ఫిదా సినిమాతో హీరోయిన్ సాయిపల్లవి పాపులర్ అయ్యారు. ఈ ఒక్క సినిమా టాలీవుడ్ ప్రేక్షకులకి సాయిపల్లవిని చాలా దగ్గర చేసింది. ఇటీవల కాలంలో ఇంత త్వరగా గుర్తింపు పొందిన హీరోయిన్ మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. బుగ్గపై బొట్టు పెట్టినట్టు ఓ మచ్చ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సాయిపల్లవి తాజా ఇంటర్వ్యూలో నటనతో పాటు తన క్యారెక్టర్ గురించి ఈ చిన్నది పెద్దపెద్ద కబుర్లే చెప్పారు. సెలబ్రిటీ స్టేటస్ రావడంతో ఆమె చెప్పే ప్రతి సంగతి కూడా ఆసక్తికరమే. నటనకు ఇంపార్టెన్స్ ఇస్తానని, కమర్షియల్ పాత్రలకు దూరంగా ఉంటానని ఆమె స్పష్టం చేశారు.
ఇంకా తన ఆశయాలు, ఇష్టాయిష్టాల గురించి అమాయకంగా చెప్పుకొచ్చారామె. ఇప్పటికప్పుడు తానో పెద్ద హీరోయిన్ అనిపించుకోవాలనే కోరిక ఏ మాత్రం లేదన్నారు. ఇప్పటి వరకు చేసిన సినిమాలు తనకెంతో సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చాయన్నారు.
మొట్టమొదట తన దగ్గరకు వచ్చే కథలను ఒకటికి రెండుసార్లు స్టడీ చేస్తానన్నారు. ఆ కథలు తాను పెట్టుకున్న నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? అని పరిశీలిస్తానన్నారు. అసలు తనను ప్రేక్షకులు ఓ పెద్ద హీరోయిన్‌గా అసలు చూడరని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ప్రేక్షకులు తమ ఇంటి అమ్మాయిగా అభిమానంగా చూస్తారని సాయిపల్లవి చెప్పారు. అందుకే చిట్టిపొట్టి డ్రెస్సుల్లో తనను చూడడానికి ప్రేక్షకులు ఇబ్బంది పడుతారన్నారు. ప్రేక్షకుల కోణంలో ఆలోచించడం వల్లే అలాంటి డ్రెస్సులు వేసుకోవడం తనకు కూడా అసౌకర్యంగా ఉంటుందని సాయిపల్లవి చెప్పుకొచ్చారు. ప్రేక్షకుల కేంద్రంగా కబుర్లు చెబుతున్న సాయిపల్లవి మాటలకు ఎవరైనా ఫిదా కావాల్సిందే మరి!