బ్యాడ్ టైమ్.. అసలు టీడీపీలో ఏం జరుగుతోంది!

మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది తెలుగుదేశం. అప్పుడే ఆ పార్టీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందని అనుకున్నారంతా. కానీ అంతకంటే గడ్డు పరిస్థితుల్ని చవిచూస్తోంది టీడీపీ. ఓడిపోవడం మాట అటుంచి, వరుసగా ముఖ్యనేతల్ని…

మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది తెలుగుదేశం. అప్పుడే ఆ పార్టీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందని అనుకున్నారంతా. కానీ అంతకంటే గడ్డు పరిస్థితుల్ని చవిచూస్తోంది టీడీపీ. ఓడిపోవడం మాట అటుంచి, వరుసగా ముఖ్యనేతల్ని కోల్పోతోంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీని బాగా కుంగదీస్తున్న విషయం ఇది.

మొన్నటికిమొన్న కోడెల శివప్రసాదరావు రూపంలో ఓ ముఖ్యనేతను కోల్పోయింది టీడీపీ. పల్నాడులో టీడీపీకి అత్యంత కీలకమైన నేత అతడు. పార్టీ ఇంకా ఆ దుఃఖంలో ఉంటుండగానే మరో శివప్రసాద్ ను కోల్పోయింది. చిత్తూరు జిల్లాకు చెందిన కీలకమైన నేత ఈయన. ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచారు. క్రియాశీలక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే శివప్రసాద్ లాంటి వ్యక్తిని ఆ పార్టీ కోల్పోయింది.

కోడెల, శివప్రసాద్ మాత్రమేకాదు.. గడిచిన రెండేళ్లలో ఇలా పలువురు కీలక నేతల్ని కోల్పోయింది ఆ పార్టీ. గాలి ముద్దుకృష్ణమనాయుడు, హరికృష్ణ, భూమా నాగిరెడ్డి (వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరారు) లాంటి నేతల్ని తెలుగుదేశం పార్టీ కోల్పోయింది. వీళ్లలో హరికృష్ణ మినహా మిగతా నేతలంతా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నవాళ్లే. టీడీపీకి గట్టి నేతలుగా కొనసాగిన వాళ్లే.

ఓవైపు ఇలా కీలక నేతల్ని కోల్పోతున్న టీడీపీని మరోవైపు వలసలు కూడా భయపెడుతున్నాయి. ఇప్పటికే రాజ్యసభలో టీడీపీ కనుమరుగైంది. టీడీపీ రాజ్యసభాపక్షం బీజేపీలో విలీనం అయింది. బాబు దేశంలో లేని టైమ్ చూసి సీఎం రమేష్, సుజానా చౌదరి, టీజీ వెంకటేష్ జెండా మార్చేశారు. వీళ్ల బాటలోనే మరో రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహనరావు కూడా బీజేపీలో చేరిపోయారు.

ఇటు రాష్ట్రం నుంచి బీజేపీ వైపు చూస్తున్న నేతల సంఖ్య ఎక్కువైంది. వైసీపీలో తలుపులు మూసుకుపోవడంతో ఇప్పుడంతా బీజేపీనే ఆశ్రయిస్తున్నారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇప్పటికే  తన పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఆయన వియ్యంకుడు నారాయణపై ప్రస్తుతం జోరుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

గత ఎన్నికల్లో నెల్లూరు టౌన్ నుంచి ఓడిపోయిన ఆయన ఏ నిమిషానైనా కాషాయం కండువా కప్పుకుంటారని ప్రచారం నడుస్తోంది. ఇలా ఇటు మరణాలు, అటు వలసలతో కీలక నేతల్ని కోల్పోతోంది తెలుగుదేశం పార్టీ.

వ్యాపారం కోసం ప్రమాణాలకు తిలోదకాలు