‘ఆఫ్టర్ ఒన్ ఇయర్..’ అని రాజేంద్ర ప్రసాద్ డైలాగు చెప్తేనే పడిపడి నవ్వాం. ప్రస్తుతం ఏ ఉద్యోగం, సద్యోగం లేకుండా ఏడాది తర్వాత ఏలిక నవుతాను అంటూంటే ఫన్నీగా తోచింది. అలాటిది ‘24 ఏళ్ల తర్వాత దేశాన్ని ఎలా రూపుదిద్దుతానంటే..’ అంటూ 73 ఏళ్ల నాయకుడు చెప్తూంటే నవ్వుతో పాటు ఏడుపు కూడా వస్తుంది. వయసు మాట ఎలా ఉన్నా చెప్పవలసినది ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి, ఆయన యిప్పటికే చెప్పేశాడు. ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా 2047 నాటికి ఎలా ఉండాలో ప్రణాళికలు రూపొందించాలని పిలుపు నిచ్చాడు కూడా. దాని సాధ్యాసాధ్యాలే చర్చనీయంగా ఉంటే, మధ్యలో ఓ రాష్ట్రస్థాయి నాయకుడు కూడా తనకూ విజన్ ఉందంటూ చెప్పడమేమిటి? పైగా అది ఎంత సైజు రాష్ట్రం? మొత్తం ఎంపీలల్లో 5% కంటె తక్కువ ఎంపీలున్న రాష్ట్రం! పోనీ ఆ రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్నారా? లేదే! ప్రతిపక్షంలో, అదీ అధికార పార్టీ ఎమ్మెల్యేలలో దాదాపు ఏడో వంతు ఎమ్మెల్యేలున్న పార్టీకి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి!
కలలు కనవచ్చు, ఏళ్ల తరబడి ప్రతిపక్షంలో ఉండి తీరిక ఎక్కువైతే పగటికలలూ కనవచ్చు. అవి పీడకలలు అవుతూంటే పగటికలల గురించి ఎవరికీ చెప్పకుండా ఉంటే మర్యాదగా ఉంటుంది. ‘నాకు అధికారం ఊడగొట్టి మీరు చాలా తప్పు చేశారు, మళ్లీ అధికారం అప్పగించి తప్పు దిద్దుకోండి’ అంటూ బాబు ప్రజలను హుంకరిస్తూ ఉంటే ఇదేమిటి అనుభవజ్ఞుడైన ఒక రాజకీయ నాయకుడు యిలా మాట్లాడవచ్చా? అని ఆశ్చర్యపడుతుండగా యీ ప్రకటన వచ్చి మరీ మతి పోగొట్టింది. విజన్ 2020 ప్రహసనం మఱపున పడిందా ఏమిటాని సందేహం వచ్చింది. చంద్రబాబు విజన్ 2020 అని ప్రకటించినపుడు ఆయన అధికారంలో ఉన్నాడు. రాష్ట్రానికి యీ టార్గెట్లు అని పెట్టుకున్నానన్నాడు. ప్రజలకు విజన్ యివ్వగానే వాళ్లకు అర్థమై పోయింది, యీయన కబుర్లపోగే తప్ప, కార్యవాది కాదని. వెంటనే 2004లో దింపేశారు.
