సీమలో ఎన్నికల సందడి షురూ..!

రాయలసీమ ప్రాంతంలో నేతల చూపు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల మీదపడింది. ఈ ఏడాది ఆఖర్లోనే స్థానిక ఎన్నికలు ఉంటాయని ప్రభుత్వంలోని ముఖ్యులు స్పష్టంచేస్తూ ఉన్నారు. ముందుగా మున్సిపోల్స్‌ ఉంటాయని, ఆపై ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని…

రాయలసీమ ప్రాంతంలో నేతల చూపు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల మీదపడింది. ఈ ఏడాది ఆఖర్లోనే స్థానిక ఎన్నికలు ఉంటాయని ప్రభుత్వంలోని ముఖ్యులు స్పష్టంచేస్తూ ఉన్నారు. ముందుగా మున్సిపోల్స్‌ ఉంటాయని, ఆపై ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని తెలుస్తోంది. అలాగే పంచాయతీ ఎన్నికలు ఎలాగూ పెండింగ్‌లో ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా ఉండబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేతలు అప్పుడే అలర్ట్‌ అవుతూ ఉన్నారు.

అందులో భాగంగా ముఖ్యంగా అధికార పార్టీ నేతలు వార్డుల బాట, డివిజన్ల బాటపడుతూ ఉన్నారు. ఈ హడావుడి చాలా నియోజకవర్గాల్లోనే కనిపిస్తూ ఉంది. తిరుపతి కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి భూమాన కరుణాకర్‌ రెడ్డి, ఆయన తనయుడు అభినయ్‌ రెడ్డిలు డివిజన్ల బాటపడుతూ  ఉన్నారు. ఆయా డివిజన్లలో సమస్యలేమిటో స్థానికులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. మున్సిపాలిటీల్లోనూ, కార్పొరేషన్లలోనూ తమ పార్టీ జెండాలను పాతడం ఇప్పుడు అధికార పార్టీ నేతలకు లక్ష్యం అవుతూ ఉంది. ఎక్కడ తేడాకొట్టినా.. వారిపై పార్టీలోనూ, అధినేత వద్ద నెగిటివ్‌గా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్థానికల్లో ఎన్నికల్లో గెలుపును నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉన్నారు.

తిరుపతి కార్పొరేషన్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాపాతే విషయంలో భూమన ధీమా వ్యక్తంచేస్తూ ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల నాటి ఊపు ఇప్పుడు కూడా కొనసాగిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తంచేస్తూ ఉన్నారు. ఇక మున్సిపాలిటీల్లో కూడా ఎమ్మెల్యేలు ఇలాంటి లక్ష్యాలతోనే ముందుకుసాగుతూ ఉన్నారు. వార్డుల వారీగా, వీధుల వారీగా తిరుగుతూ ఉన్నారు. సమస్యలను చెప్పమని.. పరిష్కారాలకు కషి చేస్తామని వారు ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది.

అలాగే అభ్యర్థిత్వాల విషయంలో కూడా చర్చలు మొదలవుతున్నాయి. ఎక్కడ ఎవరు పాగా వేయాలనే అంశం గురించి వారు కసరత్తులు చేసుకుంటూ ఉన్నారు. ఎంపీటీపీ, జడ్పీటీసీ ఎన్నికల చర్చ కూడా మొదలైంది. ఇక పంచాయతీ ఎన్నికల విషయంలో అయితే అధికార పార్టీలోనే అప్పుడే పోటీ మొదలైంది. ఒక్కో పల్లెకు సంబంధించి రెండు మూడు గ్రూపులు ఉండనే ఉంటాయి. అలాంటి గ్రూపులు పంచాయతీ ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉన్నాయి. ఎవరికి వారు తమకే అవకాశం కావాలంటూ అప్పుడే ఎమ్మెల్యేల వద్ద ప్రతిపాదనలు పెడుతున్న దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం పంచాయతీ ప్రెసిడెంట్లకూ ఎలాంటి పవర్స్‌ లేవు, ఇక ఎంపీటీసీ-జడ్పీటీసీల పరిస్థితి అదే, మున్సిపాలిటీల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ఎప్పుడో కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో వీటన్నింటికీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఐదేళ్లు పూర్తి అయినా.. ఎన్నికలు మాత్రం వాయిదాపడుతూ పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సై అని జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఎవరికి ఏమిటి.. అనేది కూడా అధికార పార్టీ నేతల్లో ఇంకా గందరగోళం ఉంది. స్థానిక ఎన్నికలు సదరు నేతల సత్తాకు కూడా పరీక్షలు కాబోతూ ఉన్నాయి. అలాగే ద్వితీయశ్రేణి నాయకత్వం, గ్రామస్థాయిల్లోని కార్యకర్తలు కూడా ఇప్పుడు స్థానిక, పంచాయతీ సమరాలకు రెడీగా కనిపిస్తున్నారు.

ఇక తెలుగుదేశం పార్టీలో పరిస్థితి భిన్నంగా ఉంది. సీమలో తెలుగుదేశం పార్టీ పరువు నిలిచింది కేవలం మూడంటే మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు లేనిచోట స్థానిక ఎన్నికలను ఎదుర్కొనడం అంత ఈజీకాదు. అందులోనూ అధికారంలో ఉన్ననాడు వ్యవహరించిన తీరుతో నేతలపై ఇంకా వ్యతిరేకత కొనసాగుతూ ఉంది. దీంతో ఓడిపోయిన వారు ఇంకా ప్రజలకు మొహాలు చూపించుకోలేకపోతూ ఉన్నారు. మరికొందరు పక్కపార్టీల వైపు చూస్తూ ఉన్నారు. బీజేపీలో అవకాశం దొరుకుతుందా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేర్చుకుంటుందా.. అంటూ వారు పక్కచూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ఎలా ఎదుర్కొంటుంది.. అనేది చర్చనీయాంశంగా మారుతూ ఉంది.

వ్యాపారం కోసం ప్రమాణాలకు తిలోదకాలు