చంద్రయాన్-2: ల్యాండర్ ఇక లేనట్టే!

చంద్రునిపై పగలు ముగిసింది. రాత్రి ప్రారంభమైంది. చంద్రునిపై ఒక రాత్రి అంటే భూమిపై అది 14 రోజులతో సమానం. సో.. 14 రోజుల పాటు విక్రమ్ ల్యాండర్ తో సంబంధాలు తెగిపోయినట్టే. ఆ తర్వాత…

చంద్రునిపై పగలు ముగిసింది. రాత్రి ప్రారంభమైంది. చంద్రునిపై ఒక రాత్రి అంటే భూమిపై అది 14 రోజులతో సమానం. సో.. 14 రోజుల పాటు విక్రమ్ ల్యాండర్ తో సంబంధాలు తెగిపోయినట్టే. ఆ తర్వాత కూడా ల్యాండర్ తో సంబంధాలు ఏర్పాటుచేసుకోవడం అసాధ్యమని ప్రకటించింది ఇస్రో. ఎందుకంటే రాత్రిపూట చంద్రుని ఉపరితలంపై ఉష్ణోగ్రతలు మైనస్ 130 డిగ్రీలుంటుంది. ఒక్కోసారి ఇది మైనస్ 200 డిగ్రీలను కూడా చేరుకుంటుంది. ఇంత తక్కువ ఉష్ణోగ్రతల్ని ల్యాండర్ తట్టుకోలేదు. అందులో బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయిపోతుంది.

ఎప్పుడైతే ల్యాండర్ తన చార్జింగ్ కోల్పోతుందో, అప్పుడిక కమ్యూనికేషన్ కట్ అయినట్టే. ఇదే విషయాన్ని ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు. భువనేశ్వర్ ఐఐటీలో ప్రసంగించిన చైర్మన్.. విక్రమ్ ల్యాండర్ తో కనెక్షన్ కట్ అయిన విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. అయితే చంద్రయాన్-2 మాత్రం 98శాతం సక్సెస్ అయినట్టు ప్రకటించారు.

ఆర్టిటార్ తో పాటు 8 పరికరాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. అంటే ఇస్రో దృష్టిలో విక్రమ్ ల్యాండర్ సక్సెస్ వాటా 2శాతం మాత్రమే. టెక్నికల్ గా ల్యాండింగ్ సాఫీగా జరగనప్పటికీ.. చంద్రుని దక్షిణ దృవంపైకి వెళ్లిన తొలి దేశంగా ఇండియా రికార్డు సృష్టించిందని ప్రకటించారు శివన్.

చంద్రయాన్-2 తర్వాత ఇస్రో తన ఫోకస్ మొత్తాన్ని గగన్ యాన్ పై పెట్టింది. చంద్రయాన్ కంటే క్లిష్టమైన మిషన్ ఇది. ఇన్నాళ్లూ మానవరహిత ప్రయోగాలు మాత్రమే చేసిన ఇస్రో.. గగన్ యాన్ ద్వారా వ్యోమగోముల్ని అంతరిక్షంలోకి పంపించాలని నిర్ణయించింది. దీనికోసం ఇప్పటికే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి ఎంపిక ప్రక్రియ చేపట్టింది. ముందుగా భారత్ లో, తర్వాత రష్యాలో వాళ్లకు శిక్షణ ఇచ్చి ఆ తర్వాత అంతరిక్షంలోకి పంపిస్తారు. ఇకపై తమ దృష్టి మొత్తం గగన్ యాన్ పైనే ఉంటుందని స్పష్టంచేసింది ఇస్రో.