తనకు అధికారం పోతుందని, పదేళ్లపాటు ప్రతిపక్షంలో మగ్గవలసి వస్తుందనే విజన్ ఆయనకు లేకపోయింది. అంతెందుకు 2019లో పార్టీ చరిత్రలో కనీవినీ ఎరగనంత ఘోరపరాజయం కలుగుతుందన్న విజన్ కాదు కదా, సూచన కూడా ఆయనకు లేకపోయింది. జాతీయ స్థాయిలో మోదీ గతంలో కంటె ఎక్కువ మెజారిటీతో తిరిగి వస్తాడనే విజన్ లేక, రెచ్చిపోయాడు, యిప్పటిదాకా సర్దుకోలేక పోతున్నాడు. తన ఎదుట ఏముందో కానుకోలేనివాడు 24 ఏళ్ల తర్వాత మీరెలా ఉంటారో, ఎలా ఉండాలో నేను చెప్తానంటూంటే ఏమనాలి? 24 ఏళ్ల తర్వాతి మాట సరే, తెలంగాణలో ఎన్నికలకు 24 వారాలు కూడా లేవు. ఉన్నది 16 వారాలు మాత్రమే. ఆ ఎన్నికల్లో గెలవడానికి మీ విజన్ ఏమిటి? ‘తెలంగాణలో మళ్లీ మేం చురుగ్గా ఉన్నాం, కాసాని జ్ఞానేశ్వర్ నియామకం తర్వాత క్యాడర్‌లో హుషారు వచ్చింది. బిసిలందరూ తమ అభిమాన పార్టీ ఐన టిడిపిని అధికారంలో తేవడానికి ఉబలాట పడుతున్నారు. ఆంధ్రమూలాల వారు మాకు ఎప్పుడు ఓటేద్దామాని తహతహ లాడుతున్నారు. ఆ తహతహ గమనించే, ఆ ఓట్ల కోసం బిజెపి మా పొత్తుకోసం వెంపర్లాడుతోంది. మమ్మల్ని చూసి కెసియార్‌కు వణుకు ప్రారంభమైంది.’ అని మీరు చెప్పారు, మీ మీడియా ద్వారా చెప్పించారు.
నాలుగు నెలల్లో ఎన్నికలున్నా ఏ చప్పుడూ లేదు. ఎందరు పోటీ చేస్తారో, ఎక్కడ పోటీ చేస్తారో సందడి లేదు. నాయకులు కాంగ్రెసులో చేరుతున్నారు తప్ప, టిడిపిలో చేరటం లేదు. తీగల కృష్ణారెడ్డి వంటి ఆత్మీయుడు కూడా కాంగ్రెసుకే వెళుతున్నాడు. ఈ విజన్ తెలంగాణలో అమలు చేయాలంటే మరి అక్కడ ఉనికి ఉండాలి కదా! ఆ దిశగా ఏం చేస్తున్నారు? అబ్బే యిది వాళ్లకు కాదు, యీ విజన్‌తో ఆంధ్రులను మెప్పించడమే నా లక్ష్యం అంటారా? అక్కడా 36 వారాల్లో ఎన్నికలు పెట్టుకుని, సమీప భవిష్యత్తులో మీరేం చేస్తారో తెలియటం లేదు. కొన్ని నియోజక వర్గాల్లో ఇన్‌చార్జిలే లేరట. బిజెపితో పొత్తు ఉందో లేదో తెలియదు, జనసేనతో పొత్తు ప్రకటించడానికి కూడా తటపటాయింపే. జనసేనకు ఎన్ని సీట్లు యిస్తారో తెలియదు. రొక్కించి అడిగితే ఎన్నికల తరుణం వచ్చినపుడు చెప్తామంటారు.
తొమ్మిది నెలల షార్ట్ టెర్మ్‌లో జరిగే పరిణామాలే చెప్పలేనివారు 24 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో, ఎన్నేసి మార్పులు వస్తాయో ఎలా చెప్పగలరు? 1999లో 24 ఏళ్ల క్రితం బాబు ఎలా ఉండేవారు? బిజెపిని ఆడించే స్థితిలో ఉండేవారు. మరి యిప్పుడు బిజెపి కటాక్షవీక్షణంకై అర్రులు చాస్తున్నారు. పూర్తి మెజారిటీతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఏలుతూ, దీర్ఘదర్శి ఐన ముఖ్యమంత్రిగా దేశమంతా మీడియాను మెస్మరైజ్ చేస్తూ, కూటమి కన్వీనరుగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ వెలిగిపోతూ ఉండేవారు. మరి ఈనాడు? సగం చీలిన రాష్ట్రంలో 23 మంది ఎమ్మెల్యేలను మాత్రం గెలిపించుకుని, వారిలో ఎంతమంది తనకు విధేయులుగా తెలియని స్థితిలో, తన కంటె 23 ఏళ్లు చిన్న ఐన జగన్ పార్టీ నేతృత్వంలోని వైసిపిని ఒంటరిగా ఎదిరించే ధైర్యం చాలక, పొత్తుల కోసం వెంపర్లాడే స్థితిలో ఉన్నారు. ఇలా ఉంటానని 24 ఏళ్ల క్రితం ఊహించలేని బాబు, 24 ఏళ్ల తర్వాత తను ఫలానా విధంగా ఉండబోతానని, తన పార్టీ, దేశం యిలా ఉండబోతాయని ఊహించడం సాధ్యమా?
