బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ట్విటర్ వేదికగా తనను బీజేపీ విమర్శించడంపై ఆమె ఘాటుగా స్పందించారు. ఈ మేరకు కవిత ట్వీటీ చేయడం విశేషం.
“33% రిజర్వేషన్‌పై కవిత మౌనం. బీఆర్ఎస్లో మహిళలకు దక్కని న్యాయం” హ్యాష్‌ట్యాగ్ లిక్కర్ స్కామ్, కేసీఆర్ ఫెయిల్డ్ సీఎం అంటూ బీజేపీ వ్యతిరేక ప్రచారాన్ని మొదలు పెట్టింది. అలాగే కవిత ఢిల్లీలో రిజర్వేషన్ కోసం గళమెత్తుతున్నారని, తెలంగాణ వచ్చేసరికి మహిళలను అణచివేతకు గురి చేస్తున్నారనే కార్టూన్‌ను కూడా బీజేపీ షేర్ చేయడంపై కవిత స్పందించారు.
కాలం చెల్లిన మూస పద్ధతిలో మహిళలను అవహేళన చేయడం మానుకోవాలని ఆమె హితవు చెప్పారు. మహిళలు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంటే బీజేపీ ఓర్వలేక పోతున్నదా? అని ప్రశ్నించారు. మహిళల గొంతు నొక్కడానికి కాషాయ పార్టీ ప్రయత్నాలు నవ్వులాటలా ఉన్నాయని ఆమె ఆగ్రహం ప్రదర్శించారు. ఇప్పటికైనా ప్రత్యర్థులపై నిందలు మాని పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించజేయాలని కవిత డిమాండ్ చేయడం గమనార్హం.
బీఆర్ఎస్ జాబితాలో మహిళలకు ఏడు శాతం లోపు సీట్లు కేటాయించడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీ వేదికగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం కవిత ఉద్యమించడాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణలో మాత్రం తన తండ్రి కేసీఆర్‌కు ఎందుకు నచ్చ చెప్పలేకపోయారనే ప్రశ్న వెల్లువెత్తుతోంది. ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోసారి కవిత వ్యవహరిస్తున్నారనే విమర్శల్ని ఆమె ఎదుర్కోవాల్సి వస్తోంది.