూడా జనాలు మళ్లీ అయోమయానికి గురవుతారేమో అని మరింత క్లారిటీ ఇస్తున్నాడు.
25 రూపాయలు ఛార్జ్ చేస్తోంది కేవలం ట్రయిలర్ చూడ్డానికి మాత్రమే అని నొక్కి వక్కాణిస్తున్నాడు ఆర్జీవీ. సినిమా చూడ్డానికి మళ్లా సెపరేట్ రేటు ఫిక్స్ చేస్తానని చెబుతున్నాడు. ట్రయిలర్ చూడ్డానికి అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేశాడు. 22వ తేదీన 11 గంటలకు ట్రయిలర్ రిలీజ్ అవుతుంది.
ట్రయిలర్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆ క్షణం నుంచి ఫుల్ మూవీ చూడ్డానికి అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేయబోతున్నాడు వర్మ. ఇక్కడ కూడా చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. పవర్ స్టార్ సినిమా చూడ్డానికి అడ్వాన్స్ గా బుకింగ్ చేసుకుంటే టిక్కెట్ ధర 150 రూపాయలు (జీఎస్టీ అదనం). అదే మూవీ రిలీజ్ అయిన తర్వాత చూడాలనుకుంటే మాత్రం టిక్కెట్ రేటు 250 రూపాయలు. 25న 11 గంటలకు సినిమాను రిలీజ్ చేయబోతున్నాడు.
చూశారుగా.. తను తీసే సినిమాలతో డబ్బులు ఎలా సంపాదించాలో వర్మకు బాగా తెలుసు. ఆ ట్రాప్ లో పడాలా వద్దా అనేది మన నిర్ణయం. ఎందుకంటే నగ్నం సినిమాతో చాలామందికి విషయం అర్థమైపోయింది. 22 నిమిషాల షార్ట్ ఫిలిం తీసి దానికి సినిమా అని పేరుపెట్టి బాగా సొమ్ము చేసుకున్నాడు ఈ దర్శకుడు.
ఇక “పవర్ స్టార్” ను 30-40 నిమిషాల్లో చుట్టేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సినిమా రన్ టైమ్ ఎంతైనా వర్మ సినిమాలు పైసా వసూల్ అనిపించుకున్న దాఖలాలు ఈమధ్యకాలంలో లేవు.