ఇవన్నీ రాజకీయ పరిణామాలు, ఆ విజన్‌లో రాసినవి సాంకేతిక అంశాలు అంటారా? ఏ ప్రణాళికైనా అమలు చేయాలంటే రాజకీయాధికారం ఉండాలి. ఇలాటి విజన్ డాక్యుమెంట్లు ఎవరైనా రాసేయచ్చు. విజన్ 2020 రాసినదెవరు? రూ. 2.5 కోట్ల ప్రభుత్వధనం పుచ్చుకుని, మెక్‌కిన్సే వాళ్లు 337 పేజీల డాక్యుమెంటు రాసి చేతిలో పెట్టారు. అయితే దాన్ని అమలు చేయడం వాళ్ల పని కాదు కదా! అమలు చేయబోతే వచ్చిన రిస్కు వాళ్లు భరించలేదు కదా! అమలు కాలేదేమని అడిగితే జవాబిచ్చే బాధ్యత వాళ్లది కాదు కదా! అమలు చేసే అధికారం ప్రజలివ్వాలి. ప్రజలు ‘అంత లావు విజన్లు మాకు వద్దు లెండి, మీకు అధికారం యిచ్చే ఐదేళ్లలో ఏం చేస్తారో మానిఫెస్టోలో పెట్టండి చాలు, అది ఎంత బాగా అమలు చేశారో చూసి, మరో ఐదేళ్లు మిమ్మల్ని కంటిన్యూ చేయాలో లేదో చూసుకుంటాం’ అంటూంటే పాతికేళ్ల విజన్ డాక్యుమెంటంటూ కళ్ల ముందు ఆడిస్తే చికాకేయదూ?
దీర్ఘకాలిక ప్రణాళికలనేవి ప్రభుత్వం తరఫు నుంచి వేస్తారు. ఒకసారి ఆమోదించాక, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అవి ఏదో ఒక స్థాయిలో కొనసాగుతాయి. భారత ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికలంటూ వేసింది. కొన్ని రంగాల్లో సఫలమైంది, మరి కొన్నిటిలో విఫలమైంది. ఈ ప్రణాళికల కోసమే ప్లానింగ్ కమిషన్ అని పెట్టారు. ఇప్పుడు నీతి ఆయోగ్ అంటున్నారు. ప్రభుత్వం వేసిన ప్రణాళికలన్నీ సరిగ్గా అమలవుతాయని లేదు. ప్రతీ ఏడూ రాబోయే ఏడాది కోసం బజెట్ వేస్తారు. తర్వాతి బజెట్ వేళకు పాత బజెట్ ఏమేరకు నెరవేరిందో అంకెలు యిస్తారు. అనుకున్నంత ఆదాయం రాలేదు, ఖర్చులు పెరిగాయి అంటారు. అంచనాలకు, వాస్తవాలకు పొంతన ఉండదు. అయినా కొత్త బజెట్‌లో ఆకాశానికి నిచ్చెనలు వేస్తారు. ఒక్క ఏడాదికై వేసిన అంచనాలే తారుమారై నప్పుడు, 24 ఏళ్ల అంచనాలు ఎంత గల్లంతవుతాయో ఊహించాల్సిందే!
