రాజధాని అమరావతిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అస్త్ర సన్యాసం చేశారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. పరిపాలన వికేంద్రీకరణ-ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు-2020, సీఆర్‌డీఏ చట్టం-2014 రద్దు బిల్లులు శనివారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెంతకు చేరాయి.
ఈ నేపథ్యంలో ఈ బిల్లులకు సంబంధించి చంద్రబాబునాయుడు నోరు తెరిచి మాట్లాడిన పాపాన పోలేదు. అలాగే కనీసం ట్విటర్‌లో కూడా ఆయన స్పందించలేదు. కేవలం టీడీపీ తరపున మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాత్రమే గవర్నర్‌కు లేఖ రాశాడు. అలాగే నిన్న విజయవాడలో ఈ బిల్లులపై మీడియాతో మాట్లాడాడు.
రాజధానిపై చంద్రబాబుది వ్యూహాత్మక మౌనమా? లేక అసమర్థత? అనేది తెలియక టీడీపీ శ్రేణులు డోలాయమానంలో పడ్డాయి. రాజధాని మార్పును ఎలాగూ తాము అడ్డుకోలేమనే గట్టి నిర్ణయానికి రావడం వల్లే చంద్రబాబు మౌనం పాటించారనే వాదన వినవస్తోంది. రాజధానిపై దూకుడుగా వెళితే ఇటూ ఉత్తరాంధ్రలోనూ, అటు రాయలసీమలోనూ రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తింటామనే భయం చంద్రబాబును వెనుకంజ వేసేలా చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గత రెండు రోజులుగా చంద్రబాబు చేస్తున్న ట్వీట్లను పరిశీలిస్తే మనకు క్లారిటీ వస్తుంది. తమిళనాడులో పట్టుబడిన డబ్బుపై చంద్రబాబు, లోకేశ్ సహా మాజీ మంత్రులు స్పందిస్తున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. ఒంగోలుకు చెందిన సందీప్ అనే యువకుడు సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టాడనే కారణంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ యువకుడి కేసుపై ఉన్న శ్రద్ధ…రాజధాని తరలింపుపై అబ్బాకొడుకులకు లేకపోవడం ఆశ్చర్యమే.
గవర్నర్ బిశ్వభూషణ్‌కు చంద్రబాబు శనివారం లేఖ రాశారు. ఆ లేఖలో సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లపై అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రజలకు కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వం హరిస్తోందని ఫిర్యాదు చేశారు. జోక్యం చేసుకుని దాడులను నిలువరించాలని ఆయన కోరారు. అలాగే అంతకు ముందు రోజు శుక్రవారం ఇదే అంశంపై బాబు ట్వీట్ చేశారు.
“పోలీసులను వాడుకుని సామాజిక మాధ్యమ కార్యకర్తలపై దాడి చేయించడం వల్ల మీ అవినీతి, మాఫియా కథలకు మరింత ప్రచారం రావడం తప్ప …మీకు ఎలాంటి లాభం దక్కదు జగన్. మంత్రి బాలినేనికి చెందిన రూ.5.27 కోట్ల హవాలా సొమ్ము ఏపీ పోలీసులకు దొరక కుండా ఎలా బయటికి వెళ్లిందని సందీప్ ప్రశ్నించాడు. సందీప్ హక్కులకు భంగం కలిగించిన వారిపై మేం కోర్టుకు, మానవహక్కుల కమిషన్‌కు వెళుతాం” అని బాబు ట్వీట్ చేశారు.
మరి అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు గవర్నర్‌కు వెళుతుందని తెలిసినా, ఆ తర్వాత వెళ్లడాన్ని చూసినా చంద్రబాబు మౌనం వహించడం వెనుక లోగుట్టు ఏంటనేది మరీ ముఖ్యంగా రాజధాని రైతులకు ఏమీ అర్థం కావడం లేదు. సందీప్ అనే యువకుడికి ఇచ్చిన ప్రాధాన్యతలో పదో వంతు కూడా రాజధాని బిల్లులకు బాబు ఎందుకివ్వడం లేదు? ఇక్కడే అసలు మతలబు దాగి ఉంది.
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిని ముందు పెట్టడం ద్వారా తన ప్రచార సాధనాలతో రాజధానిపై టీడీపీ వాయిస్ వినిపించినట్టు అవుతుంది. ఇదే సందర్భంలో ప్రజల్లో యనమలకు ఉన్న పలుకుబడి గురించి జనం కంటే చంద్రబాబుకే బాగా తెలుసు. ఎటూ అడ్డుకోలేమని నిర్ణయానికి రావడం వల్లే చంద్రబాబు రాజధాని అంశాన్ని లైట్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఒకవేళ ఏ మాత్రం పైచేయి సాధిస్తామనే నమ్మకం ఉన్నా చంద్రబాబు ఎంత మాత్రం వదిలి పెట్టేవారు కాదని ఆయన రాజకీయా లను మొదటి నుంచి దగ్గరగా చూస్తున్న వాళ్లు చెబుతున్నారు. మొత్తానికి రాజధాని కోసం విరాళాల సేకరణ, కోర్టు కేసులు అన్నీ తాత్కాలికమే అని బాబుకు అనుభవం గుణపాఠం నేర్పినట్టుంది.