తన సినీ తల్లిని మోహన్‌బాబు కుమారుడు మంచు మనోజ్ స్మరించుకుంటూ చేసిన ట్వీట్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. 16 ఏళ్ల క్రితం దుర్మరణం పాలైన సౌందర్య గురించి కొత్త తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. అలాంటిది ఆమెను మంచు మనోజ్ గుర్తు చేయడం సౌందర్య అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది.
మోహన్‌బాబు, సౌందర్య జంటగా నటించిన చిత్రాలు మంచి హిట్ సాధించాయి. శ్రీరాములయ్య, పెదరాయుడు , పోస్ట్‌మ్యాన్, శివశంకర్ తదితర చిత్రాల్లో మోహన్‌బాబు, సౌందర్య జంటగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. 2004లో ఓ విమాన దుర్ఘటనలో టాలీవుడ్ ఆరాధ్య హీరోయిన్ సౌందర్య ప్రాణాలు కోల్పోయారు. నేడు ఆమె జయంతి.
సౌందర్య సరసన టాలీవుడ్ అగ్రనటులంతా నటించారు. కానీ ఏ ఒక్కరికీ ఆమె జయంతిని గుర్తు లేదు. అలాంటిది మోహన్‌బాబు తనయుడు మంచు మనోజ్ గుర్తు పెట్టుకోవడమే కాకుండా సినీ అమ్మా అంటూ వాత్సల్యాన్ని కనబరిచాడు. సౌందర్యకు ట్విటర్ వేదికగా మంచు మనోజ్ నివాళులర్పించాడు. ఆ ట్వీట్ ఏంటంటే…
‘సౌందర్యగారి జయంతి సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటున్నాను. మీరు అద్భుతమైన నటి, గొప్ప వ్యక్తిత్వం గల మనిషి. మిమ్మల్ని మిస్ అవుతున్నా సినీ అమ్మా. మీరు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి’ అని మంచు మనోజ్ ట్వీట్ చేశాడు. తన తండ్రి సరసన ఎక్కువ చిత్రాల్లో నటించిన సౌందర్యలో మంచు మనోజ్ తల్లిని చూసుకున్నాడు.