టెక్నాలజీ అత్యంత డైనమిక్‌గా మన జీవితాలను మార్చేస్తున్న యీ కాలంలో మోదీ అయినా, బాబు అయినా, రేపు జగన్ అయినా, కెసియార్ అయినా పాతికేళ్ల ప్రణాళికలు వేయగలరా? ఇప్పటి పరిస్థితిని 24 ఏళ్ల క్రితం ఎవరైనా అంచనా వేయగలిగారా? చైనా యింత వృద్ధి చెందుతుందని, ప్రపంచానికే మాన్యుఫేక్చరింగ్ హబ్‌గా మారుతుందని, అమెరికా చైనాను చూసి దడుస్తుందని ఊహించారా? దక్షిణ కొరియా వంటి చిన్న దేశం యింత ప్రగతి సాధిస్తుందని, ఆమెరికా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టు లాడుతుందని ఊహించారా? యూరోప్ స్థితి, ముఖ్యంగా రవి అస్తమించని సామ్రాజ్యమేలిన ఇంగ్లండ్ స్థితి, నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నట్లుగా అవుతుందని అనుకున్నారా? అంతెందుకు మూడేళ్ల క్రితం కరోనా వచ్చి ప్రపంచాన్ని పదేళ్ల వెనక్కి తీసుకుపోతుందని ఊహించ గలిగారా? మూడు వారాలు యింట్లో ముణగదీసుకుని కూర్చుంటే, లైట్లార్పేసి బాల్కనీలోకి వెళ్లి ‘పో కరోనా పో’ అని కేకలు పెడితే, కంచాలు బాదితే, కరోనా పోతుందని నిపుణులు, పాలకులు చెప్పారు. తీరా చూస్తే కరోనా పోలేదు, మనుషుల ప్రాణాలు పోయాయి. జీవితాలు అతలాకుతలమై పోయాయి. అనేక పరిశ్రమలు చావుదెబ్బ తిన్నాయి. ఇప్పటికీ కరోనా భయం తొలగిపోలేదు. కొత్త వేరియంట్ వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది.
మూడేళ్ల క్రితం మాట సరే, ఏడాదిన్నర క్రితం ఉక్రెయిన్ యుద్ధం రాబోతుందని, యిన్నాళ్లు కొనసాగుతుందని, యూరోప్ అంతా ఎనర్జీ క్రైసిస్ వస్తుందని, ప్రపంచం మొత్తంపై ప్రభావం పడుతుందని ఎవరైనా చెప్పగలిగారా? ఏఐ వచ్చి ఉద్యోగాలు ఊడగొడుతుందని అనుకున్నారా? గూగుల్ అనువాదం వచ్చి అనువాదకుల పని పోగొట్టింది, ఇంగ్లీషు కరపత్రాలు తెలుగులో రాసిపెట్టి వందో, రెండు వందలో తెచ్చుకునేవారికి పని పోయింది అనుకుంటూ ఉంటే చాట్ జిపిటి వచ్చి ఎంత మార్చేసింది! క్రియేటివ్ రైటర్స్ కూడా గడగడ వణుకుతున్నారు. మొన్న జైలర్ సినిమాకు ఏఐ జనరేటెడ్ రివ్యూ అంటూ ఎవరో పంపారు. ఇక సినిమా సమీక్షకులకూ ఉద్యోగగండమే! హింట్ యిస్తే చాలు జీమెయిల్ నీ తరఫున మొత్తం మెయిల్ రాసి పడేస్తుంది అంటున్నాడు సుందర్ పిచ్చాయ్.
కంప్యూటర్లు వచ్చాక టైపిస్టు ఉద్యోగాలు, స్టెనో ఉద్యోగాలు అన్నీ ఎగిరాయి. నెట్‌లో బొమ్మలు డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం వచ్చాక కథల యిలస్ట్రేటర్లకు పని పోయింది. ఏఐ వచ్చాక కథే రాసి పడేస్తోంది. గూగుల్ ఏఐ కళ్లు స్కాన్ సర్వస్వం చెప్పేస్తే డయాగ్నస్టిక్స్ లాబ్స్‌కి పనేం మిగులుతుంది? ఇవన్నీ రెండేళ్ల క్రితం ఊహించారా? గత 20, 25 ఏళ్లలో కంటె ప్రపంచగతిలో మార్పు (ఏక్సిలరేషన్) రాబోయే 25 ఏళ్లలో మరింత పెరుగుతుందని గుర్తిస్తే యీనాడు వేసే దీర్ఘప్రణాళికలన్నీ తప్పుతాయనే అనిపిస్తుంది. కలాం గారు గొప్ప సైంటిస్టు. మేధావి. ఆయన మిషన్ 2020 అని ఉద్యమాన్నే నడిపారు. 2020 నాటికి ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత యువత శాతం మన దేశంలో ఉంటుందని, దానితో ఎన్నో అద్భుతాలు చేయవచ్చని ప్రవచించారు.
