రాయలసీమలో మరో రెండు చిన్నస్థాయి రిజర్వాయర్ల నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంత వాసులను మురిపిస్తున్నారు. జగన్ నిర్ణయంపై ఆనందం వ్యక్తం అవుతోంది రాయలసీమ మేధావివర్గం నుంచి. ఇటీవలే రాయలసీమ ప్రాంతంలో రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి జగన్ మోహన్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణలో భాగంగా రాజోలి వద్ద ఒక రిజర్వాయర్‌తో పాటు, తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణకు కుందూనది మీద ఒక ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ ఏడాదిలోనే ఈ పథకాలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి భావిస్తూ ఉండటం గమనార్హం. అందుకు అధికారుల చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే కలెక్టర్లు ఆయా ప్రాంతాలను ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి సందర్శిస్తూ ఉన్నారు. నిర్మాణ ప్రాంత ప్రతిపాదిత ప్రాంతాలను పరిశీలిస్తూ ఉన్నారు.
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో రాయలసీమ ప్రాంత ఉద్యమకారులు ఈ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్టులతో తమ దాహార్తి తీరే అవకాశం ఉందని వివరించారు. ఈ ప్రాజెక్టుల్లో ఒకటి దాదాపు మూడు టీఎంసీల స్థాయిది, మరోటి ఐదు టీఎంసీల స్థాయి రిజర్వాయర్ అని తెలుస్తోంది. వీటివల్ల కరవుసీమలో మరికొన్ని నియోజకవర్గాల పరిధిలోని సాగు, తాగునీటి అవసరాలు పుష్కలంగా తీరే అవకాశాలున్నాయి.
ఈ రెండు రిజర్వాయర్ల మొత్తం వ్యయం దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. రాయలసీమకు గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సాగునీటి ప్రాజెక్టులు పరుగులెత్తాయి. వైఎస్ తర్వాత సీమకు ఏదైనా చేయాలంటే అది జగన్ మాత్రమే అని స్పష్టం అవుతోంది ఆ ప్రాంత వ్యక్తులు తమ అభిప్రాయాలను సూటిగా స్పష్టంగా చెబుతున్నారు.