ప్రసిద్ధ విప్లవకవి వరవరరావు విడుదలకు సహకరించాలని కోరుతూ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి శనివారం లేఖ రాశారు. ఆ లేఖలో ముషీరాబాద్ జైల్లో ఎమర్జెన్సీ బాధితులుగా వరవరరావుతో తాము కలిసి ఉన్న విషయాన్ని ఉపరాష్ట్రపతికి కరుణాకర్‌రెడ్డి గుర్తు చేశారు. ఆ లేఖలోని కొన్ని ముఖ్యాంశాలు.
గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి హృదయ పూర్వక వినమ్ర నమస్సులు. ఓ వృద్ధ శల్య శరీరుని ప్రాణం కాపాడ్డానికి స్పందించాలని సంస్కారులు, మహోన్నత మానవీయ విలువలున్న మిమ్మల్ని సహృదయంతో అర్థిస్తున్నాను. వరవరరావు గారి నిర్బంధం, అనారోగ్యం గురించి మీకు తెలిసే వుంటుంది. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఆయన బందీగా ఉన్నారంటే హృదయం చెమ్మగిల్లుతోంది.
48 సంవత్సరాల క్రితం నాలో రాజకీయ ఆలోచనల అంకుర్భావ దశలో నాకు లభించిన ఎందరో గురువులలో ఆయనా ఒకరు. 46 సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీ బాధితులుగా మీరు, నేను 21 నెలలు ముషీరాబాద్ జైల్లో ఉన్నప్పుడు ఆయన మన సహచరుడు. సాహచర్య భావజాలంలో కాదు కానీ, కటకటాల వెనుక కలిసి ఉన్నాం, అందుకు. రాజకీయ సిద్ధాంతాల్లోనూ, జన క్షేమంకై నడిచే మార్గాల్లోనూ ఎవరి భావాలు వారివే. కానీ మనం మనుషులం.
శరీరం మంచానికి కట్టుబడే 81 సంవత్సరాల వయస్సులో, అందులోనూ అనారోగ్యంతో వున్న ఆయనపైన ప్రభుత్వం దయ చూపాల్సిన అవసరం ఎంతో ఉంది. అహింసయే పరమ ధర్మం. శత్రువును సైతం క్షమించాలి. వేదాంత వారసత్వ భారతదేశపు ఉపరాష్ట్రపతి అయిన మీరు వరవరరావు విడుదల విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని సజలనయనాలతో విన్నవించుకుంటున్నానని భూమన కరుణాకర్‌రెడ్డి ద్రవించే హృదయంతో తన ఆవేదనను అక్షరీకరించారు.