హైదరాబాదులో లీడ్ ఇండియా ఫౌండేషన్ అనే సంస్థ దాన్ని బాగా ప్రచారంలోకి తెచ్చింది. 2020 నాటికి యిది చేస్తాం, అది చేస్తాం అంటూ యిప్పుడు బాబు తరహాలోనే ప్రతి మీటింగులో ప్రతిజ్ఞలు చేయించింది. మా వరప్రసాద్ లీడ్ ఇండియాకు ఊతమివ్వడంతో నేను వాళ్లకు ఎంతో లిటరేచర్ రాసి యిచ్చాను. అలవాటు లేకపోయినా ఒక పాట కూడా రాశాను. 2020 వచ్చింది. జనాభాలో సంఖ్యపరంగా యువత శాతం ఎక్కువే ఉంది కాబోలు. కానీ యువత సాధించినది ఏముంది? నిరుద్యోగంలో మగ్గుతోంది. ఏ ఎన్నిక జరిగినా నిరుద్యోగిత అనేదే ప్రధాన అంశంగా ఉంది. ఎందుకంటే ప్లాన్లు వేయడం, దాన్ని ప్రతిభావంతంగా కమ్యూనికేట్ చేయడం ఒకరకంగా సులభమే. కానీ దాన్ని అమలు చేయగలగాలి. కలాం గారికి అమలు చేసే అధికారం లేకపోయింది. ఆయన ప్రేరణ కలిగించారంతే. పాలకులు సంకల్పిస్తే తప్ప పనులు కావు.
ఇక పాతికేళ్లలో ఇండియా ప్రపంచంలో రెండో, మూడో ఆర్థికశక్తిగా ఎదుగుతుంది.. వంటి కబుర్లు నమ్మడానికి లేదు. అప్పటికి రాజెవడో, రంగడెవడో ఎవరూ చెప్పలేరు. ఆర్థిక సంస్కరణల కాలం నుంచి వింటున్నా, స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ పెరగగానే, ఇండియా లేచింది, ఏనుగు ఘీంకరించింది అంటూ ఉత్ప్రేక్షలు రాసేయడం. కొన్ని నెలలకే అదంతా స్కామ్ అనడం. గ్లోబలైజేషన్ వలన కాస్త మంచి, ఎక్కువ చెడు జరిగింది. మ్యాన్యుఫేక్చరింగ్ రంగం కుదేలైంది. అన్నీ దిగుమతులతో బతుకుతున్నాం. చైనా మనకు ఎగుమతులు ఆపితే మందులతో సహా ఏమీ లేక గిలగిల్లాడతాం. సేవారంగంపైనే బతుకుతున్నాం, అది కూడా చైనావాళ్లు ఇంగ్లీషు నేర్చుకుని పోటీకి వచ్చేస్తే ఏఐతో యీ సెక్టార్ ఉద్యోగాలు పోతే మన గతి ఏమవుతుందో తెలియదు. అమెరికాలో ఆర్థికమాంద్యం కొనసాగితే అక్కణ్నుంచి వచ్చే రెమిటెన్సెస్ తగ్గి ఏమవుతామో తెలియదు.
