తెలంగాణలో మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంతో ముందుగానే అభ్యర్థులను కూడా ప్రకటించి, ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామంటే తామని కాంగ్రెస్, బీజేపీ ఆర్భాట ప్రకటనలు చేస్తున్నాయి. రెండు మూడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందడం, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్లో ఎక్కువ మంది బీఆర్ఎస్‌లో చేరడంతో ప్రత్యామ్నాయం ఆ పార్టీనే అనిపించింది.
అయితే కర్నాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్‌లో కొత్త జోష్ నింపాయి. కాంగ్రెస్ ప్రాభవం క్రమంగా పెరుగుతున్న భావన వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్‌ను వద్దనుకునే నేతలంతా కాంగ్రెస్‌నే ఎంచుకోవడం ఆసక్తికర పరిణామం. ఈ నేపథ్యంలో టీడీపీ బరిలో తానున్నానంటూ ఉత్సాహం ప్రదర్శిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. టీడీపీతో పొత్తే కాంగ్రెస్ పుట్టి ముంచిదని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
తాజాగా తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని, త్వరలో 45 మంది అభ్యర్థులతో కూడిన జాబితా విడుదల అవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో మాత్రం 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పే పరిస్థితి టీడీపీకి లేదు. తెలంగాణలో పార్టీ ఊసే లేని చోట అన్ని స్థానాల్లో పోటీ చేయాలని ఎందుకు అనుకుంటున్నదో ఆ పార్టీకే తెలియాలి. ఎటూ తెలంగాణలో టీడీపీ లేదని, కనీసం రాజకీయ నిరుద్యోగులకు పోటీ చేసే అవకాశం తప్ప, మరెందుకూ ఈ ఎన్నికల్లో పాల్గొనడం ద్వారా ఆ పార్టీకి ఉపయోగం లేదనే చర్చ నడుస్తోంది.
ఏపీలో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్న జనసేన కూడా తెలంగాణలో కొన్ని సీట్లలో పోటీ చేస్తుందని ఇటీవల పవన్‌కల్యాణ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ భవిష్యత్‌పై ఏ మాత్రం నమ్మకం లేనిచోట మాత్రం టీడీపీ బరిలో దిగుతూ, అంతోఇంతో బలంగా ఉన్న చోట మాత్రం పొత్తుల కోసం ఎదురు చూడడం టీడీపీకే చెల్లిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.