కరువుతీరా వానలు.. పాత రికార్డులు బద్ధలు!

రాయలసీమ ప్రాంతంలో రికార్డుస్థాయి వర్షపాతాలు నమోదు అవుతూ ఉన్నాయి. గతవారం రోజుల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదు అయ్యింది. కొన్నిచోట్ల అయితే.. గత కొన్ని దశాబ్దాల్లో చూడని వానలు పడ్డాయని స్థానికులు చెబుతూ ఉన్నారు.…

రాయలసీమ ప్రాంతంలో రికార్డుస్థాయి వర్షపాతాలు నమోదు అవుతూ ఉన్నాయి. గతవారం రోజుల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదు అయ్యింది. కొన్నిచోట్ల అయితే.. గత కొన్ని దశాబ్దాల్లో చూడని వానలు పడ్డాయని స్థానికులు చెబుతూ ఉన్నారు. వానపడితే చాలనుకునే చోట్లలో వరదలు వచ్చినంత పరిస్థితి నెలకొందంటే.. వర్షపాతం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రత్యేకించి కర్నూలు జిల్లాలో వర్షపాతం రికార్డు స్థాయికి చేరింది. పదేళ్ల కిందట కర్నూలు వరదలను ఎదుర్కొంది. అవి జననష్టాన్ని కలిగించిన వరదలు. ఇప్పుడు వాగులు, వంకలు ఏకం అయ్యేలాంటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కర్నూలు భారీ వర్షపాతాన్ని చవి చూస్తుండగా, ఆ తర్వాత కడపజిల్లా వర్షాలతో తడిసి ముద్దైంది. కడపజిల్లాలో కూడా గత కొన్ని దశాబ్దాల్లో ఎప్పుడూ నమోదు కాని వర్షం నమోదు అయ్యింది కొన్నిచోట్ల. మిగతాచోట్ల కూడా పుష్కలమైన వానలు కురిశాయి.

ఆరంభంలో కొంత మొరాయించినా.. ఆ తర్వాత మాత్రం రాయలసీమ ఈ సంవత్సరం పుష్కలమైన వర్షపాతం పొందుతోంది. ఇక అనంతపురంలో కూడా మంచి స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యింది. ఈ వర్షాలతో ఖరీఫ్‌ పంటలకు ఎంతో మేలు జరిగే అవకాశాలున్నాయి. వేరుశనగ పంటకు ఈ వర్షాలు మేలు చేస్తున్నాయి. మధ్యలో విరామాలు ఇచ్చినా.. ఏదో ఒకదశలో మంచి వర్షాలు కురిసినా వేరుశనగ పంట రైతుకు దక్కే అవకాశాలుంటాయి. దీంతో ఈ వర్షాలు ఖరీఫ్‌ పంటకు మేలు చేస్తున్నట్టే.

ఇక తరీ భూములకు ఈ వర్షాలు మరింత మేలు చేయనున్నాయి. భారీ వర్షాల పుణ్యమా అని భూగర్భజలం పెరిగే అవకాశాలున్నాయి. ఇది రైతులకు ఆనందం కలిగిస్తున్న అంశం. ఇక శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కూడా ఈసారి నీటి లభ్యత చాలావరకూ పెరిగింది. రెండుసార్లు వరద రావడంతో, వరద నీటిని అదనంగా రాయలసీమకు వదులుకునే అవకాశాలు ఏర్పడ్డాయి.

ఇప్పటికే కృష్ణాజలాలు.. అనంతపురం జిల్లాను దాటుకుని చిత్తూరును చేరుకుంటున్నాయి. ఏతావాతా గత పదేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ఈసారి నీటి లభ్యత కనిపిస్తూ ఉంది. ఇదంతా జగన్‌ మోహన్‌రెడ్డి సీఎం పీఠం ఎక్కిన వేళావిశేషం అని కూడా సీమ ప్రజలు అనుకుంటుండటం గమనార్హం.

వ్యాపారం కోసం ప్రమాణాలకు తిలోదకాలు