ప్రజాస్వామ్యంలో అధికారం చేతులు మారినప్పుడల్లా ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలు యిచ్చే ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టడం దేనికి, రైతులకు ఋణమాఫీ చేద్దాం, సబ్సిడీలు పెంచుదాం అని కేంద్రంలోకి వచ్చిన కొత్త కూటమి అనుకోవచ్చు. రాష్ట్రాలలో కూడా ఐదేళ్ల కోసం యిచ్చే ఎన్నికల హామీలకే దిక్కు లేదు. మద్యనిషేధం చేస్తామంటారు, ఉద్యోగులకు పాత పెన్షన్ అంటారు. నెగ్గాక ‘ఇంత ఖర్చవుతుందని అనుకోలేదు, చిన్న కాలిక్యులేషన్ మిస్టేక్, సారీ’ అనేస్తారు. అలాటిది పాతికేళ్లకు ప్రణాళిక వేస్తానంటే నమ్మడం ఎలా? పైగా ప్రకృతి వైపరీత్యాలు ఏ మేరకు నష్టం చేస్తాయో తెలియదు. భూకంపం వస్తే…? సునామీ వస్తే…? ఎల్ నినో వస్తే… లెక్కలు తారుమారు కావా? ఇప్పుడు అన్నీ వైజాగ్‌లో పెడుతున్నారు. అది చూసి పెట్టుబడులు వచ్చి పడతాయంటున్నారు. మరో హుదూద్ యింకా గట్టిగా వస్తే పెట్టుబడిదారులు వెనుకంజ వేయవచ్చు. చంద్రబాబు సోలార్ ఎనర్జీ కోసం పాతికేళ్ల కాంట్రాక్టు కుదుర్చుకుంటే, బయట ధరలు తగ్గి ప్రభుత్వానికి నష్టదాయకంగా పరిణమించింది కదా! టెక్నాలజీ పెరగడంతో కొన్నిటి ధరలు అమాంతం పడిపోయాయి. ఇదివరకు ఫారిన్ కాల్స్‌పై సెల్‌ఫోన్ కంపెనీలు ఎంత ఆర్జించేవి? ఇప్పుడు వాట్సాప్ వచ్చాక ఆదాయానికి గండి పడలేదా? ఒటిటి వచ్చాక థియేటర్ల ఆదాయం తగ్గలేదా?
ఏది ఏమైనా రంగుల కలలు చూపించే హక్కు అధికారంలో ఉన్నవాళ్లకు ఉంటుంది. కానీ బాబుకి ఏ అధికారమూ లేదు. ప్రభుత్వం నుంచి కాకుండా, ఒక ప్రాంతీయ పార్టీ తరఫు నుంచి ప్లాను వేయడం వింతగా తోస్తోంది. సామర్థ్యంలో, దూరదృష్టిలో బాబు జాతీయ, అంతర్జాతీయ నాయకుడు కావచ్చు. కానీ ఆయనకు ప్రస్తుతం ఏ పదవీ లేదు. ఎన్డీఏ, ఇండియా కూటమి ఏదీ దగ్గరకు రానీయటం లేదు. ఎవరైనా రానిస్తే మా కూటమి విజన్ యిది, యిదే మా కామన్ మినిమమ్ ప్రోగ్రాం అని వాళ్ల ద్వారా ప్రజలకు చెప్పిస్తే ఓ మాదిరిగానైనా ఉండేది. ఎందుకంటే యీయన ప్రస్తావించినవన్నీ జాతీయ అంశాలే. రాష్ట్రం గురించి విజన్ వేసి చూపిస్తే ఓహో అలాగా అనుకునేవాళ్లం, అదీ ప్రభుత్వంలో ఉండి ఉంటే, అదీ యీయన విజన్‌ను తర్వాతి ప్రభుత్వం కొనసాగిస్తుందన్న నమ్మకం ఉంటే!
ఈయన అమరావతి విజన్ జగన్ రాగానే మసకబారి పోయింది. ఇలాటి రాజకీయ వాతావరణంలో ఎందుకీ పాతికేళ్ల విజన్లు? విజన్ వేయగానే సరికాదు, అమలు చేయగలగాలి. తనకు అధికారం దక్కిన ఐదేళ్లలో అమరావతి ఏ మాత్రం కట్టగలిగాడాయన? 24 ఏళ్లలో భూమ్యాకాశాలు ఏకం చేస్తానంటే నమ్మగలరా? అయినా యిలాటి పథకాలు రాష్ట్రం చేతిలో ఉంటాయా? కేంద్రం నిధులు విదిలిస్తేనే పనులవుతాయి. విజన్ 2020 ఫ్రేమ్ చేసిన 1999 నాటి కంటె యిప్పుడు కేంద్రం చేతిలో మరిన్ని అధికారాలున్నాయి. ఇక్కడ ఏం ప్లాన్ చేసినా పెద్దగా ప్రయోజనం లేదు. విద్యుత్ పాలసీ, ఆయుష్మాన్ భారత్, విద్య, వ్యవసాయం, పన్నులు.. ఒకటా, రెండా.. పాలసీలన్నీ కేంద్రమే డిజైన్ చేస్తోంది. ఒన్ నేషన్ .. స్లోగన్ కింద అన్నీ దాని యిష్టప్రకారమే చేస్తోంది. రాష్ట్రం పరిధిలో ఉండే అంశాల్లో కూడా చొరబడుతోంది.
