కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇండియాలో థియేటర్లు బంద్ అయ్యి దాదాపు నాలుగు నెలలు గడిచాయి. ఇండియాలో మళ్లీ థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయనేది ఇప్పుడు అంచనా వేయలేని అంశంగా మిగిలింది. జూలై ఆఖరుకు థియేటర్లు ఓపెన్ అవుతాయని కొంతమంది మొదట్లో అంచనా వేశారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.
దేశంలో కరోనా కేసులు ఏ రోజుకారోజు పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రముఖ నగరాల్లో మళ్లీ లాక్ డౌన్ పెట్టారు. నిత్యవసరాలను అమ్మే షాపులకు కూడా మధ్యాహ్నం 12 వరకే అనుమతి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశాలు ఇప్పుడప్పుడే కనిపించడం లేదు. కరోనా నియంత్రణ ఎప్పటికి సాధ్యం అవుతుందనేదాన్ని బట్టే థియేటర్లు తెరవడం ఉంటుందని స్పష్టం అవుతోంది.
ఆ సంగతలా ఉంటే.. కొన్ని కొన్ని దేశాల్లో మాత్రం థియేటర్లలో సినిమాలు ఆడుతున్నాయి. పరిమిత సంఖ్యలో, అనేక జాగ్రత్తలు తీసుకుని కొన్ని యూరప్ దేశాల్లో థియేటర్లు తెరిచారు. కరోనాను పెద్దగా లెక్క చేయని దేశాల్లో శ్రీలంక కూడా ఉంది. తాము క్రికెట్ టోర్నమెంట్ లకు కూడా ఆతిథ్యం ఇస్తామంటూ శ్రీలంక ప్రకటిస్తూ ఉంది. అక్కడ థియేటర్లు కూడా ఓపెన్ లో ఉన్నట్టున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ తమిళ సినిమాలకు అవకాశం లభిస్తోంది.
తమిళ హీరో విజయ్ సినిమాలు అక్కడ రీరిలీజ్ అవుతున్నాయని సమాచారం. ఆ మధ్య వచ్చిన బిజిల్ సినిమాను శ్రీలంకలోని తమిళ ఆడియన్స్ కోసం మళ్లీ విడుదల చేశారట. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇండియన్ సినిమాలకు కాసులు రావడం లేదు, ఇలాంటి సమయంలో విజయ్ సినిమాలకు పరిమిత స్థాయిలో అయినా శ్రీలంక నుంచి బాక్సాఫీస్ కలెక్షన్లు సాధ్యం అవుతున్నట్టున్నాయి.