మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు శనివారం ప్రారంభమైంది. దర్యాప్తులో భాగంగా మొట్ట మొదటిసారి సీబీఐ అధికారులు కడపలో అడుగు పెట్టారు. దీంతో హంతకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తే అవకాశాలున్నాయి. సీబీఐ అధికారులు కడప ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఎస్పీ అన్బురాజన్‌తో పాటు సిట్ అధికారులతో సమావేశమై కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారని తెలిసింది.
గత ఏడాది మార్చి 15న వివేకా పులివెందులలో తన ఇంట్లో హత్యకు గురయ్యాడు. వివేకా మృతిపై మొదట్లో అనేక రకాల ప్రచారాలు జరిగాయి. మొదట గుండె పోటుతో చనిపోయాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రెండు మూడు గంటల తర్వాత ఆయన్ను హత్య చేశారని వార్తలు వెలువడ్డాయి. సరిగ్గా ఎన్నికలకు నెల రోజుల ముందు జరిగిన ఈ హత్య రాజకీయంగా అత్యంత దుమారం రేపింది.
వైఎస్ వివేకా హత్యకు ముందురోజు జమ్మలమడుగులో ప్రచారం చేసి రావడంతో ప్రధాన ప్రత్యర్థి ఆదినారాయణరెడ్డిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడితో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు స్వయాన చిన్నాన్న కావడంతో కేసు రాజకీయ రంగు పులుముకొంది.
చిన్నాన్న మృతదేహాన్ని సందర్శించిన వైఎస్ జగన్ టీడీపీపై తీవ్ర ఆరోపణలు గుప్పించాడు. రాష్ట్ర పోలీస్ అధికారుల దర్యాప్తుపై నమ్మకం లేదని, కేంద్ర సంస్థలతో విచారణ చేపట్టాలని జగన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అలాగే వివేకా హత్యకు సంబంధించి సీబీఐ దర్యాప్తు కోరుతూ తన చిన్నాన్న కుటుంబంతో పాటు తాను కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. కానీ తన చిన్నాన్న కేసు మిస్టరీని ఛేదించలేకపోయాడు. మరోవైపు ఈ కేసులో వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు మరికొందరిపై అనుమానం వ్యక్తం చేస్తూ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం విశేషం.
ఇదే సందర్భంలో సీబీఐ దర్యాప్తు వద్దని జగన్ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడం సంచలనం రేకెత్తించింది. ఈ కేసుకు సంబంధించి అనేక వాదప్రతివాదనలు విన్న తర్వాత హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో సీబీఐ విచారణ చేపట్టలేదు. కానీ అన్‌లాక్ నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగింది. ఇక ఈ కేసు మిస్టరీని సీబీఐ అయినా ఛేదిస్తుందో లేదో కాలమే సమాధానం ఇవ్వాల్సి ఉంది.