రాజధాని అమరావతిపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దింపుడు కళ్లెం ఆశలు పెట్టుకొంది. దింపుడు కళ్లెం అంటే మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లే మార్గం మధ్యలో దించి…చెవిలో గట్టిగా పిలుస్తారు. అలాగే నోట్లో నీళ్లు పోస్తారు. ప్రాణం పోయిన మనిషి తిరిగి రారని తెలిసి కూడా ఇవన్నీ చేయడం ఎందుకంటే …తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. శ్మశాన వాటికకు సమీపంలో ఉన్నప్పటికీ…మనిషి బతికి వస్తాడనే ఆశ అలా చేయిస్తుంది.
ప్రస్తుతం రాజధాని అమరావతి విషయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీది కూడా దింపుడు కళ్లెం ఆశ అని చెప్పొచ్చు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెంతకు నేడు సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులు వెళుతాయని తెలిసి టీడీపీలో భయం పట్టుకొంది. దీంతో శాసన వ్యవస్థ చట్టాలపై అవగాహన ఉన్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిని టీడీపీ రంగంలోకి దింపింది. రెండురోజులుగా ఆయన గవర్నర్ అడగకుండానే సలహాలిస్తున్నాడు. తాను చెప్పినట్టు చేయకపోతే చోటు చేసుకునే పరిణామాలపై కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు.
టీడీపీ హెచ్చరికలు, బెదిరింపుల మధ్య శనివారం ‘సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు’లను గవర్నర్ ఆమోదానికి ఏపీ ప్రభుత్వం శనివారం పంపింది. శాసనమండలిలో రెండోసారి పెట్టి నెల రోజులు గడిచినందున నిబంధనల ప్రకారం అసెంబ్లీ అధికా రులు గవర్నర్‌కు పంపారు.
గవర్నర్‌కు యనమల రామకృష్ణుడు శుక్రవారం లేఖ రాయడంతో పాటు శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడాడు. తన తెలివి తేటలను ప్రజల్ని, తన పార్టీని భ్రమల్లో ముంచేందుకు యత్నిస్తున్నాడనే విమర్శలున్నాయి. రాజధాని ఏర్పాటు అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని చెప్పుకొచ్చాడు. పునర్విభజన చట్టంలో కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల మేరకు రాజధాని ఏర్పాటు కావాలని ఉందన్నాడు. అందుకు అనుగుణంగానే శివరామకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం తమ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంచుకుందన్నాడు.
రాజధాని అంశం కేంద్రం పరిధిలోని అంశమైతే తన ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఏ విధంగా ఏర్పాటు చేసిందో యనమల రామకృష్ణుడు సమాధానం చెప్పాలి. అలాగే శివరామకృష్ణ కమిటీ అమరావతి పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు ఏ మాత్రం మంచిది కాదని తేల్చి చెప్పింది. శివరామకృష్ణ కమిటీ తమ ఆలోచనలకు తగ్గట్టు నివేదిక ఇవ్వదనే భయంతోనే నాటి మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో వ్యాపారులతో రాజధాని ఎంపిక కమిటీ వేసిన విషయాన్ని యనమల రామకృష్ణుడు మరిచిపోయినట్టున్నాడు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 197 క్లాజ్ 2 ప్రకారం రెండోసారి బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మండలిలో పెట్టిన నెల రోజుల తర్వాత ఆటోమెటిక్‌గా ఆమోదించినట్టుగా పరిగణించారు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం గవర్నర్ ఆమోదం కోసం రెండు బిల్లులను అసెంబ్లీ అధికారులు పంపారు. రెండు మూడు రోజుల్లో గవర్నర్ ఆమోద ముద్ర పడడం, ఆ తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖకు తరలి వెళ్లడం వేగవంతమవుతాయి.
అసలు వాస్తవం ఇది. కానీ రాష్ట్ర విభజన సమయంలో ఇలాంటి పొంతన లేని చట్టాలు, న్యాయ సూత్రాలు చెబుతూ ప్రజల్ని మోసం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మూడు రాజధానుల ప్రక్రియలో కూడా టీడీపీ అదే రకమైన మోసానికి పాల్పడుతోంది. దానికి యనమల రామకృష్ణుడి ధర్మోపన్యాసాలే నిదర్శనం.