ఆహారధాన్యాల ఎగుమతి, వ్యవసాయంలో కార్పోరేట్ భాగస్వామ్యం, ఫెర్టిలైజర్‌ల లభ్యత, పంటలకు మద్దతు ధర, పంటల కొనుగోలు.. యిలా అనేక విషయాలు కేంద్రం చేతిలో ఉండగా వ్యవసాయం గురించి అసలెవరైనా రాష్ట్రస్థాయిలో చేసేదేముంది? పరిశ్రమల విషయంలో కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తానంటే ఏం చేయగలుగుతున్నారు? జింక్ ఫ్యాక్టరీ లాగా రేపు దీన్నీ మూసేస్తే ఉద్యోగాలు పోతాయి. అక్కడి ఎకానమీ దెబ్బ తింటుంది. మీరు వేసుకున్న ప్లాన్లన్నీ చెట్టెక్కుతాయి. బాబు విజన్‌లో నదుల అనుసంధానం కూడా ఉంది. అది రాష్ట్రస్థాయిలో నిర్ణయించగల అంశమా? పొరుగున ఉన్న తెలంగాణతో నీటి పంచాయితీ తేల్చుకోలేని మాజీ ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా ఉన్న నదులు ఎలా కలపాలో, ఎవరెంత వినియోగించు కోవాలో చెప్తానంటే కుదిరే విషయమా?
బాబు ఏమిటేమిటో చెప్పేస్తారు. పల్లెటూళ్లో ఉంటూ తలిదండ్రులను చూసుకుంటూ, వర్క్ ఫ్రం హోమ్ చేసి నెలకు రెండు లక్షల దాకా తెచ్చేసుకోవచ్చట. వర్క్ ఫ్రం హోమ్ కాన్సెప్ట్ ఎంతకాలం ఉంటుందో తెలియదు. మూన్‌లైటింగ్ ఎక్కువై పోయిందని చెప్పి యిప్పటికే చాలా కంపెనీలు హైబ్రిడ్ అంటున్నాయి. మరి కొన్ని ఆఫీసుకి వచ్చి తీరాల్సిందే అంటున్నాయి. ఫ్రమ్ హోమో కాదో ఆ ముక్క చెప్పాల్సింది ఉద్యోగమిచ్చిన యజమాని, రాజకీయ నాయకుడు కాదు. లేదు, నేను హామీ యిచ్చాను, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే చేయించుకోండి అని యజమాన్లకు బాబు చెప్పగలరా? అలా అయితే మీరు మాత్రం ప్రచారం కోసం రోడ్లు పట్టుకుని తిరుగుతున్నారెందుకు? ఇంట్లో కూర్చునే ఉపన్యాసాలు దంచండి అని వాళ్లు యీయనకు చెప్తారు. అన్ని ఉద్యోగాలకూ వర్క్ ఫ్రం హోం నప్పుతుందా?
అసలు వర్క్ ఫ్రం హోం చేయాలంటే నిరంతరంగా కరంటు సరఫరా ఉండాలి. ఇంటర్నెట్ ఉండాలి. అవి యివ్వగలరా బాబు? ఇస్తానని చెప్పినా నమ్మవద్దు. 1999లో పై ఏడాది నుంచి ఇంటర్నెట్ కేబుల్ టీవీలా యింటింటికీ వచ్చేస్తుంది అని చెప్పాడీయన. ఆ కబుర్లు విని మేం ‘‘హాసం’’ పత్రికను వెబ్‌జైన్ (వెబ్‌లో మేగజైన్)గా కూడా ప్లాను చేశాం. ఇంటర్నెట్టు మాట అటుంచి, కరంటుకే దిక్కు లేకపోయింది. రేట్లు తారాస్థాయికి వెళ్లాయి. నిరసన తెల్పిన ఆందోళనకారులపై బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిగాయి. మేం చివరకి ఆశలు విడిచి 2001 అక్టోబరులో ‘‘హాసం’’ ప్రారంభించినప్పుడు ప్రింటు వెర్షన్‌కే వెళ్లాం. కొన్నాళ్లకు పాత సంచికలతో వెబ్‌జైన్ వెర్షన్ పెట్టాం కానీ అది అందరికీ చేరలేదు. ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నవాళ్లు అతి తక్కువమంది ఆ రోజుల్లో! ఉన్నా స్పీడు బాగా తక్కువ కావడంతో చదివే ఓపిక హరించుకు పోయేది.
