ఇప్పటికే రక్తచరిత్ర సినిమా తీశాడు రామ్ గోపాల్ వర్మ. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఆ సినిమా వచ్చింది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మరో రక్తచరిత్ర తీయబోతున్నట్టు ప్రకటించాడు ఈ దర్శకుడు.
“నా తదుపరి చిత్రం పేరు కొండా. 90ల్లో తెలంగాణలో నక్సల్ ఉద్యమం జోరుగా సాగుతన్న నేపథ్యంలో.. మావోయిస్ట్ ఆర్కే, కొండా మురళి మధ్య ఉన్న సంబంధాల్ని నా సినిమాలో చూపిస్తాను. కొండా సురేఖ, కొండా మురళి మధ్య అల్లుకున్న బంధాన్ని కూడా చూపించబోతున్నాను.”
ఈమధ్య కొంతమంది మాజీ నక్సలైట్లు, మాజీ పోలీస్ అధికారుల్ని కలిశానని.. వాళ్ల ద్వారా తొలిసారి తెలంగాణ నక్సల్ ఉద్యమం మీద ఓ అవగాహన వచ్చిందని అంటున్నాడు ఆర్జీవీ. మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే, కొండా మురళి మధ్య ఉన్న మహా ప్రత్యేకమైన అనుబంధం తనను బాగా ఎట్రాక్ట్ చేసిందని.. ఆ విషయాన్నే ఎక్కువగా 'కొండా'లో చూపిస్తానంటున్నాడు వర్మ.
ఈసారి కాస్త ముందుగానే వివాదాల్ని తగ్గించే ప్రయత్నం చేశాడు వర్మ. 'కొండా' సినిమాకు సంబంధించి మురళి అనుమతి తీసుకున్నానని స్పష్టంచేశాడు. విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారనే అంశాన్ని 'కొండా' సినిమాలో చూస్తారంటున్నాడు వర్మ.
వర్మ ఎప్పుడు ఏ సినిమా తీస్తాడో ఎవ్వరికీ తెలీదు. నిజానికి ఆ విషయం వర్మకు కూడా తెలీదు. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు ప్రకటించి పక్కనపెట్టాడు ఆర్జీవీ. అయితే 'కొండా' సినిమా మాత్రం వెంటనే వస్తుందంటున్నాడు ఈ దర్శకుడు.