గల్లీబాయ్.. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమా. 84 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 238 కోట్ల వసూళ్లు సాధించింది. అంతకుమించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడీ సినిమా మరో ఘనత సాధించింది. రణ్వీర్ సింగ్, అలియాభట్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది.
ఆస్కార్ అవార్డుల రేసులో ఇండియా నుంచి గల్లీబాయ్ సినిమా ఎంపికైంది. దాదాపు 28 సినిమాల్ని పరిశీలించి, ఫైనల్ గా గల్లీబాయ్ సినిమాను ఎంపిక చేశారు. జ్యూరీ చూసిన 28 సినిమాల్లో తెలుగు నుంచి డియర్ కామ్రేడ్ కూడా ఉంది. చివరికి అన్ని సినిమాల్ని అధిగమించి, ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఆస్కార్ బరిలో నిలిచింది గల్లీబాయ్.
స్లమ్ లో పుట్టిన ఓ కుర్రాడు, సంగీత ప్రపంచంలో ఎలా ఎదిగాడనే కథతో జోయా అక్తర్ తెరకెక్కించిన సినిమా ఇది. జోయాతో పాటు ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న విడుదలైంది ఈ సినిమా.
ఈసారి ఆస్కార్ అవార్డుల సంరంభం కాస్త ముందుగానే ప్రారంభం కాబోతోంది. ఏటా ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదటి వారంలో మాత్రమే జరిగే ఈ అవార్డుల వేడుక ఈసారి మాత్రం ముందే ప్రారంభం అవుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9నే ఆస్కార్ అవార్డుల ఉత్సవం లాస్ ఏంజెల్స్ లో ఘనంగా జరగనుంది.