బిగ్ బాస్ కార్యక్రమం మొత్తం ఫేక్ అనేవాళ్లు ఉన్నారు. అదంతా స్క్రిప్టెడ్ అనే ప్రచారం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. అయితే ఈసారి నిర్వహకులే ఆ పనిచేశారు. అవును.. బిగ్ బాస్ లో తొలిసారిగా ఫేక్ ఎలిమినేషన్ జరిగింది. రాహుల్ ను ఎలిమినేట్ చేస్తున్నట్టు ప్రకటించాడు బిగ్ బాస్. ఆ తర్వాత అదంతా డ్రామా అని, రాహుల్ ఎలిమినేట్ అవ్వలేదని ప్రకటించాడు. దీంతో రాహుల్ ఊపిరి పీల్చుకున్నాడు. ప్రేక్షకులు వెర్రివెంగలప్పలయ్యారు.
తాజా ఎపిసోడ్ తో తొలిసారి ట్రోలింగ్ కు గురయ్యాడు హోస్ట్ నాగార్జున. ఇలాంటి పనులు చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారని నాగ్ ను ఓ రేంజ్ లో తిడుతున్నారు నెటిజన్లు. ప్రేక్షకుల ఎమోషన్స్ తో ఆడుకోవద్దని, వాళ్లను ఫూల్స్ ను చేయడం మానుకోవాలని కాస్త గట్టిగానే బిగ్ బాస్ నిర్వహకులపై పంచ్ లు పడుతున్నాయి. కాస్త హద్దులుదాటి బూతులు తిడుతున్న నెటిజన్లు కూడా ఉన్నారు.
నిజానికి ఇదంతా రేటింగ్ కోసమే అని బిగ్ బాస్ నిర్వహకులు భావిస్తూ ఉండొచ్చు. కానీ ఇలా ప్రేక్షకుల్ని పిచ్చోళ్లను చేసే కార్యక్రమాలు చేస్తే అది మొదటికే మోసం తీసుకొస్తుంది. ఇప్పటికే సాధారణ రోజుల్లో బిగ్ బాస్ సీజన్-3కి రేటింగ్స్ పడిపోయాయి. ఇలాంటి పనులతో వీకెండ్ లో కూడా రేటింగ్ పోగొట్టుకోవద్దంటూ బిగ్ బాస్ కు సూచన చేస్తున్నారు చాలామంది.
ఇక ఫేక్ ఎలిమినేషన్ విషయానికొస్తే.. రాహుల్ సిప్లిగంజ్ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించాడు నాగార్జున. దీంతో హౌజ్ లో ఏడుపులు మొదలయ్యాయి. రాహుల్ తో రాసుకుపూసుకు తిరిగే పునర్నవి అయితే ఒకటే ఏడుపు. అటు కాస్త గుంభనంగా ఉండే వరుణ్ సందేష్ కూడా ఏడుపు ఆపుకోలేకపోయాడు. అలా అందర్నీ ఏడిపించిన నాగార్జున, రాహుల్ నిజంగా ఎలిమినేట్ కాలేదని, ఇదంతా డ్రామా అని ప్రకటించి తుస్సుమనిపించాడు. రాహుల్ ను తిరిగి హౌజ్ లోకి పంపించి, శనివారం ఎపిసోడ్ ముగించాడు.
అయితే ఈవారం ఎలిమేషన్ ప్రక్రియ ఇంకా పూర్తవ్వలేదు. ఈసారి హిమజను బయటకు పంపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ ఎపిసోడ్ ఈరోజు రాత్రికి ప్రసారం అవుతుంది. ఇది మాత్రం ఫేక్ కాదు. నిజంగానే హిమజను బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ చేయబోతున్నారు. అలా రాహుల్ మరోసారి సేవ్ అయ్యాడన్నమాట.