ఇక విద్యుత్ మాటంటారా? అంతర్జాతీయ నగరం అని తెరాస గొప్పలు చెప్పుకునే హైదరాబాదులోనే పైనుంచి నాలుగు చుక్కలు పడితే కరంటు తీసేస్తారు, యిప్పటికీ. ఆంధ్రలో విద్యుత్ పరిస్థితి యింకా ఘోరం. వర్షం పడకపోయినా తీసేస్తారు. ఇలాటి పరిస్థితుల్లో వర్క్ ఫ్రం హోమ్‌తో కంపెనీలు నడుస్తాయా? నడవగలిగితే యిన్ని ట్రాఫిక్ సమస్యలెందుకు వస్తాయి? బాబు అంటే డాబు కబుర్లు ఎక్కువ అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన దీర్ఘ ప్రణాళిక ఎప్పటికి వేశారు? 2047 నాటికి! అప్పటికి ఆయనకు 97 ఏళ్లు. జీవించి ఉన్నా, పరిస్థితి అర్థం చేసుకునే స్థితిలో ఉంటారో లేదో తెలియదు. ‘నాకోసం కాదు, మీ కోసం గమ్యం నిర్దేశించాను, అది చేరలేకపోతే మీ అసమర్థత అనవచ్చా’యన. కొంతమంది తండ్రులుంటారు చూడండి ‘మా వాడికి చెప్పానండి, ఐఐటికి చదువు, సుందర్ పిచ్చాయ్‌ను పిచ్చెక్కించేటంత లెవెల్‌కు వెళ్లు.’ అని చెప్పా. వాడి టేబుల్ ముందు ఓ పక్క ఐఐటి అని రాసిన అట్ట, మరో పక్క సుందర్ బొమ్మ కూడా తగిలించా’ అంటారు. పిల్లాడు ఐఐటి పాసవకపోతే వాడిదే తప్పు! వీళ్లది కాదు. దట్సాల్!
బాబు 2047 విజన్ కంటె లోకేశ్ రెడ్‌బుక్ మిషనే నాకు ఎక్కువ నచ్చింది. ఇది షార్ట్ టెర్మ్ గోల్. 9 నెలలకల్లా దాన్ని ఏం చేయాలో తెలిసిపోతుంది. అధికారంలోకి వస్తే పగ సాధించడం ప్రారంభం. రాకపోతే దానికి మరి కొన్ని తెల్ల కాగితాలు కలిపి పుస్తకం బైండు చేయించి పెట్టుకోవడం! లోకేశ్ స్ఫూర్తిగా బాబు కూడా షార్ట్ టెర్మ్ ప్లానుగా తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించాలి. ఇది ఆయనకు రెండో కన్ను. తెలంగాణను వదిలిపెట్టనని జ్ఞానేశ్వర్ సాక్షిగా యిక్కడి ప్రజలకు హామీ యిచ్చారు. ఇక్కడా తిరగండి. ఇక్కడి పోలీసులనూ హెచ్చరించండి, అధికారంలోకి వస్తే పని పడతామని బెదిరించండి. మీకొచ్చే స్పందన చూసి బిజెపి పొత్తుకు ముందుకు వచ్చి మిమ్మల్ని ఎన్‌డిఏలో చేర్చుకునేట్లు కృషి చేయండి. అప్పుడు కేంద్రంలో ఎన్‌డిఏ చేత మిషన్ 2047 ప్లాను ప్రకటింప చేద్దురుగాని.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2023)