బస్సుల అమ్మకాలు, కొనుగోళ్లలో అక్రమాల్లో అరెస్టైన తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని రాయలసీమ నలువైపులా తిప్పుతున్నారు పోలీసులు. జేసీల అక్రమాలపై ఫిర్యాదులు నమోదైన చోటకు ఆయనను తీసుకెళ్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ లను హైదరాబాద్ లో అరెస్టు చేశారు పోలీసులు. అప్పుడేమో విక్టరీ సింబల్ చూపుతూ ప్రభాకర్ రెడ్డి జైలుకు వెళ్లారు. అనంతపురం సమీపంలోని రెడ్డిపల్లి జైలు కరోనా రెడ్ జోన్లో ఉండటంతో ప్రభాకర్ రెడ్డిని కడప జైలుకు తరలించారు. అక్కడ నుంచి విచారణకు అంటూ అనంతపురం తీసుకొచ్చి, అనంతరం కడపకు తీసుకెళ్ల సాగారు పోలీసులు.
ఇక జేసీల బస్సుల అమ్మకాల వ్యవహారంలో కర్నూలు జిల్లాలో కూడా కేసులు నమోదయ్యాయి. అక్కడ ఎవరో ఒక డ్రైవర్ ను బినామీగా పెట్టి అతడి పేరు మీద ముందుగా బస్సులు రిజిస్టర్ చేయించి, ఆ తర్వాత జేసీల ఇంట్లో వాళ్ల పేర్ల మీదకు వాటిని ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారట. అందుకు సంబంధించి కేసు నమోదు కాగా.. ప్రభాకర్ రెడ్డిని కర్నూలుకు తరలించారు పోలీసుల. కడప నుంచి అనంతపురమే గాక కడప టు కర్నూలుకు జేసీ పోలీసులు ప్రొటెక్షన్ తో తిరుగుతున్నారు. విచారణ అనంతరం మళ్లీ కడపకు తరలించారు పోలీసులు.
తాము ఏం తప్పు చేయలేదు అనే దశ నుంచి జరిగిన తప్పులను ఒప్పుకునే వరకూ వచ్చారట ప్రభాకర్ రెడ్డి. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాము చేసిన తప్పులు రుజువైనా మహా అంటే ఫైన్ పడుతుందని, అది కట్టడం తమకు పెద్ద కథేం కాదని తేల్చారు. అక్రమాలు జరిగాయని ఆయనే ఒప్పుకున్నట్టుగా అయ్యింది. జేసీ ట్రావెల్స్ అక్రమాలకు పడేది ఫైన్లే కావొచ్చు, కానీ అది తేలడానికి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన తప్పు ఫైన్ తో పోతుందా? అంతకు మించి శిక్ష ఉంటుందా? అనేది తేల్చాల్సింది మాత్రం ప్రభాకర్ రెడ్డి కాదు. దానికి కోర్టులున్నాయి. తనకు పడే శిక్షేమిటో కూడా ప్రభాకర్ రెడ్డే చెప్పేస్తే అయిపోదు కదా.. చట్టం తన పని తను చేసుకుపోవాలి!